వేగానికి కళ్లెం! | New Actions For Controlling Road Accidents | Sakshi
Sakshi News home page

వేగానికి కళ్లెం!

Apr 20 2018 9:50 AM | Updated on Apr 3 2019 8:51 PM

New Actions For Controlling Road Accidents - Sakshi

మర్రిపాలెం(విశాఖ ఉత్తర) : ప్రభుత్వం నిర్దేశించిన వేగం దాటి ప్రయాణిస్తే ఇక కఠిన చర్యలు తీసుకోనున్నారు. ప్రయాణిస్తున్న రోడ్లు, వినియోగిస్తున్న వాహనాల ఆదారంగా గరిష్ఠ వేగాన్ని నిర్ణయించారు. ‘మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌’ కొత్తగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వాహనం ఎంత వేగంతో ప్రయాణించాలి! ఆయా రోడ్లకు తగ్గట్టుగా వేగం ఎంత ఉండాలి! అనేది ప్రకటించారు. సెక్షన్‌ 122 మోటార్‌ వాహనాల చట్టం 1988 9(58 నుంచి 1988) జీవోలో ఆంక్షలు వెల్లడించారు.

ఇప్పటి వరకూ ఆయా ప్రాంతాలలో వాహనం నిర్దేశించిన వేగంతో ప్రయాణించాలనే ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఇక నుంచి ప్రభుత్వం నిర్దేశించిన వేగాన్ని మించకుండానే వాహనాలు ప్రయాణించాలనే ఆజ్ఞలు జారీ చేశారు. దేశ వ్యాప్తంగా ఆయా రోడ్లకు తగ్గట్టుగా ఒకే వేగంతో వాహనాలు ప్రయాణించాలనే లక్ష్యంతో నూతన నిబంధనలు అమలులోకి తీసుకొచ్చారు. వేగ నియంత్రణ నిబంధనలు ఉల్లంఘించిన వారి మీద ఎప్పటి వలే అపరాధ రుసుం వసూలు చేయాలనే ఆదేశాలు జారీ చేశారు. 

అతి వేగంతోనే ప్రమాదాలు 
అతివేగం అత్యంత ఘోర ప్రమాదాలకు కారణమవుతోంది. కట్టుదిట్టంగా చట్టంలో నిబంధనలు లేకపోవడం... ఉన్న నియమాలు కచ్చితంగా అమలు చేయలేని నిస్సహాయ పరిస్థితి వల్ల రోడ్డు విశాలంగా కనిపించగానే వాహనదారులు అపరిమిత వేగంతో దూసుకుపోతున్నారు. ఇలా ప్రయాణిస్తూ ప్రమాదాలను స్వాగతిస్తున్నారు. మన దేశంలో ఎటా ప్రమాదాల్లో సుమారు 60 వేల మందికిపైగా చనిపోతుండగా సుమారు ఐదు లక్షల మంది క్షతగాత్రులవుతున్నారు. మన విశాఖపట్నం జిల్లాలో 2016లో 2,413 ప్రమాదాలు సంభవిస్తే 754 మంది ప్రాణాలు పోగొట్టుకోగా 2,539 మంది గాయపడ్డారు.

2017లో 2,072 ప్రమాదాలు జరిగితే 595 మంది మృతి చెందగా 2,303 మంది గాయాలపాలయ్యారు. జరుగుతున్న ప్రమాదాలను రవాణా శాఖ అధికారులు పరిశీలిస్తే... అతి వేగం ప్రధాన కారణమని సర్వేలలో తేలింది. ముఖ్యంగా యువత వాయువేగంతో దూసుకెళుతూ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నట్టు పరిశోధనలలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వాహనాల వేగం నియంత్రిస్తే ప్రమాదాలు తగ్గుముఖం పట్టవచ్చనే కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు ఎట్టకేలకు ఫలించాయి. 

ఈ వేగం దాటితే చర్యలు 


  • దేశ వ్యాప్తంగా ఆయా రోడ్లలో వాహనం ఎంత వేగంతో ప్రయాణించాలి అనేది ఉత్తర్వులలో స్పష్టం చేశారు. రోడ్లతోపాటు ఆయా వాహనాల తరగతి ఆధారంగా వేగం నిర్ణయించారు. అంతకు మించిన వేగంతో ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు.

  •  ఎక్స్‌ప్రెస్‌ హైవేలలో 8 సీటర్‌లోపు గల ప్యాసింజర్‌ తరహా వాహనాలు గంటకు 120 కి.మీ, 9 సీటర్‌ సామర్థ్యం మించిన ప్యాసింజర్‌ వాహనాలు గంటకు 100 కి.మీ, రవాణా తరహా వాహనాలు గంటకు 80 కి.మీ, మోటార్‌ సైకిళ్లు గంటకు 80 కి.మీ వేగంతో ప్రయాణించాలి. 

  • నాలుగు లైన్లు అంతకు మించిన హైవే రోడ్లలో 8 సీటర్‌లోపు ప్యాసింజర్‌ వాహనాలు గంటకు 100 కి.మీ, 9 సీటర్‌కు మించిన ప్యాసింజర్‌ వాహనాలు గంటకు 90 కి.మీ, రవాణా తరహా వాహనాలు గంటకు 80 కి.మీ, మోటార్‌ సైకిళ్లు గంటకు 80 కి.మీ, ఆటోలు గంటకు 50 కి.మీ వేగంతో ప్రయాణించాలని నిర్దేశించారు. 
  • మున్సిపల్‌ రోడ్లు మీద 8 సీటర్‌లోపు ప్యాసింజర్‌ తరహా వాహనాలు గంటకు 70 కి.మీ, 9 సీటర్‌కు మించిన ప్యాసింజర్‌ వాహనాలు గంటకు 60 కి.మీ, రవాణా తరహా వాహనాలు గంటకు 60 కి.మీ, మోటార్‌ సైకిళ్లు గంటకు 60 కి.మీ, ఆటోలు గంటకు 50 కి.మీ వేగంతో ప్రయాణించాలని ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement