ఫంక్షన్‌కు వెళ్తూ.. పరలోకానికి

Men Died in Lorry Accident East Godavari - Sakshi

బైక్‌పై వెళుతున్న ఇద్దరిని ఢీకొన్న లారీ

సామర్లకోట ఇరుకు వంతెనపై ప్రమాదం.. ఒకరి దుర్మరణం

మరొకరి పరిస్థితి విషమం

తూర్పుగోదావరి, సామర్లకోట (పెద్దాపురం): పట్టణంలోని కొత్తూరులో ఫంక్షన్‌ కోసం బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు స్థానిక వంతెన వద్ద రోడ్డు ప్రమాదానికి గురై ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.  పోలీసుల కథనం ప్రకారం తుని మండలం ఎస్‌.నర్సాపురానికి చెందిన మల్లిపాము ప్రసాద్‌ (45) అతని బంధువు మంచాల గంగాధర్‌ బైక్‌పై వారి గ్రామం నుంచి సామర్లకోట వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మృతి చెందిన ప్రసాద్‌ తల్లి, వారి బంధువులు మాత్రం ఎస్‌.నర్సాపురం నుంచి సామర్లకోటకు రైలులో వచ్చి ఫంక్షన్‌కు నేరుగా వెళ్లిపోయారు.

వీరిద్దరూ బైక్‌పై వస్తుండగా సామర్లకోట–పిఠాపురం రోడ్డులోని ఇరుకు వంతెన వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ వీరి బైక్‌ను ఢీకొంది. దీంతో వీరిద్దరూ కింద పడ్డారు. ప్రసాద్‌ను లారీ కొంతదూరం ఈడ్చుకుపోవడంతో వంతెనపై మృతి చెందాడు. బైక్‌ వెనుక కూర్చున్న గంగాధర్‌కు తీవ్రంగా గాయాలు కావడంతో అతడిని పోలీసులు 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఫంక్షన్‌ సందడిలో ఉన్న మృతుని బంధువులకు ఈ విషయం తెలియడంతో వారు బోరున విలపిస్తూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తమతో రైలులోనే రమ్మంటే బైక్‌పై వచ్చాడని, అతడి భార్య, బిడ్డలకు ఎవరూ తోడు ఉంటారని మృతుని తల్లి, బంధువుల రోదన స్థానికులను కదిలించింది. వంతెన ఇరుకుగా ఉన్నందునే ఇలా ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు విమర్శించారు. ఏఎస్సై రాజబాబు ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఎస్సై వి.కిశోర్‌ ఈ కేసును దర్యాప్తు చేస్తు న్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top