
మధ్యాహ్న భోజనానికి బకాయి పోటు
జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం గాడితప్పింది. నాలుగు నెలల నుంచి బిల్లులు మంజూరుచేయకపోవడంతో నిర్వాహక ఏజెన్సీలు చేతులెత్తేశారు.
ఉదయగిరి: జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం గాడితప్పింది. నాలుగు నెలల నుంచి బిల్లులు మంజూరుచేయకపోవడంతో నిర్వాహక ఏజెన్సీలు చేతులెత్తేశారు. మధ్యాహ్న మెనూను మమ అనిపిస్తున్నారు. దీంతో విద్యార్థులు చప్పిడి చారు, అన్నం తినలేక అర్ధాకలితో అలమటించాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ విద్యాసంవత్సరంలో మొదటి మూడు నెలలకు నిధులు మంజూరుచేసిన ప్రభుత్వం ఆ తర్వాత పథకాన్ని పట్టించుకోలేదు.
దీంతో మధ్యాహ్న భోజన పథకం అమలు ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో 2,642 ప్రాథమిక, 289 ప్రాథమికోన్నత, 387 ఉన్నత పాఠశాలలతో పాటు 115 ఎయిడెడ్, 777 ప్రైవేటు పాఠశాలలున్నాయి. వీటి పరిధిలో ఐదు లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 3.7 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్నం పూట ఆయా పాఠశాలల్లో భోజనం చేస్తున్నారు.
1-5 తరగతుల వరకు ఒక్కో విద్యార్థికి వంద గ్రాముల బియ్యం, రూ.4.35 నగదు, 6-10 తరగతుల విద్యార్థులకు 150 గ్రాముల బియ్యం, రూ.6 నగదు ప్రభుత్వం అందజేస్తోంది. ఈ నగదుతోనే పప్పుదినుసులు, కోడిగుడ్లు, ఆకుకూరలు, కూరగాయలు కొనుగోలు చేయాలి. బియ్యం మాత్రం నిర్వాహక ఏజెన్సీలకు చౌకదుకాణాల ద్వారా ప్రభుత్వమే సరఫరా చేస్తుంది.
ప్రతి నెలా బిల్లులు నిర్వాహక ఏజెన్సీలకు సక్రమంగా అందజేస్తే..వారు మెనూ కూడా సక్రమంగా అమలుచేసే అవకాశముంటుంది. కానీ రెండు నెలలకో, మూడు నెలలకో ఒకసారి బిల్లులు ఇస్తుండటంతో నిర్వాహక ఏజెన్సీలకు ఇబ్బందిగా మారింది. దుకాణదారులు సరుకులు అప్పు ఇవ్వకపోవడంతో ఈ పథకాన్ని అరకొర మెనూతో నెట్టుకొస్తున్నారు.
నాలుగు నెలలుగా అందని బియ్యం
ప్రభుత్వానికి ముందుచూపు కొరవడటంతో మధ్యాహ్న భోజన పథకానికి బిల్లుల చెల్లింపులో ఆటంకం ఏర్పడింది. మొదటి మూడు మాసాలకు గత ఏడాది మంజూరుచేసిన బడ్జెట్‌లో నిధులను సర్దుబాటు చేశారు. కానీ ప్రభుత్వం మిగతా నెలలకు సంబంధించి పైసా కూడా బడ్జెట్ విడుదల చేయలేదు.
రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో అన్ని పాఠశాలల్లో నిర్వాహక ఏజెన్సీలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు మాసాలతో పాటు నవంబరు మాసం కూడా ద్వితీయార్థం ముగిసినా బిల్లులు అందే పరిస్థితి కనిపించలేదు. అదేవిధంగా నిర్వాహక ఏజెన్సీలకు నెలనెలా ఇవ్వవల్సిన రూ.1000 గౌరవ వేతనం కూడా అందటంలేదు. దీంతో దీనిపై ఆధారపడిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
పెరిగిన ధరలు
ప్రభుత్వం ఏడాది నుంచి మెనూ చార్జీలు పెంచలేదు. కానీ చిల్లర సరుకులు, కూరగాయల ధరలు మాత్రం పెరిగాయి. దీంతో నిర్వాహకులు కూడా తగిన మోతాదులో వీటిని వినియోగించలేని పరిస్థితి నెలకొంది. వారానికి రెండు రోజులు ఇవ్వవలసిన కోడిగుడ్లను ఇస్తే ఒకటో అరో ఇస్తున్నారు. లేకపోతే అసలు లేదు. ఈ పరిస్థితిలో మధ్యాహ్న భోజన పథక మెనూ విద్యార్థులకు అసంతృప్తినే మిగులుస్తోంది.
స్వల్పంగా పెరిగిన మెనూ చార్జీలు
ప్రభుత్వం ఈ నెలలో మెనూ చార్జీలను స్వల్పంగా పెంచింది. 1-5 తరగతుల వరకు ప్రస్తుతం ఇస్తున్న రూ.4.35 నుంచి రూ.4.65కు, 6-10 తరగతులకు ఇస్తున్న రూ.6ను రూ.6.30కి పెంచింది. అయితే ఇంతవరకు పెంచిన మెనూ చార్జీలు మాత్రం అమలులోకి రాలేదు.
నాలుగు నెలలుగా అందని జీతాలు:
గత నాలుగు నెలలనుంచి నాకు రావలసిన గౌరవ వేతనం రాలేదు. దీంతో ఇంట్లో గడవడం లేదు. బయట పనికెళ్లినా రోజూ రూ.200 వస్తుంది. కానీ దీనిమీద ఆధారపడి ఉన్నా ఇచ్చే కొద్దోగొప్పో కూడా ఇవ్వడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గౌరవ వేతనాన్ని వెంటనే మంజూరుచేయాలి.
-పోలమ్మ, మధ్యాహ్న భోజన పథకం హెల్పర్, ఉదయగిరి
సరుకులు అప్పు ఇవ్వడం లేదు:
నాలుగు నెలల నుంచి బిల్లులు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దుకాణదారులు సరుకులు కూడా అప్పు ఇవ్వడం లేదు. నిర్వహణ కష్టంగా మారింది. ఈ నెలలో బిల్లులు ఇవ్వకపోతే మధ్యాహ్న భోజనంఆపివేయడం తప్ప వేరే గత్యంతరం లేదు. -నల్లిపోగు నాగమణి, ఏజెన్సీ నిర్వాహకురాలు.