ఆంధ్ర పల్లెల్లో ఒడిశా పాగా!

Local controversy over the years at Andhra-Odisha boundaries - Sakshi

కొఠాయా గ్రామాల్లో పొరుగు రాష్ట్రం అభివృద్ధి అస్త్రం

విలువైన ఖనిజ సంపదకు ఒడిశా గాలం

ఇన్నాళ్లూ వాటి అభివృద్ధిని పట్టించుకోని రెండు రాష్ట్రాలు

ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ఎన్నో ఏళ్లుగా తేలని స్థానికత వివాదం

చోద్యం చూస్తోన్న ఆంధ్రప్రదేశ్‌

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఏపీలోని విజయనగరం జిల్లా సాలూరు నుంచి నేరెళ్లవలస మీదుగా కొండలు, గుట్టలు దాటుకుని అడవి మార్గం గుండా వెళ్తే ఏపీ–ఒడిశా రాష్ట్రాల మధ్య 21 కొఠియా గ్రామాలు కనిపిస్తాయి. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి ప్రజలను కేవలం ఓటర్లుగానే చూస్తున్నాయి. రక్షిత నీరు, రహదారి సౌకర్యాలు కూడా లేని ఆ గ్రామాల్లో సంక్షేమ పథకాల జాడ ఎక్కడా కనిపించదు. పచ్చని ప్రకృతి అందాల మధ్య గిరిజనులు ఈ ప్రాంతంలో దుర్భర జీవితాలను గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వీటిపట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుంటే ఒడిశా మాత్రం ఇప్పుడు వాటిని సొంతం చేసుకునేందుకు వ్యూహం పన్నుతోంది. ఇందుకు ఆ గ్రామాల్లో అభివృద్ధి అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. తద్వారా విలువైన ఖనిజ సంపదకు గాలం వేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గిరిశిఖరాల్లో ఇదీ పరిస్థితి!
ఏపీలోని విజయనగరం జిల్లా, ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాల మధ్యనున్న కొఠియా పంచాయతీలోని 21 గ్రామాలనే కొఠియా గ్రామాలుగా పిలుస్తున్నారు. విజయనగరం నుంచి 60కి.మీల దూరంలో ఉన్న సాలూరుకు.. అక్కడి నుంచి 40 కి.మీ.ల మేర అడవులు, కొండల్లో ప్రయాణిస్తే గిరిశిఖరాల్లోని కొఠియా ప్రాంతాలకు చేరుకోవచ్చు. ఈ మార్గంలో దాదాపు 14 కి.మీ.ల మేర రోడ్డు అనేదే ఉండదు. రాళ్లూ, రప్పల్లో నడిచి వెళ్లాలి. అతికష్టం మీద జీపులో కొంతదూరం వెళ్లినా.. పక్కనే లోయల్లో ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ గ్రామాల్లో జనాభా దాదాపు 15 వేల మంది. దుంపలు, పళ్లు, పోడు వ్యవసాయమే వారి జీవనాధారం. ఒడిశాలోని కుండలి గ్రామం నుంచి కొఠియా గ్రామం వరకూ రహదారి సౌకర్యం ఉంది. సాలూరు నుంచి సరైన దారి లేదు. కొఠియా గ్రామంలో ఒడిశా ప్రభుత్వం ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, నేరెళ్లవలసలో ఏపీ ప్రభుత్వం ఒక పీహెచ్‌సీని ఏర్పాటుచేయడం మినహా మిగిలిన గ్రామాలకు వైద్య సదుపాయం లేదు. ఏదైనా ఉపద్రవం వస్తే డోలీల్లో వెళ్లాల్సిందే. అంగన్‌వాడీలు ఉన్నా లేనట్టే లెక్క. పౌష్టికాహారం లేక పిల్లలు, మహిళలు రక్తహీనతతో బాధపడుతుంటారు. ఇక్కడి గ్రామాల్లో విద్య కూడా అంతంతమాత్రమే. టీచర్లు ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి. రేషన్‌ బియ్యాన్ని కిలోమీటర్ల దూరం నడిచెళ్లి తెచ్చుకుంటారు. రక్షిత మంచినీటి మాటేలేదు. కొండల్లో పారే సెలయేర్లే దిక్కు. మావోయిస్టుల భయంతో ఈ గ్రామాలకు పోలీసులెవరూ రారు. కానీ, కొఠియా సర్కిల్‌ పేరిట ఈ గ్రామాలకు ఒక సీఐ, దాదాపు వంద మంది కానిస్టేబుళ్లను ఏపీ ప్రభుత్వం కేటాయించింది. వీరంతా కొఠియా సర్కిల్‌ పేరుతో సాలూరు కేంద్రంగా విధులు నిర్వర్తిస్తుంటారు.

