breaking news
Employee option
-
ఆంధ్రా అధికారుల అడ్డగింత
భద్రాచలం: ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన మండలాల్లో ఉద్యోగుల వివరాలు సేకరించేందుకు బుధవారం భద్రాచలం వచ్చిన తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారులను ఇక్కడి ఉద్యోగులు అడ్డుకున్నారు. దీంతో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విలీన మండలాల్లో పాలనపై పట్టుసాధించేందుకు ఉద్యోగుల వివరాలు సేకరించాలనే ఏపీ ప్రభుత్వ ఆదేశం మేరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఆయా మండలాల్లోని ఉద్యోగుల జీతభత్యాల వివరాలు పంపించాలని డీడీవోలకు సూచించారు. ఈ క్రమంలో నెల్లిపాక మండల ఉపాధ్యాయుల వివరాల సేకరణకు అక్కడి అధికారులు వచ్చారు. విషయం తెలుసుకున్న ముంపు ఉద్యోగ సంఘ నాయకులు అక్కడికి చేరుకొని ఆంధ్ర అధికారులను అడ్డుకున్నారు. ఉద్యోగుల ఆప్షన్ల విషయం తేల్చకుండా వివరాల సేకరణకు ఎలా వస్తారని వారితో వాగ్వాదానికి దిగారు. ఆప్షన్ల మేరకు విలీన మండలాల్లో ఉన్న ఉద్యోగులను వెంటనే బదిలీ చేయాలని, ఆ తరువాతనే ఆంధ్ర అధికారులు ముంపు మండలాల్లో పర్యటించాలని కొద్దిసేపు ఘెరావ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన సద్దుమణిగేలా చూశారు. కాగా, ఉద్యోగుల నిరసనల మధ్య వివరాలు సేకరించకుండానే అధికారులు వెనుదిరిగారు. -
తెలంగాణకే మొగ్గు
భద్రాచలం : ముంపు మండలాల్లో ఉద్యోగుల పంపకాలకు సంబంధించిన నివేదికలు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 31 నాటికి ముంపు మండలాల్లోని ఉద్యోగులు ఎవరు ఏ రాష్ట్రంలో ఉంటారనేది తేలిపోనుంది. ఇందుకోసం ఆయా శాఖల ఉన్నతాధికారులు ఉద్యోగుల పంపకాలకు సంబంధించిన లెక్కలు వేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయా శాఖల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను పూర్తి స్థాయిలో సేకరిస్తున్నారు. ముంపు మండలాల్లో ఉన్న ప్రత్యేక వెసులుబాటు దృష్ట్యా అక్కడ పనిచేస్తున్న వారు అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడైనా పనిచేసేలా ఆప్షన్ సౌకర్యం కల్పించే క్రమంలోనే ఉద్యోగుల నుంచి అంగీకార పత్రాలను తీసుకుంటున్నారు. ముంపులో పనిచేసే ఉద్యోగుల సెప్టెంబర్ నెల వేతనాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెల్లించనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ నెలాఖరు నాటికి ముంపులో తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులంతా తిరిగి వెనక్కు పంపించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే బుధవారం ముంపు మండల విద్యాశాఖాధికారులతో డీఈవో ప్రత్యేకంగా సమావేశమై ఉద్యోగుల జాబితాలపై సమీక్షించారు. అలాగే ఇప్పటికే అన్ని శాఖల నుంచి ముంపులో పనిచేస్తున్న ఉద్యోగుల జాబితా, వారు ఏ రాష్ట్రంలో పనిచేస్తారనే దానిపై జిల్లా కలెక్టర్ నివేదిక కోరారు. కాగా ముంపులో పనిచేస్తున్న దాదాపు అన్ని శాఖల్లో ఎక్కువ మంది ఉద్యోగులు తెలంగాణకే వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. వైద్యశాఖలో తెలంగాణకు 263, ఆంధ్రకు 54 మంది ఆప్షన్... వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి ముంపు మండలాల్లో ఉన్న పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, సీహెచ్ఎన్సీలలో అన్ని కేడర్లకు సంబంధించి మొత్తం 317 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, ఇందులో 263 మంది తెలంగాణ రాష్ట్రంలోనే పనిచేసేందుకు అంగీకారం తెలిపారు. కాగా 54 మంది ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసేందుకు అంగీకరించారు. చింతూరు మండలంలో అప్షన్ల వివరాలు... విద్యా శాఖలో మొత్తం ఉపాధ్యాయులు 121 మంది కాగా, ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 56 మంది, తెలంగాణకు 65 మంది అప్షన్లు ఇచ్చారు. రెవెన్యూ శాఖలో మొత్తం ఉద్యోగులు 21 మంది కాగా, 16 మంది తెలంగాణలో, ఐదుగురు ఏపీలో పనిచేసేందుకు అంగీకార పత్రాలు ఇచ్చారు. వైద్య ఆరోగ్యశాఖలో 43 మందికి ఏపీలో 9 మంది, తెలంగాణలో 34 మంది పనిచేసేందుకు అప్షన్లు ఇచ్చారు. అటవీశాఖలో 63 మందికి 22 మంది ఆంధ్రకు, 33 మంది తెలంగాణకు వచ్చేందుకు అంగీకరించారు. డీఈటీ విభాగంలో 8 మందికి ఏపీకి ఇద్దరు, తెలంగాణకు ఆరుగురు ఆప్షన్ ఇచ్చారు. మండల పరిషత్ కార్యాలయంలో 8 మంది ఉద్యోగులకు గాను ఏపీకి ముగ్గురు, తెలంగాణకు ఐదుగురు వచ్చేందుకు అంగీకరించారు. పంచాయతీరాజ్ శాఖ విభాగంలో ఉన్న ఆరుగురు కూడా తెలంగాణలోనే ఉండేందుకు అప్షన్ ఇచ్చారు.