ఉద్యోగాల భర్తీ హుళక్కేనా? | Once again the state government has not fulfilled the hopes of the unemployed | Sakshi
Sakshi News home page

Oct 5 2017 12:50 AM | Updated on Aug 10 2018 8:31 PM

Once again the state government has not fulfilled the hopes of the unemployed - Sakshi

సాక్షి, అమరావతి: వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేనట్టేనని తెలుస్తోంది. బడ్జెట్‌ ప్రతిపాదనలకు సంబంధించి ఆర్థిక శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను బట్టి ఈ విషయం తేటతెల్లమవుతోంది. తద్వారా నిరుద్యోగుల ఆశలను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చిదిమేసినట్లే. ‘బాబు వస్తే జాబ్‌ వస్తుందని..’ ఎన్నికల ముందు ఊదరకొట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లయినా ఒక్కరికి కూడా కొలువు ఇవ్వలేదు. తాజాగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ప్రతిపాదనలు చేసేందుకు గానూ ఆర్థిక శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు వేతనాలు ప్రతిపాదించవద్దని అందులో స్పష్టం చేసింది. ప్రతి శాఖ కూడా తమ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలతో నంబర్‌ స్టేట్‌మెంట్‌ను మాత్రమే సమర్పించాలని ఆదేశించింది.

ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్యను గానీ వాటికి వేతనాల అంచనాలను గానీ అందులో ప్రతిపాదించవద్దని స్పష్టం చేసింది. అలాగే పర్మినెంట్, తాత్కాలిక, ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను కూడా అందించాలని ఆదేశించింది. అనుమతించిన కేడర్‌ సంఖ్య కన్నా ఎక్కువ మంది పనిచేస్తుంటే.. ఆయా వివరాలను కూడా పొందుపరచాలని ఉత్తర్వుల్లో సూచించింది. రాష్ట్ర విభజన తేదీ నాటికి రాష్ట్రంలోని అన్ని శాఖల్లో కలిపి 1.42 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ఆర్థిక శాఖే ప్రకటించింది. కానీ ఇప్పుడేమో ఖాళీ ఉద్యోగాల వివరాలను, వాటికి వేతనాల అంచనాలను ప్రతిపాదించవద్దని స్పష్టం చేయడంతో.. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా సర్కార్‌ కొలువులు ఎండమావే అని స్పష్టమవుతోంది. 

ఉద్యోగుల పనితీరును అంచనా వేయండి..!
ఇదిలాఉండగా, వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా జీరో విధానం బడ్జెట్‌నే ప్రతిపాదించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కేపిటల్, రెవెన్యూ వ్యయం పద్దుల కింద బడ్జెట్‌ను ప్రతిపాదించాలని పేర్కొంది. ఏ రంగాల వ్యయాన్ని కేపిటల్‌ పద్దు కింద, ఏ రంగాల వ్యయాన్ని రెవెన్యూ పద్దుల కింద ప్రతిపాదించాలో కూడా వివరించింది. కాగా, సంక్షేమ పథకాల కింద ఆర్థిక సాయం పొందుతున్న లబ్ధిదారుల అర్హతలను సంబంధిత శాఖలు సమీక్షించాలని సూచించింది. ఎటువంటి ప్రయోజనం లేని పథకాలు, కార్యక్రమాలను రద్దు చేయాలని ఆదేశించింది. ఏదైనా పథకాన్ని కొనసాగించాలని ప్రతిపాదిస్తే.. అందుకు అవసరమైన బలమైన కారణాలను స్పష్టం చేయాలని అన్ని శాఖలకు సూచించింది. అలాగే ఏదైనా పథకం కింద పోస్టులుంటే.. వాటిని రద్దు చేయాలని, కొనసాగించాల్సిన అవసరమేమైనా ఉంటే ఆ విషయాన్ని వివరించాలని పేర్కొంది. సిబ్బంది రెవెన్యూ వ్యయం తగ్గించాలని, ఎటువంటి ప్రయోజనం లేకపోతే ఆ మిగులు సిబ్బందిని ఆర్థిక శాఖకు సరెండర్‌ చేయాలని స్పష్టం చేసింది. ఆదాయం పెంపు మార్గాలను అన్వేషించడంతో పాటు ఉద్యోగుల పనితీరును అంచనా వేయాలని పేర్కొంది. ప్రస్తుతమున్న చార్జీలు, పన్నులు, ఫీజుల ఆధారంగానే వచ్చే బడ్జెట్‌కు కూడా రాబడిని అంచనా వేయాలని స్పష్టం చేసింది. 

