కుదేలవుతున్న లారీ పరిశ్రమ

Lorry Industrie Worried About Diesel Rates Hikes - Sakshi

పెరిగిన డీజిల్‌ ధరలతో బెంబేలు

30 శాతం మేర పెరిగిన విడిభాగాల ధరలు

డ్రైవర్లుగా మారిన వాహన యజమానులు

చిత్తూరు ,మదనపల్లె సిటీ: దేశీయంగా వస్తువులు, నిత్యావసర సరుకుల చేరవేతకు కీలకమైన రవాణా రంగం దివాలా దిశగా పయనిస్తోంది. పెరుగుతున్న డీజిల్‌ ధరలు, రోడ్డు ట్యాక్స్, థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌తో కుదేలవుతోంది. పెరుగుతున్న వ్యయాలకు అనుగుణంగా లాభాలు రాక, నష్టాలతో వాహనాలను నడపలేక తుక్కు ఇనుము కింద తెగనమ్ముకునే పరిస్థితులు అనివార్యమవుతున్నాయి.

పెరిగిన ధరలతో కుదేలు..
రవాణా రంగంలో లారీలు ప్రధాన పాత్ర పోషి స్తున్నాయి. వీటికి సంబంధించిన థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ ప్రీమియం, రోడ్డు ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. 2013లో ధర్డ్‌ పార్టీ ఇన్సూరెన్సు రూ.16,300 ఉండగా ప్రస్తుతం రూ.42 వేలకు చేరింది. టైర్లు, వాహనాల విడిభాగాల ధరలు కూడా 30 శాతం మేర పెరిగాయి. పుండు మీద కారంచల్లిన చందంగా లీటర్‌ డీజిల్‌ ధర రూ.80కి చేరింది. వీటితో పాటు జాతీయ రహదారులపై ప్రతి 50  కిలో మీటర్లకు టోల్‌గేట్లు, జీఎస్టీతో వాహన యజమానులు రోడ్డున పడుతున్నా రు. రాష్ట్ర ప్రభుత్వమైతే యజమానుల దగ్గర సెస్‌ వసూలు చేసి బలవంతంగా చంద్రన్న బీమా చేయిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.

9 నెలల్లో 50 లారీల సీజ్‌..
జిల్లాలో చిన్న,పెద్దవి కలిపి 23 వేలకు పైగా రవాణా వాహనాలు ఉన్నాయి. టమట, మామిడి, బెల్లం, పప్పు, బియ్యం రవాణా తదితర వాటిపై ఆధారపడి వీటిని నడుపుతున్నారు. సరుకు రవాణాలోనే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ఈ పరిశ్రమ వెన్నుదన్నుగా నిలుస్తోంది. పరిశ్రమను నమ్ముకుని వేలాది మంది కార్మికులు జీవనం సాగిస్తున్నారు. రవాణా రంగంలో నెలకొన్న పోటీ తీవ్రత కారణంగా ఐదేళ్ల క్రితం నాటి కిరాయిలే నేటికీ కొనసాగుతున్నాయి. ఇదే తరుణంలో ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. లారీ ట్రిప్పు పోయి వస్తే గతంలో సరుకు విలువలో ఖర్చులు పోను 12 శాతం మిగిలేది. ప్రస్తుతం 7 నుంచి 8 శాతం మాత్రమే మిగులుతోంది. గతంలో వచ్చిన కిరాయిలో డ్రైవర్లకు 2 శాతం కమీషన్‌ ఇచ్చేవారు. ప్రస్తుతం 5 శాతం ఇవ్వాల్సి వస్తోంది. ఈ కారణంగా ఇప్పటికే కొంత మంది తమ లారీలు అమ్మకానికి పెట్టారు. మరికొందరు బయటకు వెళ్లలేక అష్టకష్టాలు పడుతూ నెట్టుకొస్తున్నారు. గత తొమ్మిది నెలల కాలంలో ఫైనాన్స్‌ కట్టలేక దాదాపు 50 లారీలను సీజ్‌ చేశారంటే యజమానుల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top