మినరల్‌తో ముప్పే

Mineral Water Becomming Dangerous To Health In Giddalur Area - Sakshi

సాక్షి, గిద్దలూరు (ప్రకాశం) : వేసవి ఎండలు నీటి వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఓ వైపు ఎండలు మండుతుంటే మరో వైపు గత ప్రభుత్వ హయాంలో రక్షిత మంచినీటి పథకాల ద్వారా ప్రజలకు తాగునీరు అందించలేకపోయింది. ఇదే అదునుగా చూసుకున్న వ్యాపారులు మినరల్‌ పేరుతో జనరల్‌ నీటిని తూతూ మంత్రంగా శుద్దిచేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు వ్యాపారులైతే వారి బోర్లు ఒట్టిపోతే ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి మరీ మినరల్‌ వాటర్‌ను విక్రయిస్తున్నారు.

తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా అందించే నీరే దిక్కైంది. నిత్యావసర పనులకు ఆ నీళ్లు ఉపయోగపడుతుండగా తాగేందుకు నీళ్లు దొరకడం లేదు. కొందరు పంట పొలాల్లోని వ్యవసాయ బోర్లవద్ద నుంచి నీళ్ళు తెచ్చుకుంటుండగా ఎక్కువ భాగం ప్రజలు మినరల్‌ వాటర్‌ను కొనుగోలు చేసి తాగుతున్నారు. ప్రజల అవసరాలు డిమాండ్‌ నేపథ్యంలో మినరల్‌వాటర్‌ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాటర్‌ ప్లాంట్ల నిర్వహణకు సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ అది ఎక్కడా అమలు కావడం లేదు. 

ప్లాంట్‌ ఏర్పాటుకు నిబంధనలు

  • వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధిత పంచాయతీ అనుమతి తప్పనిసరిగా ఉండాలి 
  •  భారతీయ ప్రమాణాలు (ఐఎస్‌ఐ) అనుమతి పొందాలి. 
  • ప్లాంట్లలో మైక్రోబయాలజిస్టు, కెమికల్‌ ల్యాబ్, ఇద్దరు ల్యాబ్‌ టెక్నీషియన్లు ఉండాలి 
  • ప్రతి 3 నెలలకొకసారి నీటి నాణ్యత ప్రమాణాలు నిర్థారించేందుకు పరీక్షలు చేయాలి. 

నీటి శుభ్రత ఇలా..
చుట్టుపక్కల ప్రాంతాల్లో లభించే నీటిలో టోటల్‌ డిజాల్వ్‌ సాలిడ్స్‌ (టీడీఎస్‌) 1500 నుంచి దాదాపు 200 దాకా ఉంటుంది. నీటిలో అత్యధికంగా 1000 టీడీఎస్‌ దాటితే అవి తాగేందుకు పనికి రావు. ఆ నీటిని తాగితే కిడ్నీ సమస్యలు, ఇతర అవయవాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆర్వో ప్లాంట్లలో విచ్చలవిడిగా భూగర్భ జలాలను తోడేసి రివర్స్‌ ఆస్మోసిస్‌ పద్ధతిలో శుభ్రపరుస్తూ జనాలకు విక్రయిస్తున్నారు. ఒక లీటర్‌ నీటిలో ఉండే 1500 టీడీఎస్‌ శుద్ధి చేసేందుకు అంతకు మించి రెండు లీటర్ల నీరు వృథాగా పోతుంది.

శుద్ధి చేసిన నీటిలో తొలగించిన టీడీఎస్‌ వృథాగా పోయే నీటిలో కలుస్తుంది. ఆ నీటిని భూగర్భంలోకి పంపడం, మురుగు కాలువల్లోకి వదలడం ఎట్టి పరిస్థితుల్లోను చేయకూడదు. వ్యర్థనీటిని డ్రైబెడ్స్‌లో కేక్‌గా మార్చి పారబోయాలి. అయితే ఆర్వో ప్లాంట్లలో ప్రమాదకర నీటిని మురుగు కాలువల్లో వదిలేస్తుంటే మరికొందరు ప్లాంట్ల నిర్వాహకులు ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఆ నీటిని కూడా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. 

నిబంధనలకు నీళ్ళు :
మండలంలో సుమారు 25 కు పైగా మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఉండగా నియోజకవర్గంలో సుమారు 200 కు పైగా వాటర్‌ ప్లాంట్లు ఉన్నాయి. మండలంలో ఒకటి రెండు ప్లాంట్లకు మినహా మిగిలిన వాటిలో ఏ ఒక్కదానికి ఐఎస్‌ఐ మార్కు కానీ అధికారుల అనుమతులు కానీ ఉన్నట్లు కనబడటం లేదు. గుర్తింపు లేని ప్లాంట్ల యజమానులకు నీటి స్వచ్ఛతను, నాణ్యతను పాటించకుండా పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు.

ప్రస్తుతం వేసవిలో క్యాన్ల విక్రయం మరింత పెరిగిపోయింది. పలుమార్లు ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకున్న దాఖలాలు కనబడటం లేదు. నాణ్యత లేని క్యాన్లలో వేసి మామూలు నీళ్ల క్యాను రూ.15, కూలింగ్‌ నీళ్లు క్యాను రూ. 30 కు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి ఐఎస్‌ఐ గుర్తింపు ఉంటేనే నీటి వ్యాపారం చేయాల్సి ఉండగా వాటి గురించి పట్టించుకునే అధికారులే కరువయ్యారు. అధికారులకు సైతం భారీగా మామూళ్లు అందుతుండటంతో మినరల్‌ ప్లాంట్ల పై చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి ప్రజలకు నాణ్యమైన నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

దాహం తీర్చని ఎన్‌.టి.ఆర్‌ సుజల స్రవంతి 
గత టీడీపీ ప్రభుత్వం పేదలకు 2 రూపాయలకే 20 లీటర్ల  మినరల్‌ వాటర్‌ అందించాలన్న లక్ష్యం ప్రారంభించిన శుద్ద జలకేంద్రాలు పేదల దాహార్తి తీర్చకుండానే మూతపడ్డాయి.  స్థానిక కందులాపురం పంచాయతీ కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన ఎన్‌టీఆర్‌ శుద్దజల కేంద్రం  ప్రారంభించిన కొద్దిరోజులకే మూత పడిపోయింది.  దీంతో పేదలు కూడా గత్యంతరం లేక రూ. 15 పెట్టి ప్రైవేటు వ్యక్తుల వద్ద నీళ్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top