ప్రస్తుత రేట్ల ప్రకారం అద్దెల వ్యయం ప్రతిపాదించండి..
కొత్త రేట్ల ప్రకారం పెట్రోల్, డీజిల్, విద్యుత్‌ చార్జీలు, టెలిఫోన్‌ బిల్లులు, అద్దెల వ్యయాన్ని ప్రతిపాదించాలని అన్ని శాఖలనూ ఆర్థిక శాఖ ఆదేశించింది. అద్దెలను ప్రభుత్వ శాఖలు సకాలంలో చెల్లించాలని, మూడు నెలల దాటినా అద్దెలు చెల్లించకపోతే బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపప్రణాళికలను ప్రస్తుత కేటాయింపులకు తగ్గకుండా.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కూడా ప్రతిపాదించాలని స్పష్టం చేసింది. ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు, ఐదు ప్రచారాలకు అనుగుణంగా బడ్జెట్‌ ప్రతిపాదనలు చేయాలని పేర్కొంది. 2018–19 బడ్జెట్‌ ప్రతిపాదనలను వచ్చే నెల 15లోగా ఆయా శాఖల కార్యదర్శులకు అందజేయాలని, వారు వాటిని అధ్యయనం చేసి వచ్చే నెల 25లోగా ఆర్థిక శాఖకు పంపించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ(ఎఫ్‌ఆర్‌బీఎం) ప్రకారం.. ప్రతి శాఖ కూడా ఆస్తులు, అప్పుల వివరాలతో పాటు రెవెన్యూ లక్ష్యాలు, వాస్తవంగా వచ్చిన రెవెన్యూ వివరాల నివేదికను సమర్పించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

భర్తీ సరేసరి.. ఉన్నవారిపైనా వేటు
ఎన్నికల ముందు చంద్రబాబు హామీలు గుప్పిస్తూ ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక రెగ్యులర్‌ చేయడం అటుంచి వారిని కూడా తొలగించడం మొదలెట్టారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లను, డ్వాక్రా యానిమేటర్లను, గ్రామ పంచాయతీల్లోని వేలాది మంది కంప్యూటర్‌ ఆపరేటర్లను తొలగించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోనే దాదాపు 20 వేల మంది ఇలా తొలగింపునకు గురయ్యారు. ఆదర్శ రైతులు, ఆరోగ్య మిత్రలు, గోపాల మిత్రలపై కూడా వేటు వేశారు. వీరి సంఖ్య కూడా వేలల్లోనే ఉంది. 

ఖాళీ పోస్టులు 2 లక్షలు.. నిరుద్యోగులు 30 లక్షలు!
రాష్ట్ర ప్రభుత్వం గతంలో కమలనాథన్‌ కమిటీకి అందించిన గణాంకాల ప్రకారం 13 జిల్లాల్లో మంజూరైన పోస్టులు 6,97,621 కాగా, అందులో 1,42,825 ఖాళీలున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచారు. ఆ గడువు కూడా పూర్తవ్వడంతో ఇప్పటివరకు 60 వేల మందికి పైగా ఉద్యోగులు రిటైరయ్యారు. వారిని కూడా కలిపితే ఖాళీల సంఖ్య దాదాపు రెండు లక్షలకు చేరుకుంటుంది. కానీ ఉద్యోగాల ఖాళీలపై ప్రభుత్వం తప్పుడు గణాంకాలు చెబుతోంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆర్థిక మంత్రి యనమల గతంలో ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్రంలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 4.83 లక్షలని, అందులో ఖాళీలు 77,737 మాత్రమేనంటూ నిరుద్యోగులకు షాకిచ్చారు. అలా ప్రకటించిన మేరకైనా పోస్టులు భర్తీ చేస్తారనుకుంటే అదీ లేదు.

ఈ పోస్టుల్లో కేవలం 20 వేలు మాత్రమే రెగ్యులర్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తామని, మిగిలిన వాటిని ఔట్‌సోర్సింగ్‌ ద్వారా నియమిస్తామని నిరుద్యోగులకు మొండిచేయి చూపింది. రాష్ట్రంలో ఏటేటా నిరుద్యోగుల సంఖ్య లక్షల్లో పెరుగుతున్నా వారికి తగ్గ ఉద్యోగాలను టీడీపీ ప్రభుత్వం చూపించడం లేదు. ఏటా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఇతర సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేస్తున్న వారి సంఖ్య ప్రభుత్వ లెక్కల ప్రకారమే 6 లక్షలకు పైగా ఉంటోంది. ఇలా ఏటా బయటకు వస్తున్న వారితో.. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారినీ కలిపితే నిరుద్యోగుల సంఖ్య 30 లక్షలకు పైగా చేరుకొని ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement