‘ప్రాణహిత-చేవెళ్ల’కు మహారాష్ట్ర గ్రీన్ సిగ్నల్ | Maharashtra Green Signal for Pranahita-Chevella Project | Sakshi
Sakshi News home page

‘ప్రాణహిత-చేవెళ్ల’కు మహారాష్ట్ర గ్రీన్ సిగ్నల్

Sep 13 2013 2:04 AM | Updated on Sep 1 2017 10:39 PM

‘ప్రాణహిత-చేవెళ్ల’కు మహారాష్ట్ర గ్రీన్ సిగ్నల్

‘ప్రాణహిత-చేవెళ్ల’కు మహారాష్ట్ర గ్రీన్ సిగ్నల్

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న బ్యారేజికి మహారాష్ర్ట ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. చాలా కాలం నుంచి ఈ అనుమతి కోసం రాష్ర్ట ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న బ్యారేజికి మహారాష్ర్ట ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. చాలా కాలం నుంచి ఈ అనుమతి కోసం రాష్ర్ట ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రెండు రాష్ట్రాల అధికారులు నిర్వహించిన జాయింట్ సర్వే నివేదిక కూడా తుది రూపం దాల్చింది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. అనంతరం ఈ నివేదిక పై కేంద్రం ఆమోదముద్ర వేసిన వెంటనే బ్యారేజి పనులు మొదలు కానున్నాయి. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంలో మహారాష్ట్ర, మన రాష్ట్ర సరిహద్దులో బ్యారేజిని నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ బ్యారేజి నిర్మాణం వల్ల మహారాష్ర్టలోని భూభాగం ముంపునకు గురవుతుంది. అందుకోసం మహారాష్ర్ట ప్రభుత్వం ఈ బ్యారేజి నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఆమోదాన్ని తెలపాల్సి ఉంది.
 
 మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికీ మహారాష్ర్టతో ఒప్పందం జరిగినా... ముంపు సమస్య ఉన్న బ్యారేజి నిర్మాణానికి ప్రత్యేక ఆమోదం అవసరం. ఇందుకోసం బ్యారేజి నిర్మించే ప్రాంతంలో రెండు రాష్ట్రాల ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు జాయింట్ సర్వేను నిర్వహించారు. గత రెండు మాసాల కిందట జరిగిన ఈ సర్వే నివేదిక కూడా సిద్ధమైంది. జాయింట్ సర్వే, ముంపు ప్రాంత గుర్తింపు ప్రక్రియ ముగియడంతో బ్యారేజి నిర్మాణానికి మహారాష్ర్ట ప్రభుత్వం తమ అనుమతిని తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇప్పటికే కాల్వల పనులతో పాటు, టన్నెల్ తవ్వకాన్ని కూడా మొదలు పెట్టారు. మహారాష్ర్టకు పరిహార చెల్లింపు పూర్తయిన తర్వాత బ్యారేజీ పనులను కూడా ప్రారంభించనున్నారు.
 
తెలంగాణకు జీవధార
సుమారు రూ. 38 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రాంతానికి సాగునీరు, మంచినీరు అందనుంది. తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. అలాగే హైదరాబాద్ నగర మంచినీటి అవసరం కోసం 30 టీఎంసీలను తరలించనున్నారు. మొత్తం 160 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టు కోసం గోదావరి నదికి ఉపనది అయిన ప్రాణహిత నుంచి లిప్టుల ద్వారా తరలించనున్నారు. ఇందుకోసం సుమారు 3,466 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది. మొదట నిర్ణయించిన గడువు ప్రకారం 2013-14 లోపు ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. అయితే పనులను ప్రారంభించడం ఆలస్యం కావడంతో ఈ గడువును 2018 వరకు పొడిగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement