మీరు మీటింగ్‌కు వస్తేనే మీకు ఇళ్లు ఇప్పిస్తా. లేకుంటే లేదు. చంద్రబాబు పశ్చిమ నియోజకవర్గంలో పదివేల ఇళ్లు.....
► ముస్లింలకు జలీల్‌ఖాన్ వల
► ఇళ్ల పేరుతో ఏమార్చే యత్నాలు
► చంద్రబాబు పది వేల ఇళ్లు
► తనకిచ్చారంటూ ప్రచారం
వన్‌టౌన్ : ‘మీరు మీటింగ్‌కు వస్తేనే మీకు ఇళ్లు ఇప్పిస్తా. లేకుంటే లేదు. చంద్రబాబు పశ్చిమ నియోజకవర్గంలో పదివేల ఇళ్లు ముస్లింలకు ఇవ్వమని ఇచ్చారు. అవన్నీ రేపు మీటింగ్‌కు వచ్చినవారికే ఇస్తా...’ అంటూ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ వల విసురుతున్నారు. ఏప్రిల్ రెండో తేదీన స్థానిక గాంధీజీ నగరపాలకసంస్థ హైస్కూల్ ప్రాంగణంలో ముస్లింల ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఆయన సభను నిర్వహించనున్నారు. దీనికి ముస్లిం మత పెద్దలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఆహ్వానించారు. అయితే పార్టీమారిన నేపథ్యంలో నియోజకవర్గంలో చాలా మంది ఆయనపై కినుకవహించారు.
ముఖ్యమంత్రి వద్ద తన బలాన్ని నిరూపించుకోవడానికి ఈ సభ నిర్వహిస్తున్నారని పలువురు అంటున్నారు. అయితే స్థానికుల ఆదరణ కరువైందని భావించిన జలీల్‌ఖాన్ ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల ఇబ్రహీంపట్నంలో జలీల్‌ఖాన్ తీరుపై అక్కడి ముస్లింలు మండిపడిన విషయం తెలిసిందే.
15 రోజులుగా ప్రచారం
సభ విజయవంతం కోసం జలీల్‌ఖాన్ తన అనుచరులతో పదిహేను రోజులుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. తనకు చంద్రబాబు పదివేల ఇళ్లు కేటాయించారని జలీల్‌ఖాన్ చెప్పారని పలువురు వించిపేట మహిళలు చెబుతున్నారు.
పశ్చిమంలో ముస్లింలేనా ప్రజలు ?
పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలు మాత్రమే ఉన్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన లక్షలాది కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఒక వేళ ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేస్తే అన్ని వర్గాలకు సమానంగా ఇళ్లను కేటాయించాల్సి ఉంటుంది. పేదల అర్హతలను బట్టి ఇళ్లను కేటాయించకుండా ముస్లింలకే కేటాయించాలని చూడటం దుర్మార్గమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అంతా మాయే !
జలీల్‌ఖాన్ చెబుతున్న ఇళ్లు మంజూరు అంతా ఆయన సృష్టించిన మాయేనని పలువురు కార్పొరేటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇళ్ల కేటాయింపు జరిగితే నగరపాకలసంస్థకు, స్థానిక ప్రజాప్రతినిధులైన కార్పొరేటర్లకు సమాచారం లేకుండా జరగదని వారు చెబుతున్నారు. సభ విజయవంతంకోసం జలీల్ ప్రచారంపై పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.