రెన్యువల్ లేదు..కొత్త రుణాలు రావు | No new loans | Sakshi
Sakshi News home page

రెన్యువల్ లేదు..కొత్త రుణాలు రావు

Jan 7 2015 2:27 AM | Updated on Aug 13 2018 8:05 PM

రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణ మాఫీ చేయనందున రైతుల రుణాలు రెన్యువల్‌కు నోచుకోవడం లేదని, అలాగే కొత్త రుణాలు మంజూరు కావడం లేదని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) స్పష్టం చేసింది.

 ఎస్‌ఎల్‌బీసీ స్పష్టీకరణ  పూర్తిస్థాయి రుణమాఫీ చేయని ఫలితం
 మిగతా రుణాలను సర్కారు లేదా రైతులు కడితేనే కొత్త రుణాలు

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణ మాఫీ చేయనందున రైతుల రుణాలు రెన్యువల్‌కు నోచుకోవడం లేదని, అలాగే కొత్త రుణాలు మంజూరు కావడం లేదని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) స్పష్టం చేసింది. రైతులకు వ్యవసాయ రుణాల మంజూరులో బ్యాంకులు ముందుండేవని, లక్ష్యాలకు మించి రుణాలును మంజూరు చేసేవని ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన 188వ ఎస్‌ఎల్‌బీసీ పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ ప్రకటించి దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయని కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని తెలిపింది. తొలి దశ రుణ మాఫీని రాష్ట్ర ప్రభుత్వం కేవలం 20 శాతానికే పరిమితం చేయడంతో ఆ సొమ్ము మెజారిటీ రైతుల వడ్డీకి కూడా సరిపోవడం లేదని, దీంతో ఆయా రైతుల రుణాలు రెన్యువల్ కావడం లేదని పేర్కొంది. తొలి దశలో మాఫీ కొద్ది మొత్తంలోనే ఉన్నందున మిగతా రుణ బకాయిలు చెల్లించే వరకు రైతులకు కొత్త రుణాలను మంజూరు చేయలేమని కూడా బ్యాంకర్ల కమిటీ స్పష్టం చేసింది.

రుణాలు రెన్యువల్ కావాలంటే మిగతా వడ్డీ మొత్తాన్ని రైతులైనా చెల్లించాలి లేదా ప్రభుత్వమైనా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయాలంటే తొలి దశలో ప్రభుత్వ మాఫీ చేయగా మిగిలిన రుణ బకాయిలను రైతులు లేదా ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని, అలా చెల్లిస్తే గానీ రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయడం సాధ్యం కాదని వివరించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, లేదంటే రైతులు పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాలకు దూరం అవుతారని, అంతే కాకుండా పంటల బీమా కూడా దొరకదని సూచించింది. మరోవైపు బకాయిలు అలాగే కొనసాగితే రైతులపై ఏటేటా వడ్డీ భారం పెరిగిపోవడమే కాకుండా కొత్త రుణం పుట్టదని స్పష్టం చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement