పంటబోదెలోకి స్కూల్‌బస్సు పల్టీ | Narrowly missed the threat | Sakshi
Sakshi News home page

పంటబోదెలోకి స్కూల్‌బస్సు పల్టీ

Jul 22 2014 2:12 AM | Updated on Sep 2 2017 10:39 AM

పంటబోదెలోకి స్కూల్‌బస్సు పల్టీ

పంటబోదెలోకి స్కూల్‌బస్సు పల్టీ

తోట్లవల్లూరులో సోమవారం సాయంత్రం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు పంటబోదెలో బోల్తాకొట్టింది. ఈ ఘటనలో సుమారు 27 మంది చిన్నారులు ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

తోట్లవల్లూరు : తోట్లవల్లూరులో సోమవారం సాయంత్రం ఓ ప్రైవేటు  పాఠశాల బస్సు పంటబోదెలో బోల్తాకొట్టింది. ఈ ఘటనలో సుమారు 27 మంది చిన్నారులు ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. సకాలంలో స్పందించిన స్థానికులు  విద్యార్థులను వెంటనే బస్సు నుంచి బయటకు లాగి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా కాపాడారు. ఈ ప్రమాద ఘటనపై చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

వివరాలలోకి వెళితే... ఉయ్యూరులోని  ఓ ప్రైవేటు  పాఠశాలకు చెందిన  ఏపీ 16 టిఎక్స్ 7108 నంబరు గల మినీబస్సు తోట్లవల్లూరు మీదుగా పాములలంక వెళ్లాల్సి ఉంది. సాయంత్రం 5 గంటల సమయంలో  తోట్లవల్లూరు కనకదుర్గమ్మ కాలనీ వద్దకు వచ్చేసరికి  బస్సు ప్రమాదానికి గురైంది. స్టీరింగ్ తాళాలు పొరపాటున కిందపడిపోవటంతో, హ్యాండిల్ లాక్ పడినట్లుగా డ్రైవర్ చెబుతున్నాడు.

ఈ సందర్బంగా బస్సును అదుపుచేసే క్రమంలో డ్రైవర్‌కు   బ్రేకులు పడకపోవటంతో, రోడ్డు మీద  ఎడమ వైపు వెళ్లాల్సిన బస్సు కుడి వైపున ఉన్న పంటబోదెలోకి  బోల్తాకొట్టింది. బస్సు ప్రమాదాన్ని కళ్లముందే చూసిన పలువురు  స్థానికులు  హుటాహుటిన తరలివచ్చి సహాయక చర్యలు చేపట్టి విద్యార్థులు రక్షించారు.
 
మిన్నంటిన ఆర్తనాదాలు....
 
ప్రమాదం జరిగిన  ప్రాంతంలో విద్యార్థుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రమాదం ఎలా జరిగిందో తెలియదు... ఎవరికి ఏం జరిగిందో అర్థంకావట్లేదు.. అభం శుభం తెలియని చిన్నారులు జరిగిన ప్రమాదంతో కకావికలమైపోయారు. కొన్ని  నిమిషాలపాటు  ప్రమాదాన్ని ఊహించుకుని కలవరపాటుకు గురయ్యారు.

క్షణాల వ్యవధిలో  కాలనీవాసులు  స్పందించటంతో ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. ప్రమాద విషయం తెలుసుకున్న  స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా ప్రాంతానికి తరలివచ్చి ఈ ఘటనపై ఆరాతీశారు. పాములలంకకు చెందిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హుటాహుటిన వచ్చి తమ పిల్లల క్షేమసమాచారాలను తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారకుడైన డ్రైవర్‌పై తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ శ్రీరంగనాథ్, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు ఆ ప్రాంతాన్ని సందర్శించి, వివరాలు నమోదు చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement