
వంగర: టీడీపీ ప్రభుత్వం పసుపు చొక్కాల వారికే పథకాలు అమలు చేస్తోందని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మండిపడ్డారు. శనివారం మండల పరిధి మగ్గూరు,ఎం.సీతారాంపురం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అర్హత ఉన్నా పెన్షన్లు, గృహాలు మంజూరు చేయడం లేదని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోతోందని ఆవేదన చెందారు. గృహ నిర్మాణ శాఖలో అవకతవకలున్నాయని, అధికారులు టీడీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హౌసింగ్ శాఖపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వంగర మండలంలో తోటపల్లి కుడి ప్రధాన కాలువ ద్వారా రబీకి నీటిని అందించడం లేదని, రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. దీనంతటికీ తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడమేనన్నారు. కార్యక్రమంలో వైఎస్సా ర్ సీపీ జిల్లా కార్యదర్శులు ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ, కిమిడి ఉమామహేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు కరణం సుదర్శనరావు, ఉత్తరావెల్లి గణేష్‌బెనర్జీ, ఉగిరి ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.