breaking news
local controversy
-
ఆంధ్ర పల్లెల్లో ఒడిశా పాగా!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఏపీలోని విజయనగరం జిల్లా సాలూరు నుంచి నేరెళ్లవలస మీదుగా కొండలు, గుట్టలు దాటుకుని అడవి మార్గం గుండా వెళ్తే ఏపీ–ఒడిశా రాష్ట్రాల మధ్య 21 కొఠియా గ్రామాలు కనిపిస్తాయి. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి ప్రజలను కేవలం ఓటర్లుగానే చూస్తున్నాయి. రక్షిత నీరు, రహదారి సౌకర్యాలు కూడా లేని ఆ గ్రామాల్లో సంక్షేమ పథకాల జాడ ఎక్కడా కనిపించదు. పచ్చని ప్రకృతి అందాల మధ్య గిరిజనులు ఈ ప్రాంతంలో దుర్భర జీవితాలను గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటిపట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుంటే ఒడిశా మాత్రం ఇప్పుడు వాటిని సొంతం చేసుకునేందుకు వ్యూహం పన్నుతోంది. ఇందుకు ఆ గ్రామాల్లో అభివృద్ధి అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. తద్వారా విలువైన ఖనిజ సంపదకు గాలం వేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గిరిశిఖరాల్లో ఇదీ పరిస్థితి! ఏపీలోని విజయనగరం జిల్లా, ఒడిశాలోని కోరాపుట్ జిల్లాల మధ్యనున్న కొఠియా పంచాయతీలోని 21 గ్రామాలనే కొఠియా గ్రామాలుగా పిలుస్తున్నారు. విజయనగరం నుంచి 60కి.మీల దూరంలో ఉన్న సాలూరుకు.. అక్కడి నుంచి 40 కి.మీ.ల మేర అడవులు, కొండల్లో ప్రయాణిస్తే గిరిశిఖరాల్లోని కొఠియా ప్రాంతాలకు చేరుకోవచ్చు. ఈ మార్గంలో దాదాపు 14 కి.మీ.ల మేర రోడ్డు అనేదే ఉండదు. రాళ్లూ, రప్పల్లో నడిచి వెళ్లాలి. అతికష్టం మీద జీపులో కొంతదూరం వెళ్లినా.. పక్కనే లోయల్లో ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ గ్రామాల్లో జనాభా దాదాపు 15 వేల మంది. దుంపలు, పళ్లు, పోడు వ్యవసాయమే వారి జీవనాధారం. ఒడిశాలోని కుండలి గ్రామం నుంచి కొఠియా గ్రామం వరకూ రహదారి సౌకర్యం ఉంది. సాలూరు నుంచి సరైన దారి లేదు. కొఠియా గ్రామంలో ఒడిశా ప్రభుత్వం ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, నేరెళ్లవలసలో ఏపీ ప్రభుత్వం ఒక పీహెచ్‌సీని ఏర్పాటుచేయడం మినహా మిగిలిన గ్రామాలకు వైద్య సదుపాయం లేదు. ఏదైనా ఉపద్రవం వస్తే డోలీల్లో వెళ్లాల్సిందే. అంగన్వాడీలు ఉన్నా లేనట్టే లెక్క. పౌష్టికాహారం లేక పిల్లలు, మహిళలు రక్తహీనతతో బాధపడుతుంటారు. ఇక్కడి గ్రామాల్లో విద్య కూడా అంతంతమాత్రమే. టీచర్లు ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి. రేషన్ బియ్యాన్ని కిలోమీటర్ల దూరం నడిచెళ్లి తెచ్చుకుంటారు. రక్షిత మంచినీటి మాటేలేదు. కొండల్లో పారే సెలయేర్లే దిక్కు. మావోయిస్టుల భయంతో ఈ గ్రామాలకు