గ్రామ వలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ

12 జిల్లాల్లో 1,70,543 వలంటీర్ పోస్టులు
నెల్లూరు జిల్లాలో నేడు నోటిఫికేషన్ జారీ
నేడు వార్డు వలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: గ్రామ వాలంటీర్ల నియామకానికి 12 జిల్లాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదివారం నోటిఫికేషన్ జారీ చేశారు. నెల్లూరు జిల్లాలో నోటిఫికేషన్ సోమవారం వెలువడనుంది. గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున వలంటీర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏ జిల్లాలో ఎంతమంది గ్రామ వలంటీర్లను నియమించుకోవాలన్న దానిపై ఆయా జిల్లాల కలెక్టర్లకు అధికారమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు నెల్లూరు మినహా మిగిలిన 12 జిల్లాల్లో మొత్తం 1,70,543 గ్రామ వలంటీర్ల నియామకానికి కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేశారు. గ్రామ వలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసిన జిల్లాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్‌పోర్టల్ ద్వారా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పంచాయతీరాజ్ శాఖ అధికారులు సూచించారు. ఈ వెబ్‌పోర్టల్‌ను కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే (ఆదివారం సాయంత్రం ఏడు గంటల సమయానికే) 1,47,376 మంది సందర్శించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, పట్టణాల్లో 40 వేల వార్డు వలంటీర్ల నియామకాలకు సోమవారం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. మంగళవారం జిల్లాల వారీగా వీటి నియామకానికి సంబంధించిన ప్రకటనలు రెండు దినపత్రికల్లో ప్రచురితం కానున్నాయి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి