breaking news
Merge zones
-
‘విలీన’ సమస్యల పరిష్కారానికే సీఎం పర్యటన
చింతూరు : విలీన మండలాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే ముఖ్యమంత్రి చింతూరు పర్యటన ముఖ్యోద్దేశమని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. సోమవారం ఆయన చింతూరులో విలేకరులతో మాట్లాడుతూ విలీన మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి పరిశీలిస్తారని, ఉపాధిహామీ పనులపై ఆరాతీస్తారని వివరించారు. ఐటీడీఏ, ట్రెజరీ కార్యాలయాలు ప్రారంభించడంతో పాటు విలీన మండలాల ప్రజలనుద్దేశించి బహిరంగ సభలో ప్రసంగిస్తారని చెప్పారు. వైద్యం, విద్య వంటి అపరిష్కృత సమస్యలపై ముఖ్యమంత్రి ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిపారు. నివేదికలతో సిద్ధం కండి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులంతా తమ శాఖల అభివృద్ధి నివేదికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. చింతూరు ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విలీన మండలాల్లో నిర్మాణంలో ఉన్న రహదారులు, కొత్తగా చేపట్టబోయేవి వంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. సొంత భవనాలు లేని అంగన్వాడీ కేంద్రాలపై నివేదిక తయారు చేయాలని, విలీన మండలాల్లో ముఖ్యమంత్రి స్థాయిలో పరిష్కారం కాగల సమస్యలపై నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన రోజున ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. అనంతరం గ్రీవెన్స్‌లో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఐటీడీఏ పీఓ కేవీఎన్ చక్రధరబాబు, సబ్ కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్ల పరిశీలన చింతూరు : చింతూరులో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. హెలిప్యాడ్ స్థలాన్ని సందర్శించారు. నిమ్మలగూడెంలో ముఖ్యమంత్రి ప్రారంభించే సీసీ రహదారి, పరిశీలించే అంగన్వాడీ కేంద్రం, ఉపాధిహామీ ఊటకుంటను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఐటీడీఏ భవనం, ట్రెజరీ కార్యాలయం, బహిరంగ సభ ప్రాంతాన్ని సందర్శించారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్, రంపచోడవరం ఎస్పీ నయీం అస్మీ ఉన్నారు. హెలిప్యాడ్ స్థలం మార్పు ముఖ్యమంత్రి రాక సందర్భంగా తొలుత నిర్దేశించిన హెలిప్యాడ్ స్థలాన్ని సోమవారం ఆగమేఘాలపై మరోచోటికి మార్చారు. తొలుత శబరి వంతెన సమీపంలో సంత ప్రాంగణంలో హెలిప్యాడ్ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీని సమీపంలో పూరిళ్లు ఉండడంతో, హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో అవి ఎగిరిపోతాయని భావించిన అధికారులు.. హుటాహుటిన హెలిప్యాడ్‌ను వీఆర్ పురం రహదారిలోని పొలాల్లోకి మార్చారు. అలాగే నిమ్మలగూడెంలో ముఖ్యమంత్రి పరిశీలించాల్సిన ఊటకుంట ప్రదేశానికి భద్రతా కారణాల రీత్యా పోలీసు శాఖ అభ్యంతరం తెలపడంతో, రహదారి పక్కనే మరో ఊటకుంట నిర్మాణాన్ని చేపట్టారు. మూడంచెల భద్రత : జిల్లా ఎస్పీ చింతూరు : ముఖ్యమంత్రి పర్యటనకు మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. సోమవారం ఆయన చింతూరులో విలేకరులతో మాట్లాడుతూ సరిహద్దుల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉండడంతో, భద్రత కోసం పలు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే 8 కంపెనీల గ్రేహౌండ్స్ బలగాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయని, మరో 10 కంపెనీల స్పెషల్‌పార్టీ పోలీసులు కూడా కూంబింగ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. 30 కంపెనీల రోడ్ ఓపెనింగ్ పార్టీలు, సీఆర్పీఎఫ్, ఆర్మడ్ స్పెషల్‌ఫోర్స్, క్యాట్ పార్టీలతో పాటు వెయ్యి మంది సాయుధ పోలీసులు నిరంతర పహారా కాస్తున్నట్టు తెలిపారు. భద్రాచలం నుంచి కాకినాడ వరకు రహదారులు, అటవీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని, హెలిప్యాడ్ నుంచి మూడు కి.మీ. వరకూ అన్ని ప్రాంతాల్లో ఆర్మ్డ్ గార్డ్స్‌ను మోహరించామని, కొంతమందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఇటీవల మావోయిస్టు నాయకుడు అనారోగ్యంతో మరణించిన విషయాన్ని ఇతర మావోయిస్టు నాయకులు గ్రహించి, జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. ఆయుధాలు వీడి సమాజాభివృద్ధికి పాటుపడాలని కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టు నాయకులెవరైనా ఉంటే తమను నేరుగా కానీ, మధ్యవర్తుల ద్వారా కానీ సంప్రదిస్తే.. వారికి వైద్యం చేయిస్తామని చెప్పారు. లొంగిపోయిన అనంతరం కేసులు నమోదు చేయకుండా, ప్రభుత్వం ద్వారా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. -
ఆ స్కూళ్లు మూత!
