ఉన్నది పోయే.. సొంతిల్లు రాదాయే.. 

NTR Housing Scheme Bills Are Pending - Sakshi

తెచ్చిన అప్పునకు వడ్డీ, ఇంటి అద్దె చెల్లించలేక లబోదిబో

నిర్మాణాలు మొదలు పెట్టి నాలుగు నెలలవుతున్నా బిల్లులు నో

ఇదీ ఎన్టీఆర్‌ పట్టణ గృహనిర్మాణ పథకం తీరు  

పేదోడి సొంతింటి కల కలగానే మిగలనుంది. నిర్మాణాలు మొదలు పెట్టి నాలుగు నెలలు దాటినా ఒక్క రూపాయి కూడా లబ్ధిదారుని ఖాతాలో జమకాలేదు.అప్పుతెచ్చి నిర్మాణాన్ని మొదలు పెట్టిన వారు అధికారులచుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రయోజనం లేదు. 

ప్రొద్దుటూరు టౌన్‌ : జిల్లాలోని 9 మున్సిపాలిటీల పరిధిలో 2 సెంట్ల సొంత స్థలం ఉన్న వారికి ఎన్టీఆర్‌ పట్టణ గృహ నిర్మాణ పథకం 2017–18 ఏడాదికి  9241 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిల్లో 7894 మంది లబ్ధిదారులకు ఐడీ నంబర్‌ను ప్రభుత్వం ఇచ్చింది. వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న గృహాలు 3021. ఈ పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.2.50 లక్షల సబ్సిడీ, రూ.75 వేలు బ్యాంకు రుణం, రూ.25 వేలు లబ్దిదారుని వాటా కింద రూ.3.50 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తాన్ని నాలుగు దశల్లో లబ్ధిదారుని సొంత ఖాతాలో జమచేస్తారని తెలిపారు. ప్రభుత్వం హౌసింగ్‌శాఖ అధికారులను ఒత్తిడి చేయడంతో ఉన్న ఇంటిని తొలగించుకొని ఇంటి  పనులను మొదలు పెట్టారు.

బిల్లులు త్వరగా వస్తాయన్న నమ్మకంతో అప్పు తెచ్చి  పనులు చేయిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో  ప్రారంభించారు. నాలుగు నెలలుగా బిల్లులు రాకపోవడంతో హౌసింగ్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కొందరేమో డబ్బు లేక పనులు ఎక్కడికక్కడ నిలబెట్టారు.  అధికారపార్టీ నేతలు శంకుస్థాపనలకే పరిమితం అధికార పార్టీ నేతలు శంకుస్థాపన మహోత్సవం పేరిట కార్యక్రమాల్లో పాల్గొని ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారు. ఇంటి నిర్మాణ మంజూరు పత్రాన్ని ఇచ్చి డబ్బులు ఇచ్చినట్లు డప్పు కొట్టుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు వివిధ దశల్లో పూర్తయిన వాటికి చెల్లించాల్సిన మొత్తం రూ.1083.61లక్షలు. ఒక్క ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి రూ.2.76కోట్లు రావాల్సిఉంది. 

పెరిగిన గృహ నిర్మాణ సామగ్రి ధరలు
 ప్రభుత్వం గృహాల బిల్లులు మంజూరు చేయడంలో జరిగిన ఆలస్యం వల్ల స్టీల్‌ ధరలు జనవరి నెలకు ఇప్పటికి టన్నుకు రూ.13వేలు పెరిగాయి. ఇసుక ట్రాక్టర్‌ రూ.2,800లకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇసుక క్వారీలన్నీ అధికార పార్టీ నేతల కనుసన్నుల్లో ఉన్నాయి. దీంతో పేదలకు ఇసుక కొనుగోలు భారంగా మారింది. సిమెంటు ఇటుకలు వెయ్యి రూ.3,300 నుంచి రూ.4,500లకు పెరిగాయి. సిమెంట్‌ బస్తా ధర రూ.70 పెరిగింది.

దీంతో ప్రభుత్వం ఇచ్చే రూ.2.50 లక్షల సబ్సిడీతోనే ఇళ్లు నిర్మించు కోవడం సాధ్యం కావడంలేదు. ప్రభుత్వం మొత్తం ఒక్కో ఇంటికి రూ.3.50 లక్షలు ఇస్తామని చెప్పింది. ఇందులో రూ.2.50 లక్షలు సబ్సిడీ పోను లబ్ధిదారుడి వాటాగా  రూ.25 వేలు పెట్టుకుంటే రూ. 75 వేలు బ్యాంకుల నుంచి రుణం ఇప్పిస్తానన్న ప్రభుత్వం చెప్పింది. రూ.75 వేలు రుణం కావాలంటే లబ్ధిదారుడు తన ఇంటిని మార్టుగేజ్‌ చేయించి తీసుకోవాలని ఇప్పుడు మాట మార్చింది. దీంతో ఆ డబ్బు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. 

నిర్మాణాన్ని నిలిపేశాం
పునాదుల వరకు వేసి పనులు నిలిపేశాం.   ఇప్పటి వరకు ఒక్క బిల్లు ఇవ్వలేదు. బాడుగ ఇంటిలో ఉండి చేనేత పనులు చేసుకుంటున్నాం. బిల్లులు వేయకుండా మాతో పనులు ఎందుకు మొదలు పెట్టించారు. 
–  షేక్‌ ఖాజా, రామేశ్వరం, ప్రొద్దుటూరు. 

ఎందుకు ఒత్తిడి తెచ్చారు..
ఉన్న కొట్టంలో బాడుగ లేకుండా కొన్నేళ్లుగా జీవనం సాగిస్తున్నాం. ఇళ్లు వచ్చింది..పనులు మొదలు పెట్టాలని అధికారులు ఒత్తిడి చేశారు.   రూ.1.50 లక్షలు అప్పుతెచ్చి పునాదులు వేశాను. ఇప్పటి వరకు ఒక్క రూపాయి బిల్లు ఇవ్వలేదు.  బాడుగ ఇంటిలో ఉంటున్నాను. పని చేసుకొని జీవనం సాగించే పరిస్థితిలో అప్పునకు వడీ ఎలా చెల్లించాలి.
– వంకా రామయ్య, 27వ వార్డు రామేశ్వరం

డీఈ ఏమంటున్నారంటే...
ఎన్టీఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌ పథకం కింద గృహ నిర్మాణాలు చేపట్టిన వారికి బిల్లులు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటి వరకు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న గృహాలకు రూ.2.70 కోట్ల బిల్లులు రావాలి. అన్ని దశలకు సంబంధించి గృహాల జియోట్యాగ్‌ చేసి ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి పంపాం. త్వరలో బిల్లులు వస్తాయి. 
– సుందరరాజు, హౌసింగ్‌ డీఈ, ప్రొద్దుటూరు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top