
కడపలో చేపట్టిన నిరాహార దీక్షలో కన్నీటిపర్యంతమవుతున్న పావని తల్లిదండ్రులు మల్లేశ్వర్‌రెడ్డి, శివమ్మ
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: ‘‘మా కుమార్తె పావనిని నారాయణ కళాశాల యాజమాన్యమే పొట్టనపెట్టుకుంది’’ అని మృతురాలి తల్లిదండ్రులు మల్లేశ్వర్‌రెడ్డి, శివమ్మలు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వైఎస్సార్ జిల్లా కడపలోని అంబేడ్కర్ సర్కిల్‌లో నారాయణ కళాశాలల్లో ఆత్మహత్యలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరవకధిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షల్లో పాల్గొన్న విద్యార్థిని పావని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ మాట్లాడారు.
తమ కుమార్తె చదువుతోపాటు అన్నింటిలో మొదటిస్థానంలో నిలిచేదని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తెలిపారు. నారాయణ కళాశాల యాజమాన్యమే తమ కుమార్తెను చంపిందని వారు ఆరోపించారు. తల్లిదండ్రులకు, పోలీసులకు ఎటువంటి సమాచారం అందించకుండా రిమ్స్ మార్చురీలో అనాథ శవంలా పావనిని ఉంచారని, దీనిని బట్టి చూస్తే యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహారించిందో అర్థమవుతోందని ధ్వజమెత్తారు.
పావని మృతి పట్ల న్యాయం చేయాల్సిన పోలీసులే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పడం దారుణమని, తమకు జరిగిన అన్యాయం ఇతర తల్లిదండ్రులకు జరగకూడదన్నారు. నారాయణ కళాశాల మంత్రులకు చెందినది కాబట్టే ప్రభుత్వం సైతం వారికి వత్తాసు పలుకుతోందని విమర్శించారు. తమ కుమార్తె మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మల్లేశ్వర్‌రెడ్డి, శివమ్మ డిమాండ్ చేశారు.