గిరిజనులకు ఒడిశాకు గాలం
ఒడిశా ఏర్పడినప్పుడు గానీ.. ఏపీ అవతరించినప్పుడు గానీ ఈ గ్రామాల్లో సర్వే జరగలేదు. ఏ రాష్ట్రంలోనూ వీటిని కలపలేదు. ఈ గ్రామాలు తమవంటే తమవేనని ఇరు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. దీంతో 1968లో ఇరు రాష్ట్రాలూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పార్లమెంటులో తేల్చుకోవాల్సిందిగా 2006లో న్యాయస్థానం సూచించింది. అయినా, పరిష్కారం లభించలేదు. ఇటీవల ఓ న్యాయమూర్తి అధ్యక్షతన నిజ నిర్ధారణ కమిటీ ఏర్పడింది. ప్రస్తుతం ఆ కమిటీ అధ్యయనం చేస్తోంది. మరోవైపు.. ఒడిశా ప్రభుత్వం అభివృద్ధి, ఆకర్ష మంత్రంతో గిరిజనులకు చేరువవుతోంది. సాలూరు మండలంలో పట్టుచెన్నేరు, పగలుచెన్నేరు, తోణాం, గంజాయిభద్ర, సారిక తదితర పంచాయతీల్లో సుమారు 21 వివాదాస్పద గిరిశిఖర గ్రామాలున్నాయి. ఇక్కడ ఒడిశా ప్రభుత్వం తాగునీరు, సోలార్‌ లైట్ల ఏర్పాటు, ఇళ్లు, రహదారులు, వ్యక్తిగత మరుగుదొడ్లు, శ్మశాన వాటికలు, రేషన్‌ పంపిణీ, పింఛన్ల మంజూరు వంటి  పనులు చేపడుతోంది. అప్పట్లో ఇక్కడి గిరిజనులు ఏపీ వైపే మొగ్గు చూపారు. కానీ, టీడీపీ అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడంలేదన్నది ప్రస్తుతం వీరి ప్రధాన ఆరోపణ.

ఖనిజ నిక్షేపాలపై ఒడిశా కన్ను
కొఠియా గ్రామాల్లో విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. మాంగనీస్, ఇనుము, రంగురాళ్లు వంటి ఖనిజ సంపద ఎక్కువగా ఉంది. గ్రామాల్లోని ప్రజాభీష్టం మేరకే గిరిజనుల స్థానికతను కోర్టు కూడా నిర్ధారించే అవకాశం ఉందని భావిస్తున్న ఒడిశా సర్కార్, వారిని తమవైపు తిప్పుకుని ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు మార్గం సుగమం చేసుకుంటోంది. ఇందులో భాగంగా ఒడిశా అధికారులు ఈ గ్రామాల్లో తరచూ పర్యటిస్తున్నారని.. ఈ ప్రాంతాలపై వీడియో కూడా తీసుకుంటున్నారని గిరిజనులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం స్పందించకుంటే, సరిహద్దు గ్రామాల్లోని విలువైన ఖనిజ సంపదను ఒడిశా చేజిక్కించుకునే అవకాశం ఉంది.

ఆంధ్రాలో ఉండాలని ఉంది : గమ్మెల అర్జున్, కొఠియా గ్రామం
మా గ్రామానికి ఆంధ్రా నుంచి రోడ్డు లేదు. ప్రమాదకర మార్గంలో 30 కి.మీ.లు జీపులో ప్రయాణించి కుందిలి వైపు వెళ్తున్నాం. ఒడిశా ప్రభుత్వమే కొన్ని సంక్షేమ పథకాలు మంజూరు చేస్తోంది. కానీ, మాకు ఏపీలోనే ఉండాలని ఉంది.

ప్రభుత్వం దృష్టిలో లేదు : డాక్టర్‌ లక్ష్మీశ, పీఓ, ఐటీడీఎ, పార్వతీపురం
కొఠియా గ్రామాల అంశం ప్రభుత్వం దృష్టిలో పెద్దగా లేదు. అయితే, గ్రామాలను సర్వే చేయాలని భావిస్తున్నాం. దానికి అనుమతినిస్తూ ఆర్థిక వనరులు సమకూర్చాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాం. ఇంకా సమాధానం రాలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒడిశా ప్రభుత్వానికి కొఠియా గ్రామాలను అప్పగించం. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అందే ప్రతి సంక్షేమ పథకాన్ని అక్కడి గిరిజనులకు అందేలా చర్యలు తీసుకుంటాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top