కరోనా వైరస్‌కు ‘సీ’ విటమిన్‌ | Sakshi
Sakshi News home page

కరోనా వైరస్‌కు ‘సీ’ విటమిన్‌

Published Tue, Mar 3 2020 4:40 PM

Can VITAMIN C Beat Coronavirus - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చలి కాలంలో జలుబు నుంచి తప్పించుకోవడానికి విటమిన్‌ ‘సీ’ మంచి మందని చాలా మంది వైద్యులు, ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకని నేడు ప్రపంచవ్యాప్తంగా 6,500 కోట్ల రూపాయల విటమిన్‌ ‘సీ’ సప్లిమెంట్ల వ్యాపారం కొనసాగుతోంది. ఇది 2024 సంవత్సరం నాటికి ఎనిమిది వేల కోట్ల రూపాయలకు చేరుకుంటుందన్నది ఓ అంచనా. నోబెల్‌ బహుమతి గ్రహీత లైనస్‌ పాలింగ్‌ 1970లో విటమిన్‌ ‘సీ’ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఆయన స్వయంగా ప్రతి రోజు మూడు గ్రాముల సీ విటమిన్‌ తీసుకునేవారు.

ఓ మధ్యస్థాయి నారింజ పండులో 70 ఎంజీలు, మధ్యస్థాయి టమోటాలో 20 ఎంజీల సీ విటమిన్‌ ఉంటుంది. సీ విటమిన్లు తీసుకోవడం వల్ల చాలా వైరస్‌లు దూరంగా ఉంటాయన్న వాదనతో ఎక్కువ మంది శాస్త్రవేత్తలు అంగీకరించకపోయినా, సీ విటమిన్‌ వల్ల తెల్ల రక్త కణాలు పెరిగి రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే వాదనతో ఎక్కువ మంది శాస్త్రవేత్తలు ఏకీభవించారు. డిమెన్షియా లాంటి మతి మరపు వ్యాధులను తగ్గించడంలో కూడా ఈ విటమిన్‌ ఉపయోగపడుతుందని వాదిస్తున్న వారూ ఎక్కువ మందే ఉన్నారు. (కరోనా అలర్ట్‌: పోస్టర్‌ విడుదల చేసిన సర్కార్‌)

ఈ నేపథ్యంలో కొవిడ్‌ వైరస్‌ను సీ విటమిన్‌ సప్లిమెంట్లు అరికడతాయనే వాదన వైద్యుల ముందుకు వచ్చింది. దీంతో ఈ వైరస్‌ వెలుగులోకి వచ్చిన చైనాలోని వుహాన్‌లో దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. వుహాన్‌ యూనివర్శిటీలోని ఝాంగ్‌నాన్‌ హాస్పటల్‌లో 120 మంది కొవిడ్‌ వైరస్‌ బాధితులకు వరుసగా వారం రోజుల పాటు రోజుకు 24 గ్రాముల (అధిక డోసు) సీ విటమిన్‌ సప్లిమెంట్లు ఇస్తూ వచ్చారని యూనివర్శిటీ వైద్య వర్గాలు తెలిపాయి. అయితే వారి ప్రయోగ విశేషాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.   (‘కరోనాపై భయపడాల్సిన అవసరం లేదు’)

Advertisement
Advertisement