భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకొని మాట మార్చడంతో..!

Man Died Due to Harassment of Financiers - Sakshi

విజయవాడలో వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక

ఒంటిపై పెట్రోల్‌ పొసుకొని వ్యక్తి మృతి 

సాక్షి, విజయవాడ: విజయవాడలో వడ్డీవ్యాపారుల వేధింపులు తాళలేక.. ఓ వ్యక్తి ప్రాణం తీసుకున్నాడు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల్లో చిక్కుకున్న ఆయనను కాపాడే ప్రయత్నం చేసిన ఆయన కుమార్తెకు కూడా తీవ్రగాయాలయ్యాయి. వీరిద్దరీ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ లక్ష్మణ్‌రావు శనివారం మృతిచెందాడు.

కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం గ్రామానికి చెందిన చిన్నం లక్ష్మణరావు ట్రాన్స్‌పోర్టు వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఆయనకు అయిదు లారీలు ఉన్నాయి. వ్యాపారం కోసం విజయవాడలో సూరి శారద అనే మహిళ నుంచి 2017లో రూ. ఆరు లక్షలను రెండు రూపాయల వడ్డీకి తీసుకున్నాడు. తర్వాత కొంతకాలానికి ఆమె ద్వారా పరిచయం అయిన అమీర్‌ అనే వ్యక్తి నుంచి మరో ఎనిమిది లక్షలు అప్పు తీసుకున్నాడు. వడ్డీలు చెల్లిస్తున్నా అప్పులు తీరకపోవడంతో చోడవరంలో ఉన్న 5సెంట్ల భూమిలో రెండు సెంట్లను తనకు రిజిస్ట్రేషన్‌ చేయాలని శారద అడిగింది. రెండు సెంట్లు ఇస్తే, మిగిలిన మూడు సెంట్ల భూమిని కొనడానికి ఎవరూ ముందుకురారని లక్ష్మణరావు చెప్పాడు. దీనితో ఆ మొత్తం భూమిని తానే తీసుకోవాలని శారద నిర్ణయించుకుంది. సెంటును ఆరు లక్షలకు తీసుకోవడానికి ఒప్పందం కుదిరింది. ఈ భూమికి సంబంధించి లక్ష్మణరావుకు ఇవ్వాల్సిన మొత్తంలో అప్పులను మినహాయించుకుని మిగిలిన డబ్బులు ఇస్తానని చెప్పింది. ఈ నెల 22న లక్ష్మణ్‌రావు ఐదు సెంట్ల భూమిని శారద పేరున రిజిస్ట్రేషన్‌ చేశాడు. 

రెండు రోజుల్లో డబ్బులు సర్దుబాటు చేస్తానని చెప్పిన శారద మాటమార్చిందని సమాచారం. తన దగ్గర డబ్బులు లేవని, రిజిస్ట్రేషన్‌ చేసిన భూమిని ఎవరికైనా విక్రయించి ఇస్తానని చెప్పిడంతో లక్ష్మణ్‌రావు కంగుతిన్నాడు. ఆమె డబ్బులు ఇస్తే, వాటితో ఇతరుల వద్ద చేసిన అప్పులు తీర్చుకుందామని ఆయన భావించాడు. శారద నుంచి డబ్బులు రాకపోవడం, ఇతరుల నుంచి బకాయిలు తీర్చమని ఒత్తిడి ఎక్కువవ్వడంతో లక్ష్మణరావు అదేరోజు రాత్రి 10గంటల సమయంలో ఇంట్లోనే పెట్రోలు పోసుకుని నిప్పటించుకున్నాడు. అతన్ని రక్షించడానికి వెళ్లిన కుమార్తె సంధ్యారాణికీ గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన వారిని మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో లక్ష్మణరావు వాంగ్మూలాన్ని తీసుకున్న మంగళగిరి రూరల్‌ పోలీసులు ఆ కాపీని పోస్టులో పెనమలూరు పోలీసులకు పంపారు. పెనమలూరు పోలీసులు రంగంలోకి దిగి లక్ష్మణరావు భార్య రాణిని విచారించారు. 

శనివారం రాత్రి 10గంటల సమయంలో లక్ష్మణరావు చికిత్స పొందుతూ మృతిచెందాడు. బాధితుడు ఇచ్చిన వాంగ్మూలానికి, అతడి భార్య ఇచ్చిన ఫిర్యాదుకు చాలా వ్యత్యాసం కనిపిస్తోందని పోలీసులు అంటున్నారు. అప్పుల తీసుకున్న వాళ్లు బెదిరించడం వల్లే తన భర్త లక్ష్మణరావు మరణించాడని అతని భార్య చెప్తోంది. అయితే ఈ కేసును కాల్‌మనీగా పరిగణించడం లేదని విజయవాడ డీసీపీ హర్షవర్థన్‌రాజు చెప్పారు. బాధితుడు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కేసును నమోదు చేస్తున్నామని, అతడి భార్య రాణిని విచారించి ఆమె చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top