శివనామస్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు

Maha Shivaratri Celebrations In Telugu States - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పర్వదినం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం నాడే మహాశివరాత్రి పర్వదినం కూడా రావడంతో మహాశివుని దర్శనానికి భక్తులు బారులు తీరారు. శైవక్షేత్రాలన్ని శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. 

శ్రీశైలం: ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భక్తజనంతో కిటకిటలాడుతోంది. పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించడానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం రాత్రే నాలుగు లక్షల మందికి పైగా భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా మల్లన్న సర్వదర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. 

వేములవాడ: తెలంగాణలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ప్రభుత్వం తరఫున రాజరాజేశ్వర స్వామి వారికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు, ప్రధాన అర్చకులు డాలర్‌ శేషాద్రి పట్టువస్త్రాలు సమర్పించారు.

విజయవాడ: మహాశివరాత్రి సందర్భంగా భక్తుల పుణ్యస్నానాలతో దుర్గాఘాట్‌, భవానీ ఘాట్‌, పున్నమీ ఘాట్‌లు కిటకిటలాడుతున్నాయి. విజయవాడలోని పాత శివాలయం, యలనమకుదురు రామలింగేశ్వర స్వామి ఆలయం, దుర్గగుడిలోని మల్లేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శివాలయాల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక అభిషేకాలు కొనసాగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామ క్షేత్రాలైన అమరావతి, సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరంలోని పరమశివుడి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దేవదేవుడిని దర్శించుకుంటున్నారు. అర్చనలు, రుద్రాభిషేకాలు, ప్రత్యేక​పూజలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని కీసర రామలింగేశ్వర స్వామి ఆలయం, కాళేశ్వరం, నల్గొండ జిల్లాలోని చెర్వుగట్టు, పానగల్‌ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top