'కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధం'

Minister Alla Nani Press Meet Over On Corona Virus - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజాలెవరూ కరోనా వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. వైరస్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతీ రోజూ సమీక్షలు జరుపుతున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో కరోనా జాడలు బయటపడిన నేపథ్యంలో ఆళ్లనాని మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అనుక్షణం అప్రమత్తంగా ఉందని, పోర్టుల్లోనూ.. ఎయిర్‌ పోర్టుల్లోనూ అనుమానితుల నుంచి నమూనాలు సేకరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు జాగ్రత్తగా 8 ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశామని.. తాజాగా కేంద్రం సూచనల మేరకు ప్రత్యేకంగా ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు. ఎక్కడికక్కడ మాస్కులు..వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనాపై కొన్ని నిరాధారమైన వార్తలు వస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.  చదవండి: క‌రోనాతో మరో వైద్యుడు మృతి

ఒకవేళ కరోనా వైరస్ వస్తే ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపై కేంద్రం ఈ నెల 6న వర్క్‌షాప్ నిర్వహిస్తోందని.. దీని ఆధారంగా రాష్ట్ర స్థాయిలో ఒక సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రజల్లో కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించేందుకు కరపత్రాలు పంచడంతో పాటు ఏఎన్ఎంల ద్వారా కూడా అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేస్తామని మంత్రి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పిస్తామని, ప్రజలకు అవగాహన వచ్చేలా కరపత్రాలు ప్రింట్‌ చేయమని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు ఇచ్చారన్నారు. ఏఎన్‌ఎంల ద్వారా గ్రామ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. కరోనా వైరస్‌ పట్ల ముందస్తు జాగ్రత్తలు గురించి వివరిస్తారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, కరోనా వైరస్‌ రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చదవండి: కరోనా వైరస్‌కు ‘సీ’ విటమిన్‌

ఏపీలో కరోనా కేసు ఇప్పటిదాకా నమోదు కాలేదన్నారు. కరోనా కేసు నమోదైనా పూర్తిస్థాయిలో వారికి వైద్య సేవలు అందించేందుకు, వ్యాధి అదుపు చేయడానికి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను పరీక్షిస్తున్నామని.. ఇప్పటికే 250మందికి పైగా విదేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. మరో 11 మందికి రక్త పరీక్షలు కూడా జరిపామని.. ఎవ్వరికీ కరోనా లేదని తేలిందన్నారు. రాష్ట్రంలోని కొందరు నిపుణులు కేంద్ర ప్రభుత్వం వద్ద శిక్షణ తీసుకొని వచ్చిన తరువాత 9వ తేదీన రాష్ట్ర స్థాయిలో ట్రైనింగ్‌ క్యాంపు నిర్వహించబోతున్నామన్నారు. కరోనా వైరస్‌ రాష్ట్రంలోకి ఎంటర్‌ అయితే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి. ఏ విధంగా ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలని కేంద్రంలో ట్రైనింగ్‌ తీసుకున్న రాష్ట్రస్థాయి నిపుణులు జిల్లాలో ఉన్న డాక్టర్లు, సిబ్బందికి తర్ఫీదు ఇస్తారన్నారు. ఈ విధంగా కరోనా వైరస్‌ రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తీసుకోవడమే కాకుండా ఒక వేళ వస్తే ఏ విధమైన చర్యలు తీసుకోవాలని కూడా ముందుకువెళ్తున్నామన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top