శ్రీకాళహస్తికి లాక్‌

Lockdown in Srikalahasti And Tirupati - Sakshi

జిల్లాలో మొత్తం 73 పాజిటివ్‌ కేసులు

రెడ్‌జోన్‌ పరిధిలో  13 మండలాలు (తిరుపతితో పాటు)

సాక్షి, తిరుపతి/శ్రీకాళహస్తి:  జిల్లాలో తాజాగా 14 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 73కు చేరింది. అందులో అత్యధిక కేసులు శ్రీకాళహస్తిలో నమోదు కావడంతో పట్ట ణం మొత్తం రెడ్‌ జోన్‌ పరిధిలోకి వెళ్లింది. ప్రజలు ఇళ్ల నుంచి వెలుపలి కి రాకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. ఇళ్లలో కూడా భౌతికదూరం పాటించాలని సూచించారు.

నిత్యావసర సరుకులు అవసరమైన వారికి వలంటీర్ల ద్వారా డోర్‌ డెలివరీ చేయిస్తామన్నారు. ఈక్రమంలో గురువారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో హైపవర్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్త, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఆర్‌పీ సిసోడియా, డీఐజీ క్రాంతిరాణా టాటా, తిరుపతి అర్బన్‌ ఎస్పీ రమేష్‌రెడ్డి, ఆర్‌డీఓ కననకనరసారెడ్డి, ప్రత్యేక అధికారులు పృథ్వీతేజ్, సునీల్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ శ్రీకాళహస్తి నుంచి ఉద్యోగుల రాకపోక లను నిషేధించామన్నారు. మే 3 వరకు ఎలాంటి సడలింపులు లేకుండా లాక్‌డౌన్‌ కొనసాగుతుందని స్పష్టంచేశారు. కేవలం 35వార్డులు ఉన్న పట్టణంలో ఇన్ని కేసులు నమోదు కావడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా జాగ్రత్త పడాలని హెచ్చరించారు. 14రోజులపాటు కొత్త కేసులు నమోదు కాకుంటే ఆరెంజ్‌ జోన్‌గా ప్రకటిస్తామని చెప్పారు.  కేంద్రప్రభుత్వ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 9849907502కు ఫోన్‌ చేసి సమస్యలు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. కోవిడ్‌–19 ప్రత్యేకాధికారిగా సునీల్‌కుమార్‌రెడ్డిని ప్రభు త్వం నియమించిందని తెలిపారు.

అధికారుల మాక్‌ డ్రిల్‌
శ్రీకాళహస్తి పట్టణాన్ని రెడ్‌జోన్‌ గా ప్రకటించిన నేపథ్యంలో  గురు వారం రాత్రి అధికారులు వాహనాల తో మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. ప్రజల ను అప్రమత్తం చేశారు. శ్రీకాళహస్తితోపాటు తిరుపతి, నగరి, పలమనేరు, రేణిగుంట, ఏర్పేడు,  చంద్రగిరి, నిండ్ర, వడమాలపేట, ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు, పుత్తూరు, బీఎన్‌కండ్రిగ మండలాల్లో కొత్త కేసులు నమోదు కావడంతో వాటిని కూడా రెడ్‌జోన్లుగా ప్రకటించామని కలెక్టర్‌ వెల్లడించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top