బాణసంచా కాదు..బాంబులు పేలాయి!

బాణసంచా కాదు..బాంబులు పేలాయి!


* వాకతిప్ప విస్ఫోటంపై సీబీఐ లేదా జ్యుడీషియల్ విచారణ జరపాలి

* ‘వాకతిప్ప’ బాధితుల డిమాండ్

* మేజిస్టీరియల్ విచారణ బహిష్కరణ

* అధికారుల నిర్బంధం

* దళిత, ప్రజాసంఘాలు,అఖిలపక్షం మద్దతు

* అర్ధాంతరంగా ముగించి, వెనుతిరిగిన అధికారులు


పిఠాపురం : ‘బాణసంచా పేరుతో అక్కడ బాంబులు తయారు చేస్తున్నారు. అందువల్లే అంత భారీ పేలుడు జరిగి.. మృతదేహాలు ముక్కలుముక్కలై వందల మీటర్ల దూరంలో ఎగిరి పడ్డాయి. ఈ ఘటన వెనుక నిజాలు బయట పడాలంటే కచ్చితంగా సీబీఐ విచారణ జరిపించాలి’ అని వాకతిప్ప బాణసంచా పేలుడు బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. యు.కొత్తపల్లి మండలం వాకతిప్పలోని బాణసంచా తయారీ కేంద్రంలో గత నెల 20న జరిగిన పేలుడు ఘటనపై.. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో కాకినాడ ఆర్డీవో అంబేద్కర్ సోమవారం చేపట్టిన మేజిస్టీరియల్ విచారణను బాధిత కుటుంబాలు బహిష్కరించాయి.



సాయంత్రం 3 గంటలకు ఆర్డీవో విచారణ ప్రారంభించారు. దళిత, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతల ఆధ్వర్యంలో.. వాకతిప్ప ఎస్సీ కాలనీకి చెందిన పదిమంది మృతుల కుటుంబ సభ్యులు ప్రదర్శనగా విచారణకు వచ్చారు. బాధిత కుటుంబీకులు వారి అనుమానాలను, ఆధారాలను తెలియజేయాలని ఆర్డీవో సూచించారు. మృతుల్లో ద్రాక్షారపు చినబుల్లి కుటుంబానికి పరిహారం ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని బాధితులు నిలదీశారు. ఇది కేవలం మేజిస్టీరియల్ విచారణని, ఇందులో వివరాలు సేకరిస్తామే తప్ప సమస్యలు పరిష్కరించడం తన పరిధిలో ఉండదని ఆర్డీవో చెప్పారు. ఆమె మృతిని ఇంకా ధ్రువీకరించలేదని, డీఎన్‌ఏ పరీక్షల అనంతరం మృతిని ధ్రువీకరించి పరిహారం అందిస్తారని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. దీనిపై ఆగ్రహించిన బాధితులు.. ‘ఆ విషయం మీ పరిధిలోది కాకపోతే విచారణ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.



జరిగిన దారుణంపై సక్రమంగా స్పందించ లేదంటూ కలెక్టర్, డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, ఆర్డీవో, ఇతర అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  ఏకంగా 18 మంది ప్రాణాలు కోల్పోతే వెంటనే విచారణ జరపాల్సిందిపోయి, ప్రమాదం జరిగిన 22 రోజుల తరువాత విచారణ ప్రారంభించడమేమిటని నిలదీశారు. లెసైన్‌‌స మంజూరు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకినాడ ఆర్డీవో అంబేద్కర్‌నే విచారణాధికారిగా నియమించడం చూస్తే.. దొంగ చేతికే తాళాలిచ్చినట్టుగా ఉందని ఆరోపించారు. మేజిస్టీరియల్ విచారణను తాము వ్యతిరేకిస్తున్నామని, దీనిని వెంటనే నిలిపివేసి, ఆపి జ్యుడీషియల్ లేదా సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తాము ఆందోళనకు దిగినా విచారణ కొనసాగిస్తున్న ఆర్డీవోపై మండిపడ్డారు.



విచారణ జరుగుతున్న ఎంపీడీవో కార్యాలయం ప్రహరీ గేటు మూసివేశారు. అధికారులను నిర్బంధించి, వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విచారణను ఇక్కడితో ఆపి జ్యుడీషియల్ లేదా సీబీఐ విచారణ ప్రారంభించకపోతే మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని, నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. ఎంఆర్‌పీఎస్ నాయకులు కొమ్ము చినబాబు, ఉల్లంపర్తి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకుడు వేమగిరి వెంకట్రావు, దళిత నాయకులు రాజేంద్ర, మసకపల్లి రాజకుమార్, చింతపర్తి రాంబాబు, పలివెల సత్యానందం, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓలేటి రాయభాస్కరరావు, పిల్లి తిరుపతిరావు, విప్పర్తి రామన్న, మందపల్లి శ్యామ్, పిల్లా వరప్రసాద్, వల్లూరి రాజబాబు, దాసరి సత్యనారాయణ, రవణం సుబ్రహ్మణ్యం తదితరులు బాధిత కుటుంబీకులకు సంఘీభావంగా ఆందోళనకు దిగారు.

 

కలెక్టర్ ఆదేశాల మేరకే విచారణ

కలెక్టరు ఆదేశాల మేరకే ఈ విచారణ చేస్తున్నానని, ప్రమాదం ఎలా, ఎందువల్ల జరిగిందన్న విషయాలపై మాత్రమే విచారణ జరుపుతామని, డిమాండ్లను తాము స్వీకరించలేమని విచారణాధికారి ఆర్డీవో అంబేద్కర్ తెలిపారు. బాధితుల డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పారు. దీంతో శాంతించిన బాధితులు అడ్డు తొలగడంతో అధికారులు వెళ్లిపోయారు.

 

15న మళ్లీ విచారణ

ఈ నెల 15న మరో దఫా విచారణ జరుపుతామని, బాధితుల కుటుంబీకులు, ప్రత్యక్ష సాక్షులు, ఇతర అధికారులను విచారిస్తామని ఆర్డీవో తెలిపారు. ఈ విచారణ పలుమార్లు జరుగుతుందన్నారు. ఇప్పటికే పలు వివరాలు సేకరించామని, ఈ సంఘటనకు సంబంధించిన అన్ని శాఖల అధికారులనూ విచారిస్తామని చెప్పారు. ఈ విచారణలో జిల్లా అగ్నిమాపక అధికారి ఉదయ్‌కుమార్, సహాయ అగ్నిమాపక అధికారి బీజెడీఎస్పీ కుమార్, ఇన్‌చార్జ్ తహశీల్దార్ ప్రసాద్, ఎస్సై ఎన్,కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top