రాయితీ.. ఒక  ‘కల్పన’!

MLA Uppuleti Kalpana Misusing the Central Govt Scheme - Sakshi

ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ పథకం దళారుల పాలు

బినామీ పేరుతో ఇన్నోవా వాహనం పొందిన పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన

సాక్షి, అమరావతి బ్యూరో : పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న పలు పథకాలను అధికార టీడీపీ ప్రజాప్రతినిధులు చేజిక్కించుకుని లక్ష్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణాజిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కేంద్రప్రభుత్వ నిధులతో మంజూరైన రాయితీ వాహనాన్ని బినామీ పేరుతో తీసుకుని దర్జాగా వాడుకుంటున్న వైనం వెలుగుచూసింది.

నిబంధనలకు పాతర..
కేంద్రప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ యువతకు ఉపాధి కోసం నేషనల్‌ షెడ్యూల్‌ క్యాస్ట్‌ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ) ద్వారా సబ్బిడీతో వాహనాలను అందజేస్తోంది. మొవ్వ గ్రామానికి చెందిన దగాని క్రాంతికిరణ్‌ ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ పథకం ద్వారా దరఖాస్తు చేయగా సుమారు రూ.20 లక్షల విలువైన ఇన్నోవా వాహనాన్ని మంజూరు చేశారు. ఆ వాహనాన్ని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ పేరుతో ఏపీ 16టీపీ 0661 నంబర్‌తో ఈ ఏడాది మార్చి ఒకటిన గుడివాడ ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేశారు.అయితే రిజిస్ట్రేషన్‌ చేయడంలో నిబంధనలు పాటించలేదు. ట్యాక్సీ ట్రావెల్‌ కింద చూపితే ఎల్లో ప్లేట్‌ ఉండాలి. కానీ కారు యజమానిగా చూపి వైట్‌ ప్లేట్‌ వేయించుకుని నిబంధనలు ఉల్లంఘించారు. పామర్రు ఎమ్మెల్యే దగ్గరుండి రిజిస్ట్రేషన్‌ చేయించుకుని ఇన్నోవా వాహనంపై పామర్రు ఎమ్మెల్యేగా స్టిక్కర్‌ వేయించుకుని తిరుగుతున్నారు. దగాని క్రాంతికిరణ్‌ ఎమ్మెల్యే బినామీ మాత్రమేనని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. అతని పేరుతో రాయితీతో కూడిన భూమి కొనుగోలు పథకం, వ్యక్తిగత రుణాలు మంజూరు చేయించి వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖ వెబ్‌సైట్‌లో కారు రిజిష్ట్రేషన్‌ వివరాలు. ఇందులోనే కారు యజమాని దగాని క్రాంతి కిరణ్‌ పేర్కొన్న దృశ్యం

సొమ్మొకరిది సోకు మరొకరిది 
కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్‌ కులాలలో పేదవర్గాలకు ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ పథకం కింద అందించే వాహనాలకు నిధులు పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ పధకం ద్వారా మంజూరైన వాహనానికి 35% సబ్సిడీ ఉంటుంది. 2% మాత్రం లబ్ధిదారుని వాటాగా చెల్లించాలి. మిగిలిన 63% రుణ సౌకర్యం కల్పిస్తారు. వాహనాన్ని ట్రావెల్స్‌లో తిప్పి రుణం చెల్లించాల్సి ఉంది. కానీ రాష్ట్రప్రభుత్వం ఈ వాహనాలను తామే ఇస్తున్నట్లు బిల్డప్‌ ఇచ్చేలా వాహనంపై థ్యాంక్యూ సీఎం సార్‌ పేరుతో స్టిక్కర్లు వేసి పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌ గతంలో వాహనంపై సీఎం స్టిక్కర్‌ తొలగిస్తే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పడం వివాదమైంది. గతంలోనూ నెల్లూరు జిల్లాలో టీడీపీ మాజీ మంత్రి  తన డ్రైవర్‌ పేరుతో ఇన్నోవా వాహనం తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. పేదవర్గాల పేరుతో రాయితీ పథకాలను టీడీపీ నేతలు బొక్కేయడంపై దళితులు మండిపడుతున్నారు.

పేదలకు పంపిణీ చేశాం
కృష్ణా జిల్లాలో ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ  ద్వారా దరఖాస్తులు చేసుకున్న వారికి వాహనాలు పంపిణీచేశాం. నిబంధనల మేరకే వాహనాలను మంజూరు చేశాం. లబ్ధిదారుల్లో ప్రజాప్రతినిధుల బినామీలు ఉన్నారన్న విషయం మాకు తెలియదు. – సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ, కృష్ణాజిల్లా 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top