నేటి నుంచి కొత్తమెనూ

New Menu Started In AP Anganwadi Centers - Sakshi

సాక్షి, రామభద్రపురం: అంగన్‌వాడీల ఆధ్వర్యంలో కొత్తమెనూ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు మంగళవారం నుంచి అదనపు ఆహారం అందజేయనుంది. పోషణ అభియాన్‌ పథకంలో భాగంగా పోషకాహారం పంపిణీకి చర్యలు చేపట్టింది. షెడ్యూల్‌ కులాలు, తెగలు, ఇతర జనాభాలో గర్భిణులు, బాలింతలు, 6 సంవత్సరాలలోపు ఉన్న పిల్లల పోషణ స్థితి మెరుగుదలకు జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు ద్వారా ఈ పథకాన్ని అమలు చేయనుంది. 

అమలు: అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో
ఇచ్చే సరుకులు: ప్రస్తుతం ఇస్తున్న పాలు, గుడ్లు, శనగ చెక్కీలకు అదనంగా ప్రతినెలా కిలో ఖర్జూరం, రాగిపిండి, బెల్లం
ఎవరికి: రక్తహీనత కలిగిన పిల్లలు, గర్భిణులు, బాలింతలకు.. (గిరిజన ప్రాంతాల్లో లబ్ధిదారులందరికీ) 
ఎంతమందికి లబ్ధి: జిల్లాలో 20,872 మంది చిన్నారులు, 31,596 మంది గర్భిణులు, బాలింతలకు లబ్ధి 

పంపిణీ ఇలా... 
జిల్లాలో 17 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులలో 3,729 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 1,60,674 మంది చిన్నారులు, 31,444 మంది గర్భిణులు, బాలింతలు ఉన్నారు. అయితే, జిల్లాలో షెడ్యూల కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన గర్భిణులు, బాలింతలకు రక్తహీనత, హైరిస్క్‌తో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికీ కొత్తమెనూ ప్రకారం పోషకాహారం అందిచనున్నారు. అలాగే, ఇతర ప్రాంతాల గర్భిణులు, బాలింతల్లో హిమోగ్లోబిన్‌ తక్కువగా ఉండడంతో పాటు పొడవు 45 సెంటీ మీటర్లు, బరువు 35 కిలోలు కంటే తక్కువ ఉన్నవారికి, చిన్న వయసులో వివాహం జరిగి గర్భం దాల్చిన వారికి, 35 సంవత్సరాలు తరువాత గర్భందాల్చిన వారికి  అదనపు పోషకాహారం అందించనున్నారు.

సుమారుగా గర్భిణులు, బాలింతలు 31 వేల మంది పోషకాహార లబ్ధిపొందనున్నారు. రక్తహీనత, పోషకాహార లోపం ఉన్న చిన్నారులు 20,872 మందికి కొత్త మెనూ అందించనున్నారు. వీరందరికీ రోజూ అందిస్తున్న పాలు, గుడ్లు, శనగ చెక్కీలతో పాటు నెలకు సరిపడా ఒక కేజీ రాగి పిండి, కేజీ ఖర్జూరం, కిలో బెల్లం కొత్త మెనూ ప్రకారం అదనంగా ఇవ్వనున్నారు. రక్తహీనత, హైరిస్క్‌ గల గర్భిణులు, బాలింతలకు, చిన్నారులకు గతంలో ఇచ్చిన నువ్వుల చెక్కీలు ఆపేసి ఈ మూడు రకాల పోషక పదార్థాలు అందిచనున్నారు.

సంతోషంగా ఉంది...
గతంలో గర్భిణులు, బాలింతలకు అదనపు పోషకాహారం అందించేందుకు ‘నేను సైతం’ అనే పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకం నిర్వహణకు దాతల ఆర్థిక సహాయాన్ని అర్జించేవారం. తాజాగా ప్రభుత్వమే అదనపు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకోవడం అభినందించాల్సిన అంశం. ఆరోగ్యానికి పెద్దపీట వేసినట్టే. ఇకపై దాతలను ఆశ్రయించాల్సిన పని ఉండదు. 
– యర్రయ్యమ్మ, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్, రామభద్రపురం 

పోషకలోపాన్ని అధిగమించేందుకు... 
గర్భిణులు, బాలింతలలో రక్తహీనత, హైరిస్క్‌ అధికంగా ఉంటోంది. పిల్లల్లో పొడవు, బరువు తగ్గే అవకాశం ఎక్కువ. వారికి శనగ చెక్కీలు, పాలు, గుడ్లుతో పాటు ఖర్జూరం, రాగి పిండి, బెల్లం వంటి పౌష్టికాహారం అందించడం వల్ల  వారిలో ఉన్న పోషక లోపాన్ని అధిగమించవచ్చు. 
– హెచ్‌కే కామాక్షి, సీడీపీవో, సాలూరు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top