‘అందుకే లూలూ సంస్థకు భూములు రద్దు చేశాం’

Mekapati Goutham Reddy clarifies Land Cancellation For Lulu Group - Sakshi

సాక్షి, అమరావతి : యూఏఈకి చెందిన లూలూ గ్రూప్ సంస్థ ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టమని చెప్పిందనే వార్తాల్లో ఏలాంటి వాస్తవం లేదని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కొట్టిపారేశారు. ఈ విషయంపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌ ఏర్పాటుకు లూలూ  గ్రూప్ సంస్థకు విశాఖపట్నంలో 13.83 ఎకరాల భూమి కేటాయించిందని పేర్కొన్నారు. లూలూ సంస్థ సింగిల్‌ బీడ్‌ వేసినా.. అది నిబంధనలకు విరుద్ధం అని తెలిసినా.. ప్రభుత్వం వారికే ఇచ్చిందని విమర్శించారు. సింగిల్‌ బిడ్‌ మాత్రమే రావడంతోపాటు ఆ భూమి ప్రైమ్‌ ఏరియాలో ఉండటం కూడా సంస్థను రద్దు చేయడానికి ఒక కారణమన్నారు. ఈ సంస్థకు కేటాయించిన భూములపై కేసులు ఉన్నాయని మంత్రి తెలిపారు. 

అవినీతికి మేము వ్యతిరేకం
ఇక ఆ ప్రాంతంలో రూ.50 కోట్ల ఆదాయం వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారని, అయితే టీడీపీ చాలా తక్కువ రెంటల్‌ వాల్యూకు అక్కడి భూములను లూలూ సంస్థకు ఇచ్చారని వెల్లడించారు. లూలూ కంపెనీకి లెటర్‌ ఆఫ్‌ ఇండెంట్‌ ఇచ్చినా గత ప్రభుత్వం ఏమి చేయలేకపోయిందని విమర్శించారు. అవినీతికి తాము వ్యతిరేకమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ముందు నుంచే చెబుతూ వస్తున్నారని, అందుకే రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగే ఆలోచనను నిరోధించామని తెలిపారు. ఏపీఐఐసీ దగ్గర కూడా గొప్ప టెక్నాలజీ ఉందని, గతంలో అనేక నిర్మాణాలను చేపట్టిందన్నారు. దాదాపు రూ.1000 కోట్లతో అనంతపురంలో విద్యుత్‌ బస్సుల నిర్మాణ సంస్థ వీరా వాహన ఉద్యోగ ప్రైవేటు లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ఆర్బిట్రేషన్‌ ప్రతి ఒక్కరి హక్కు. పీపీఏల విషయంలో ఆర్బిట్రేషన్‌కు వెళ్లడంలో తప్పు లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తప్పు చేస్తే తాము ఎందుకు తప్పుచేయాలని ప్రశ్నించారు. గత టీడీపీ ప్రభుత్వం చిన్న, మధ్యతరహా కంపెనీలకు మౌలిక వసతులు కల్పించకుండా ఇబ్బందులు పెట్టిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఇచ్చే భూములలో పరిశ్రమల నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తామని మంత్రి  భరోసా ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top