దేశంలో జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్, బీజేపీల నడుమ గుణాత్మక తేడా లేదని సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. జార్జిరెడ్డినగర్ (ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల) వద్ద పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభల సందర్భంగా బహిరంగ సభ జరిగింది.
ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌లైన్:
దేశంలో జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్, బీజేపీల నడుమ గుణాత్మక తేడా లేదని సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. జార్జిరెడ్డినగర్ (ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల) వద్ద పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభల సందర్భంగా బహిరంగ సభ జరిగింది. హరగోపాల్‌తో పాటు పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల అశోక్, ప్రధాన కార్యదర్శి జేఎల్ గౌతంప్రసాద్, టీఎన్జీవో అధ్యక్షులు దేవీప్రసాద్, ఐఎఫ్‌టీయూ జాతీయ కార్యదర్శి బి.ప్రదీప్, న్యూడెమక్రసీ రాష్ట్ర నాయకులు పి.రంగారావు, పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఝాన్సీ పాల్గొన్నారు. పీడీఎస్‌యూ ఉద్యమంలో అసువులుబాసిన అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
హరగోపాల్ మాట్లాడుతూ... కాంగ్రెస్, బీజేపీల కూటముల్లో ఏది అధికారంలోకి వచ్చినా అమెరికా, ప్రపంచ బ్యాంకుల చెప్పు చేతల్లోనే ఉంటాయన్నారు. కాంగ్రెస్ నాయకులు సొంత బుర్రలతో ఆలోచించకుండా... వాటిని తాకట్టు పెట్టారన్నారు. విద్యను అమ్ముకునే సంస్కృతి మన దేశంలో మధ్యయుగంలో సైతం లేదన్నారు. ప్రస్తుతం విద్యను, వైద్యాన్ని అమ్ముకుంటున్నారన్నారు. ఉద్యమాల ద్వారానే నవ తెలంగాణాలో మార్పు వస్తుందన్నారు. ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలలో గిరిజనులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న వారి ఆత్మహత్యల లేఖలను పాఠ్యాంశాలలో చేర్చాలని దేవీప్రసాద్ సూచిం చారు. అరుణోదయ కళాబృందం ఆటపాటలు విద్యార్థులను ఆలోచింపచేశాయి.