పట్నం.. ఇక నగరం!

Machilipatnam Panchayat Turn to Corporation - Sakshi

జూలై 3 నుంచి నగరపాలకసంస్థగా రూపాంతరం

2015లోనే మచిలీపట్నంను కార్పొరేషన్‌ చేయాలని ఉత్తర్వులు

అప్పటికే పాలకవర్గాలు కొలువు దీరడంతో ఎన్నికల అనంతరం ఏర్పాటుకు ఆదేశాలు

మున్సిపల్‌ కార్యవర్గ పదవీ కాలం ముగుస్తుండడంతో అధికారుల కసరత్తు

ప్రాచీన పురపాలక సంఘం మచిలీపట్నం..ఇకపై నగరపాలకసంస్థ కానుంది. ఏళ్లుగాకలగానే మిగిలిన కార్పొరేషన్‌ హోదా త్వరలోనేనెరవేరనుంది. మూడేళ్ల క్రితం కార్పొరేషన్‌హోదా కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడినా..కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం మున్సిపాలిటీపాలకవర్గాల పదవీ కాలం కొద్ది రోజులుమాత్రమే ఉండటంతో అప్పట్లో వెలువడినఉత్తర్వుల ప్రకారం మున్సిపాలిటీ కార్పొరేషన్‌గారూపుదిద్దుకునేందుకు అడుగులు పడుతున్నాయి. జూలై 3వ తేదీ నుంచి కార్పొరేషన్‌గామార్చి పాలన సాగించేందుకు అవసరమైనఏర్పాట్లను అధికారులు చేపడుతున్నారు.

సాక్షి,కృష్ణాజిల్లా, మచిలీపట్నం: మచిలీపట్నం 1886లో పురపాలక సంఘంగా రూపాంతరం చెందింది. 42 వార్డుల పరిధిలో 1.80 లక్షల జనాభా నివసిస్తున్నారు. బందరును నగరపాలక సంస్థగా పరిగణించాలని 2015 సెప్టెంబరు 29న ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవో జారీ అయిన వారం రోజుల్లోనే మున్సిపల్‌ కౌన్సిల్‌ తీర్మానం చేసి పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మున్సిపల్‌ పాలకులు గడువు కంటే ముందే అంటే.. జీవో వచ్చిన మరుసటి రోజే కౌన్సిల్‌ ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించేశారు. అప్పుడే అందరూ బందరు కార్పొరేషన్‌ అయిపోయిందని భావించారు. నగరపాలక సంస్థ కావాలంటే 3 లక్షలకుపైగా జనాభా ఉండాలి. బందరులో ఆ మేరకు జనాభా లేదు. దీంతో మచిలీపట్నంకు పక్కనున్న గ్రామాలను సైతం విలీనం చేయాలని భావించారు. ఇవన్నీ చేయకుండా ఉంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, దీనికి తోడు పాలకవర్గాలు కొలువుదీరి ఏడాదిన్నర కాలం కూడా గడవకుముందే మళ్లీ ఎన్నికలంటే తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని గుర్తించిన ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల వరకు ఆగాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జీఓను పక్కనబెట్టేశారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అప్పటి ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం అధికారులు మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా తీర్చి దిద్దేందుకు కసరత్తు చేస్తున్నారు. జూలై 3వ తేదీ నుంచి బందరు నగర పాలక సంస్థ కార్పొరేషన్‌ హోదాలో పాలన సాగించనుంది. 

అప్పుడలా..
బందరు కార్పొరేషన్‌గా రూపాంతరం చెందితే ప్రస్తుతం ఉన్న 42 వార్డుల స్థానంలో డివిజన్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఒక్కో డివిజన్‌కు 6 వేల మంది జనాభా ఉండాలి. నగర పాలక సంస్థలో 50 డివిజన్లు ఉండాలి. కానీ ప్రస్తుతం పట్టణంలో 30 డివిజన్లు ఉన్నాయి. దీంతో అప్పట్లో బందరుకు సమీపంలో ఉన్న సుల్తానగరం, అరిశేపల్లి, గరాలదిబ్బ, పోతేపల్లి, మేకవానిపాలెం,పెడన మున్సిపాలిటీ, గూడూరు మండలంలోని కప్పలదొడ్డి, పోసినవారిపాలెం, ఆకులమన్నాడు, కోకనారాయణపాలెం, నారికేడలపాలెంలను బందరు కార్పొరేషన్‌లో విలీనం చేయాలనుకున్నారు.

ఇప్పుడిలా..
ప్రస్తుతం విలీనం ప్రక్రియను పక్కనబెట్టి పట్టణాన్నే కార్పొరేషన్‌గా చేయాలని మున్సిపల్‌ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. దీంతో పట్టణంలోని 42 వార్డులనే 50 డివిజన్లుగా రూపుదిద్దాలని అధికారులు భావిస్తున్నారు.

కార్పొరేషన్‌ హోదాలోనే ఎన్నికలు..
మున్సిపాలిటీ పాలకవర్గ పదవీ కాలం జూలై 2తో ముగియనుంది. సార్వత్రిక ఎన్నికలు సైతం ఇప్పటికే ముగిశాయి. ఈ తరుణంలో కార్పొరేషన్‌ హోదాలో వచ్చే ఎన్నికలను నిర్వహించనున్నారు. రెండేసి వార్డులు కలిపేసి ఒక డివిజన్‌గా రూపుదిద్దనుండటంతో వార్డులకు అన్నీ తామై వ్యవహరిస్తున్న కౌన్సిలర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

3 నుంచి కార్పొరేషన్‌ హోదా..
బందరు మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మారుస్తూ 2015లోనే ఉత్తర్వులు వెలువడ్డాయి. అప్పట్లో అభ్యంతరాలు రావడంతో సార్వత్రిక ఎన్నికల అనంతరం అమలు చేయాలని ఉత్తర్వులు అందాయి. దీంతో కార్యాచరణ ప్రారంభించాం. డివిజన్ల ఏర్పాటుపై ప్రభుత్వానికి నివేదించాం. పట్టణంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ఇవ్వాలని కలెక్టర్‌కు నివేదించాం. డివిజన్ల ఏర్పాటు, జనాబా వర్గీకరణ తదితర అంశాలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యవహరిస్తాం.–పీజే సంపత్‌ కుమార్, మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top