విలీన మండలాల్లో ఇదీ దుస్థితి * తెలంగాణలోకి వెళ్లిపోయిన టీచర్లు * చోద్యం చూసిన ఏపీ అధికారులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి ఏపీలో విలీనమైన ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ఇక్కడి టీచర్లు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తామంటూ పాఠశాలల నుంచి వెళ్లిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఏడు మండలాల్లోని టీచర్లను తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖలోకి తీసుకోవాలని ఆ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో తమను రిలీవ్ చేయాలని అక్కడి టీచర్లు గత కొంతకాలంగా కోరుతూ వచ్చారు. ఈ విద్యా సంవత్సరానికి ముందే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా ఏపీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టలేదు. టీచర్లు పదేపదే రిలీవ్ చేయాలని కోరినా ఉలుకూపలుకూ లేకుండా ఉండిపోయారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక టీచర్లను రిలీవ్ చేయాలని ఈ మండలాల విద్యాధికారులకు ఖమ్మం కలెక్టర్ చెప్పారు. ఈ సమస్యను మండల విద్యాధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయినా ఫలితం లేకపోవడంతో ఖమ్మం కలెక్టర్ సూచన మేరకు టీచర్లంతా మంగళవారం ఎవరికి వారు స్వచ్ఛందంగా రిలీవ్ లేఖలు రాసి ఇచ్చి స్కూళ్ల నుంచి వెళ్లిపోయారు. ఈ ఏడు మండలాలకు చెందిన 400 మంది టీచర్లు తెలంగాణకు వెళ్లారని, దీంతో అక్కడి అన్ని స్కూళ్లూ మూతపడ్డాయని తమకు సమాచారం వచ్చిందని ఏపీ పాఠశాల విద్యాశాఖ వర్గాలు వివరించాయి. జూలైలో రేషనలైజేషన్, బదిలీల సమయంలో ఈ మండలాలకు టీచర్లను ఏర్పాటుచేస్తామని, అప్పుడు రిలీవ్ అవ్వాలని తాము సూచించినా టీచర్లు పట్టించుకోకుండా స్వచ్ఛందంగా రిలీవ్ అయి వెళ్లారన్నారు. ఈ స్కూళ్లలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై విద్యాకార్యదర్శి ఆర్పీ సిసోడియాతో ‘సాక్షి’ సంప్రదించగా ఇతర మండలాల స్కూళ్లనుంచి టీచర్లను తాత్కాలికంగా ఏర్పాటుచేయనున్నామని, ఏ స్కూలూ మూత పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
ఆంధ్రా అధికారుల అడ్డగింత
భద్రాచలం: ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన మండలాల్లో ఉద్యోగుల వివరాలు సేకరించేందుకు బుధవారం భద్రాచలం వచ్చిన తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారులను ఇక్కడి ఉద్యోగులు అడ్డుకున్నారు. దీంతో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విలీన మండలాల్లో పాలనపై పట్టుసాధించేందుకు ఉద్యోగుల వివరాలు సేకరించాలనే ఏపీ ప్రభుత్వ ఆదేశం మేరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఆయా మండలాల్లోని ఉద్యోగుల జీతభత్యాల వివరాలు పంపించాలని డీడీవోలకు సూచించారు. ఈ క్రమంలో నెల్లిపాక మండల ఉపాధ్యాయుల వివరాల సేకరణకు అక్కడి అధికారులు వచ్చారు. విషయం తెలుసుకున్న ముంపు ఉద్యోగ సంఘ నాయకులు అక్కడికి చేరుకొని ఆంధ్ర అధికారులను అడ్డుకున్నారు. ఉద్యోగుల ఆప్షన్ల విషయం తేల్చకుండా వివరాల సేకరణకు ఎలా వస్తారని వారితో వాగ్వాదానికి దిగారు. ఆప్షన్ల మేరకు విలీన మండలాల్లో ఉన్న ఉద్యోగులను వెంటనే బదిలీ చేయాలని, ఆ తరువాతనే ఆంధ్ర అధికారులు ముంపు మండలాల్లో పర్యటించాలని కొద్దిసేపు ఘెరావ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన సద్దుమణిగేలా చూశారు. కాగా, ఉద్యోగుల నిరసనల మధ్య వివరాలు సేకరించకుండానే అధికారులు వెనుదిరిగారు.