షాడో మంత్రి వీరంగం

Money Distributed TDP Leader Pattabhi Narayana In Election Time - Sakshi

చిన్నబజార్‌ పోలీస్‌స్టేషన్‌లో నానా యాగీ 

నారాయణ సిబ్బందినే పట్టుకుంటారా అంటూ పోలీసులపై మండిపాటు

ఎలాంటి హోదాలేని పట్టాభి వీరంగం చేస్తే నో కేసు

మంత్రికి గులాం కొడుతున్న పోలీస్‌ బాస్‌లు! 

ఆయన షాడో మంత్రి. అధికార పార్టీలో అందరికి  సుపరిచితుడు. ఇక పైరవీలు చేసే నేతలకు అయితే ఆయన బాగా సన్నిహితం. నెల్లూరు నగరంలో షాడో మంత్రిగా వ్యవహరిస్తూ మంత్రి నారాయణకు అన్నీ తానై వ్యవహరిస్తున్న వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి వ్యవహారశైలి తరచూ వివాదంగా మారుతోంది. తాజాగా సోమవారం చిన్నబజార్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎన్నికల విధుల్లోని పోలీసులు, అధికారులపై  వీరంగం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న నారాయణ సిబ్బందినే స్టేషన్‌కు తీసుకువస్తారా అంటూ నానా యాగీ చేసి పోలీసులపై మండిపడుతూ గందరగోళం సృష్టించారు. అయినా పోలీసులు మాత్రం నోరు మెదపని పరిస్థితి. అదే గతంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే పార్టీ కార్యకర్తల విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఆగమేఘాల మీద నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. కానీ అధికార పార్టీ నేతగా ఉన్న పట్టాభి రామిరెడ్డి విషయంలో మాత్రం, అదీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా జిల్లా పోలీసు బాస్‌ మొదలుకొని నగర డీఎస్పీ వరకు ఒక్కరు కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తూ పచ్చచొక్కాలు ధరించిన పోలీసుల్లా మారడం సర్వత్రా వివాదంగా మారింది. 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  మున్సిపల్‌ శాఖ మంత్రి పి. నారాయణ నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ప్రజాభిమానం లేని నారాయణ కేవలం కరెన్సీ నోట్లనే నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేతలను కూడా నమ్మకుండా సొంత మనుషుల ద్వారా డబ్బు వ్యవహారాలకు తెరతీశారు. తన విద్యా సంస్థల్లోని సిబ్బందితో అడగడుగునా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ, ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేస్తూ ప్రజలకు దొరికిపోతున్నారు. అందులో భాగంగా ఆదివారం, సోమవారం వరుసగా రెండు రోజుల పాటు నెల్లూరు నగరంలో డబ్బులు పంచుతూ స్థానికులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబట్టారు. అది కూడా నారాయణ విద్యాసంస్థల్లో కీలక స్థాయి ఉద్యోగులే కావడం విశేషం. ఆదివారం 43వ డివిజన్‌లో డబ్బు పంచడానికి నారాయణ విద్యాసంస్థల ఏజీఎం రమణారెడ్డి రూ.8.30 లక్షలతో ఉండగా స్థానికులు పట్టుకున్నారు. పోలీసులు యథావిధిగా కేసు నమోదు చేసి సాయంత్రానికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపేశారు.

ఇక సోమవారం నగరంలోని 40వ డివిజన్లో నారాయణ విద్యాసంస్థల లెక్చరర్‌ బాలమురళీకృష్ణ రూ.50 వేల నగదు ఎవరెవరికి పంపిణీ చేయాలనే దానికి సంబంధించిన స్లిప్పులు, టీడీపీ కండువాలతో చిక్కారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పట్టుకొని చిన్నబజార్‌ స్టేషన్‌లో అప్పగించారు. బాలమురళీతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి అనుచరుడు పట్టాభి చిన్నబజార్‌ స్టేషన్‌కు చేరుకుని తమ వాళ్లను ఎలా పట్టుకుంటారని పోలీసులపై మండి పడ్డారు. నారాయణ సిబ్బంది నారాయణకు కాకుండా మీకు పనిచేస్తారా అంటూ తీవ్రంగా ఆవేశంతో ఉగిపోయారు. పోలీస్‌స్టేషన్‌లో గందరగోళం నెలకొనడంతో డీఎస్పీ మురళీ కృష్ణ స్టేషన్‌కు చేరుకుని అనేక తరన్జనభర్జల అనంతరం డబ్బులతో దొరికిన బాలమురళీ కృష్ణపై కేసు నమోదు చేసి మిగిలిన వారికి సంబంధం లేదంటూ పంపేశారు.  

ఇదేమి పోలీసు రాజ్యం 
కొద్ది రోజుల క్రితం నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు అకారణంగా అరెస్ట్‌ చేశారు. రూరల్‌ నియోజకవర్గంలో సర్వే నిర్వహిస్తున్న టీడీపీ వ్యక్తులను స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు ఆపి వారిని స్టేషన్లో అప్పగించారు. పోలీసులు సర్వే టీమ్‌ సభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకుని పార్టీ కా>ర్యకర్తలపై కేసు నమోదు చేశారు. ఇదేమి అన్యాయం అని స్టేషన్‌కు వెళ్లి ప్రశ్నించిన ఎమ్మెల్యే కోటంరెడ్డిపై పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేసి హైడ్రామా నడుమ అరెస్ట్‌ చేశారు. వాస్తవానికి ప్రజాప్రతినిధికి జరిగిన విషయంపై ప్రశ్నించే హక్కు ఉంటుంది. అయితే ఎలాంటి హోదాలేని వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి స్టేషన్లో నానా యాగీ చేసినా పోలీసులు మాత్రం మౌనం వహించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. పైగా ఎన్నికల విధుల్లో ఉండి, ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చాక పోలీసులు మరింత పక్కగా ఎన్నికల నియామావళికి లోబడి పనిచేయాలి. కానీ ఇక్కడి పోలీసులు మాత్రం నారాయణ అడుగులకు మడుగులు ఒత్తడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది.  

పట్టాభి తీరు అంతే 
పట్టాభి రామిరెడ్డి వ్యవహారశైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంటుంది. నగర టీడీపీలో నేతలుగా ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, తాళ్లపాక ఆనురాధ తదితరులు ఇప్పటికే పట్టాభి తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలోనూ పట్టాభి వ్యవహారంపై అనేక సార్లు మంత్రి వద్ద, రెండు సార్లు చంద్రబాబు వద్ద కూడా పంచాయితీ జరిగింది. పట్టాభిపై ఉన్న వ్యతిరేకతతో 2016లో టీడీపీ నేతల గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసిన అతన్ని ఓడించారు. మరో వైపు ఎన్నికల సమయంలో బ్యాలెట్‌ పేపర్‌తో పాటు పట్టాభి చేసిన అరాచకాల్ని ఓటర్లు కాగితంపై రాసి బ్యాలెట్‌ పేపర్‌తో కలిపివేయడంతో అప్పట్లో చర్చనీయాంశమైంది. ఎన్నికల సమయంలో ఉద్యోగులను వేధించిన తీరును, పట్టాభి ఆడియో టేపులను సీపీఎం నేతలు విడుదల చేశారు. మొత్తం మీద ఈ వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ నేతలు, రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించనున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top