
ప్రభుత్వ భూములు కరిగిపోతున్నాయ్!
జిల్లాలో ప్రభుత్వ భూములు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రభుత్వ అవసరాలకు భూసేకరణ జరపడం, పేదలు, ఇతరులకు అసైన్‌మెంట్ రూపంలో ఇవ్వడంతోపాటు పెద్ద ఎత్తున ఆక్రమణలకు
శ్రీకాకుళం పాత బస్టాండ్: జిల్లాలో ప్రభుత్వ భూములు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రభుత్వ అవసరాలకు భూసేకరణ జరపడం, పేదలు, ఇతరులకు అసైన్‌మెంట్ రూపంలో ఇవ్వడంతోపాటు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురవుతుండటంతో ప్రభుత్వ ఆధీనంలోని భూముల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. కొన్నేళ్ల క్రితం జిల్లాలో 4,08,361.4 ఎకరాలు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు వీటి విస్తీర్ణం 3,18,865.70 ఎకరాలకు తగ్గిపోయింది. అంటే వివిధ రూపాల్లో 89,579.99 ఎకరాల భూములు వేరే వారి ఆధీనంలోకి వెళ్లిపోయాయన్నమాట. వీటిలో ప్రజావసరాలకు ప్రభుత్వం సమకూర్చగా.. పెద్ద విస్తీర్ణంలోనే ఆక్రమణలకు గురయ్యాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇందులోనూ వ్యవసాయ భూములే ఎక్కువగా ఆక్రమణలకు గురవుతుండటం విశేషం. ఈ పరిస్థితికి ఆధికారుల అలసత్వం, రాజకీయ ప్రాబల్యం, ఒత్తిళ్లు ప్రధాన కారణం. ఇటీవల కాలంతో భూముల ధరలు, డిమాండ్ పెరగడం, గృహ నిర్మాణాలు పెరగడంతో వ్యవసాయ భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురై.. ఇళ్ల స్థలాలుగా రూపాంతరం చెందుతున్నాయి. దీనికితోడు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వ భూములను కరిగించేస్తోంది. ఈ వ్యాపారులు తాము కొనుగోలు చేసే ప్రైవేట్ జిరాయితీ భూముల ముసుగులో వాటికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ లే అవుట్లు వేసి అమ్మేస్తున్నారు. ఇటువంటి అక్రమాలపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరించమో.. మామూళ్లు తీసుకొని చూసీచూడనట్లు పోవడం వల్లనో ప్రభుత్వ భూములు మాయమవుతున్నాయి. ప్రభుత్వ భూముల గణాంకాలు పరిశీలిస్తే..
జిల్లాలో కొన్నాళ్ల క్రితం మొత్తం 4,08,361.4 ఎకరాల ప్రభుత్వ భూములు ఉండేవి. ఇటీవలి కాలంలో ప్రభుత్వ, ఇతర ప్రజావసరాలకు 79,785.24 ఎకరాలను అసైన్ చేశారు. మరో 2,212.83 ఎకరాలు ఎలియనేటెడ్ భూములుగా ఉన్నాయి. పేదల ఇళ్ల స్థలాలకు 3,730.72 ఎకరాలు కేటాయించారు. వీటి మొత్తం విస్తీర్ణం 85,728.79 ఎకరాలు. ఇకపోతే చెరువులు, మెట్ట భూములు, కాలువలు, గుట్టలు, కొండలు వంటి భూములు విరివిగా అక్రమణలకు గురవుతున్నాయి. వ్యవసాయ భూములు 3,651.44 ఎకరాలు, వ్యవసాయేతర భూములు 199.76 ఎకరాలు మొత్తం 3.851.20 ఎకరాలు అక్రమణలకు గురయ్యాయి. ఇవి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రజా, ప్రభుత్వ అవసరాలకు భూములు లేకుండాపోయే ప్రమాదముంది.