పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా గుణ్ణంపల్లిలో గ్యాంగ్‌వార్ జరిగింది. ఒక మద్యం దుకాణం వద్ద కాల్పులు జరిగాయి.
- తుపాకీతో కాల్చి చంపిన స్నేహితుడు!
ద్వారకా తిరుమల : ఆంధ్రప్రదేశ్‌లో విచ్చలవిడి మద్యం అమ్మకాలకు తోడు అరాచక శక్తులు పేట్రోగిపోతున్న సంఘటన మరొకటి జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పత్స మధు (45) అనే రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితుడే అతడిని చంపి ఉంటాడని అనుమానిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేటకు చెందిన పత్స మధు, అతని తమ్ముడు దుర్గాప్రసాద్, బావమరిది సందక జగన్‌మోహన్, స్నేహితుడు కాళీకృష్ణ శనివారం ఏలూరుకు కారులో బయల్దేరారు. మార్గమధ్యంలో ఓ మద్యం షాపు వద్ద ఆగారు. నలుగురూ మద్యం సేవించేందుకు సిట్టింగ్ రూమ్‌లో కూర్చున్నారు. తినడానికి ఏమైనా తెమ్మని మధు తన తమ్ముడు దుర్గాప్రసాద్‌ను బయటకు పంపాడు.
ఆ సమయంలో మధుతో కాళీకృష్ణ, బావమరిది జగన్‌మోహన్ కూర్చున్నారు. కొంతసేపటికి తుపాకీ పేలిన శబ్దం వినపడటంతో దుర్గాప్రసాద్ పరుగెట్టుకుని లోపలికి వచ్చాడు. అప్పటికే మధు మరణించాడు. కాల్పులు జరిగిన వెంటనే కాళీకృష్ణ కారులో పరారయ్యాడు. నల్లజర్ల సెంటర్‌లో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండటంతో భయపడిన కాళీకృష్ణ కారును అక్కడే వదిలి పారిపోయాడు.
దుర్గాప్రసాద్, జగన్‌మోహన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాళీకృష్ణే ఈ హత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. మధుపై తాడేపల్లిగూడెంలో 4 హత్య కేసులు, ఒక హత్యాయత్నం కేసు, ఏలూరులో ఒక హత్య కేసు ఉన్నాయి.