రాష్ట్రంలో 3 పోర్టులు, 7 షిప్పింగ్‌ హార్బర్ల ఏర్పాటుకు చర్యలు

Measures to establish 3 ports and 7 shipping harbors in AP - Sakshi

మంత్రి గౌతంరెడ్డి వెల్లడి

ప్రకాశం జిల్లాలో భూముల పరిశీలన

గుడ్లూరు: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు మేజర్‌ పోర్టులు, ఏడు షిప్పింగ్‌ హార్బర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చెప్పారు. ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. పోర్టు నిర్మాణంతో పాటు దానికి అనుబంధంగా పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన భూముల కోసం గౌతంరెడ్డితో పాటు జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ శనివారం ప్రకాశం జిల్లా గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లో పర్యటించారు. రావూరు, చేవూరు గ్రామాల్లో కొన్ని భూములను, వాటికి సంబంధించిన మ్యాప్‌లను జిల్లా కలెక్టర్‌ పోల భాస్కర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గౌతంరెడ్డి ఇంకా ఏమన్నారంటే.. 

► పోర్టు నిర్మాణానికి 3,200 ఎకరాలు, పరిశ్రమల ఏర్పాటుకు 2,000 ఎకరాలు మొత్తం 5,200 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించాం. 
► రామాయపట్నం పోర్టు నిర్మించేందుకు జపాన్,నెదర్లాండ్‌ దేశాలకు చెందిన పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. 
► పోర్టుతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు మరికొంత భూమిని కేటాయిస్తే ఈ ప్రాంతాన్ని ముంబై, ఢిల్లీ నగరాల స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆ కంపెనీలు చెబుతున్నాయి. 
► త్వరలో డీపీఆర్‌లు సిద్ధం చేసి ఆగస్టు 15 నాటికి టెండర్లు పిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 
► ఒకేసారి 5,200 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి మంత్రికి సూచించగా, ఆ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి కలెక్టర్‌కు సూచించారు. వారి వెంట ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి తదితరులున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top