బీజేపీలో చేరుతున్నానన్న వార్తలు అవాస్తవం: మేకపాటి | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరుతున్నానన్న వార్తలు అవాస్తవం: మేకపాటి

Published Wed, Oct 29 2014 10:31 AM

బీజేపీలో చేరుతున్నానన్న వార్తలు అవాస్తవం: మేకపాటి - Sakshi

నెల్లూరు :  తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్ సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఓ వర్గం మీడియాలో వస్తున్న వార్తలను ఆయన బుధవారమిక్కడ తీవ్రంగా ఖండించారు.  కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని, వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ నేతగా ఉన్న తనపై కూడా తప్పుడు ప్రచారం  చేయటం శోచనీయమన్నారు. మరోసారి ఇటువంటి వార్తలు పునరావృతమైతే ఆ సంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వటం సరికాదని మేకపాటి అన్నారు. ప్రభుత్వ కార్యక్రమం వల్లే జన్మభూమిలో పాల్గొంటున్నామని ఆయన తెలిపారు.  ఏ ప్రభుత్వం మంచి చేసిన సమర్థిస్తామని మేకపాటి వెల్లడించారు. ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎండగడతామన్నారు.  పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా మే 19న ఇదే విషయాన్ని స్పష్టం చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలకు మంచి చేసే పనులకు మద్దతు ఇస్తామని జగన్ కూడా చెప్పారన్నారు.

తాను వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నానని, తాను నెరవేర్చాల్సిన పనులు, బాధ్యతలు చాలా ఉన్నాయని మేకపాటి అన్నారు.  ఏ నాయకుడికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో వైఎస్ జగన్కు తెలుసునని, తనకు కూడా చాలా బాధ్యతలు అప్పగించారన్నారు. ఎంపీ కొత్తపల్లి గీతపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని మేకపాటి తెలిపారు.

 
Advertisement
 
Advertisement