కరెంటొత్తలేదు.. | Sakshi
Sakshi News home page

కరెంటొత్తలేదు..

Published Sat, Jan 18 2014 6:11 AM

no power supply for seven hours

వరంగల్, న్యూస్‌లైన్: వ్యవసాయూనికి ఏడు గంటల విద్యుత్ సరఫరా ఉత్తిదేనని తేలిపోయింది.  రబీలో వ్యవసాయానికి ఏడు గంటలు కరెంట్ సరఫరా చేస్తున్నామని... ఫీడర్ల వారీగా ఉదయం 5 గంటలు, రాత్రి 2 గంటలు ఇస్తున్నామని.... రైతుల కోసం మిగిలిన వర్గాలకు కోతలు పెడుతున్నామని ప్రభుత్వం గుప్పిస్తున్న ప్రకటనలు ప్రగల్భాలేనని తేటతెల్లమైంది. ప్రస్తుతం వ్యవసాయ కనెక్షన్లకు నాలుగు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయకపోవడం... ఇచ్చిన సమయంలోనూ  లో ఓల్టేజీ, ట్రిప్ వంటి కారణాలతో వరి నాటు పడని పరిస్థితి నెలకొంది.

 ఆశ చూపి...
  ఖరీఫ్‌లో అధిక వర్షాలతో రైతులు నష్టపోయారని, ఈసారి రబీలో వారికి అండగా ఉంటామని, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రానీయమంటూ డిసెంబర్‌లో ఏర్పాటు చేసిన రైతు బాసట సదస్సులో కలెక్టర్ కిషన్ కూడా ప్రకటించారు. ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని చెబుతూ వచ్చింది. దీంతో వ్యవసాయ బావులు, బోర్లపై ఆధారపడి సేద్యం చేస్తున్న రైతులు ఆశతో వరినార్లు పోశారు. కానీ... విద్యుత్ కోతల కారణంగా వేసిన నార్లన్నీ వేసినట్టే ముదిరిపోతున్నాయి.

 జిల్లాలో మొత్తం 2.74 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ప్రతిరోజూ 4.60 మెగావాట్ల విద్యుత్ వినియోగమవుతోంది. జిల్లాకు మొత్తం అవసరాలకు పది మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా.. ప్రస్తుతం జిల్లాకు సరఫరా ఏడు మెగావాట్లే సరఫరావు అవుతోంది. దీంతో కోతలు అనివార్యమవుతున్నారుు.

 ప్రస్తుతం ఎస్సారెస్పీ జలాలు విడుదల చేయడంతో కాల్వల కింద, బావులు, బోర్ల కింద సాగు ముమ్మరమైంది. వరితోపాటు కూరగాయలు, పప్పు దినుసులు కూడా వేశారు. ఇప్పటి వరకు 30 శాతం మేరకు పంటలు సాగు చేశారు. కానీ.. దీనిలో సగం మేరకు ఎండిపోయో పరిస్థితికి చేరుకున్నాయి.

 ఎక్కడ విన్నా ‘కరెంటొత్తలేదు’ అన్న మాటే..
  వరంగల్ సర్కిల్ హెల్ప్‌లైన్‌లో ప్రధానంగా ‘కరెంటొత్తలేదు సారూ’ అనే ఫిర్యాదులే ఎక్కువున్నాయి. జనగామ డివిజన్‌లో వ్య వసాయ విద్యుత్ సరఫరాను శుక్రవారం పరిశీలిస్తే... మూడు గం టలే ఇచ్చినట్లు రైతులు పేర్కొంటున్నారు. మొదటి ఫీడర్‌లో ఉద యం 8 గంటలకు వచ్చి 10 గంటలకు పోయింది. మళ్లీ గంట తర్వాత అరగంట పాటు వచ్చి పోరుుంది.

 20 నిమిషాల తర్వాత మళ్లీ అర్ధగంట ఇచ్చారు. ఇక అంతే. మళ్లీ వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వలేదు. ఇక రాత్రిపూట ఇచ్చే రెండు గంటల కోసం రైతులు బావుల వద్దే ఉంటున్నారు. ఒక్కోరోజు విద్యుత్ రానే రావడం లేదని, కరెంటోళ్లకు ఫోన్ చేస్తే... వస్తంది... వచ్చినప్పుడే ఉంటది.. అంటూ సమాధానమిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 నారు మడి వద్ద కనబడుతున్న ఈ రైతు పేరు ముస్కు బుచ్చయ్య, దుగ్గొండి మండలం గిర్నిబావికి చెందిన ఈయన తనకున్న కొద్ది పాటి భూమితోపాటు మరో ఎకరంన్నర పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. రబీలో వరిసాగు కోసం నారు పోశాడు. నెల రోజులైంది... నాటు వేయడమే తరువారుు. అరుుతే వచ్చీరాని కరెంట్‌తో పొలం పారకపోవడంతో దమ్ము చేయడం కుదురుత లేదు. నాటేసే అదును దాటిపోతోంది.

మరో నాలుగు రోజుల్లో నాటు పడకుంటే దండగే. దీంతో ఏం చేయాలో... ఎవరిని అడగాలో తెలియక తల్లడిల్లుతున్నాడు. ‘రోజులో పగటి పూట ఐదు గంటలిత్తమని అధికారులంటాండ్రు. మూడు గంటలు కూడా కచ్చితంగా ఉంటలేదు. రాత్రిపూట ఇచ్చే రెండు గంటల్లో కూడా నాలుగైదు సార్లు ట్రిప్పు అయితాంది. గిట్టయితే వరి పంట పండుద్దా’ అని బుచ్చయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
 ఈ పరిస్థితి ఒక్క బుచ్చయ్యదే కాదు. జిల్లావ్యాప్తంగా రబీ సీజన్‌లో వరి సాగు చేస్తున్న రైతులందరిదీ. నాలుగు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో వారు దిగులు చెందుతున్నారు.

Advertisement
Advertisement