ఆంధ్రా అధికారుల అడ్డగింత | Sakshi
Sakshi News home page

ఆంధ్రా అధికారుల అడ్డగింత

Published Thu, Nov 27 2014 1:17 AM

Local mpdo tension in the office

భద్రాచలం: ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన మండలాల్లో ఉద్యోగుల వివరాలు సేకరించేందుకు బుధవారం భద్రాచలం వచ్చిన తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారులను ఇక్కడి ఉద్యోగులు అడ్డుకున్నారు. దీంతో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విలీన మండలాల్లో పాలనపై పట్టుసాధించేందుకు ఉద్యోగుల వివరాలు సేకరించాలనే ఏపీ ప్రభుత్వ ఆదేశం మేరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఆయా మండలాల్లోని ఉద్యోగుల జీతభత్యాల వివరాలు పంపించాలని డీడీవోలకు సూచించారు. ఈ క్రమంలో నెల్లిపాక మండల ఉపాధ్యాయుల వివరాల సేకరణకు అక్కడి అధికారులు వచ్చారు.

విషయం తెలుసుకున్న ముంపు ఉద్యోగ సంఘ నాయకులు అక్కడికి చేరుకొని ఆంధ్ర అధికారులను అడ్డుకున్నారు. ఉద్యోగుల ఆప్షన్‌ల విషయం తేల్చకుండా వివరాల సేకరణకు ఎలా వస్తారని వారితో వాగ్వాదానికి దిగారు. ఆప్షన్‌ల మేరకు విలీన మండలాల్లో ఉన్న ఉద్యోగులను వెంటనే బదిలీ చేయాలని, ఆ తరువాతనే ఆంధ్ర అధికారులు ముంపు మండలాల్లో పర్యటించాలని కొద్దిసేపు ఘెరావ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన సద్దుమణిగేలా చూశారు. కాగా, ఉద్యోగుల నిరసనల మధ్య వివరాలు సేకరించకుండానే అధికారులు వెనుదిరిగారు.

Advertisement
Advertisement