పోలీసులెవరూ రారు. కానీ, కొఠియా సర్కిల్ పేరిట ఈ గ్రామాలకు ఒక సీఐ, దాదాపు వంద మంది కానిస్టేబుళ్లను ఏపీ ప్రభుత్వం కేటాయించింది. వీరంతా కొఠియా సర్కిల్ పేరుతో సాలూరు కేంద్రంగా విధులు నిర్వర్తిస్తుంటారు. గిరిజనులకు ఒడిశాకు గాలం ఒడిశా ఏర్పడినప్పుడు గానీ.. ఏపీ అవతరించినప్పుడు గానీ ఈ గ్రామాల్లో సర్వే జరగలేదు. ఏ రాష్ట్రంలోనూ వీటిని కలపలేదు. ఈ గ్రామాలు తమవంటే తమవేనని ఇరు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. దీంతో 1968లో ఇరు రాష్ట్రాలూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పార్లమెంటులో తేల్చుకోవాల్సిందిగా 2006లో న్యాయస్థానం సూచించింది. అయినా, పరిష్కారం లభించలేదు. ఇటీవల ఓ న్యాయమూర్తి అధ్యక్షతన నిజ నిర్ధారణ కమిటీ ఏర్పడింది. ప్రస్తుతం ఆ కమిటీ అధ్యయనం చేస్తోంది. మరోవైపు.. ఒడిశా ప్రభుత్వం అభివృద్ధి, ఆకర్ష మంత్రంతో గిరిజనులకు చేరువవుతోంది. సాలూరు మండలంలో పట్టుచెన్నేరు, పగలుచెన్నేరు, తోణాం, గంజాయిభద్ర, సారిక తదితర పంచాయతీల్లో సుమారు 21 వివాదాస్పద గిరిశిఖర గ్రామాలున్నాయి. ఇక్కడ ఒడిశా ప్రభుత్వం తాగునీరు, సోలార్ లైట్ల ఏర్పాటు, ఇళ్లు, రహదారులు, వ్యక్తిగత మరుగుదొడ్లు, శ్మశాన వాటికలు, రేషన్ పంపిణీ, పింఛన్ల మంజూరు వంటి పనులు చేపడుతోంది. అప్పట్లో ఇక్కడి గిరిజనులు ఏపీ వైపే మొగ్గు చూపారు. కానీ, టీడీపీ అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడంలేదన్నది ప్రస్తుతం వీరి ప్రధాన ఆరోపణ. ఖనిజ నిక్షేపాలపై ఒడిశా కన్ను కొఠియా గ్రామాల్లో విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. మాంగనీస్, ఇనుము, రంగురాళ్లు వంటి ఖనిజ సంపద ఎక్కువగా ఉంది. గ్రామాల్లోని ప్రజాభీష్టం మేరకే గిరిజనుల స్థానికతను కోర్టు కూడా నిర్ధారించే అవకాశం ఉందని భావిస్తున్న ఒడిశా సర్కార్, వారిని తమవైపు తిప్పుకుని ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు మార్గం సుగమం చేసుకుంటోంది. ఇందులో భాగంగా ఒడిశా అధికారులు ఈ గ్రామాల్లో తరచూ పర్యటిస్తున్నారని.. ఈ ప్రాంతాలపై వీడియో కూడా తీసుకుంటున్నారని గిరిజనులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం స్పందించకుంటే, సరిహద్దు గ్రామాల్లోని విలువైన ఖనిజ సంపదను ఒడిశా చేజిక్కించుకునే అవకాశం ఉంది. ఆంధ్రాలో ఉండాలని ఉంది : గమ్మెల అర్జున్, కొఠియా గ్రామం మా గ్రామానికి ఆంధ్రా నుంచి రోడ్డు లేదు. ప్రమాదకర మార్గంలో 30 కి.మీ.లు జీపులో ప్రయాణించి కుందిలి వైపు వెళ్తున్నాం. ఒడిశా ప్రభుత్వమే కొన్ని సంక్షేమ పథకాలు మంజూరు చేస్తోంది. కానీ, మాకు ఏపీలోనే ఉండాలని ఉంది. ప్రభుత్వం దృష్టిలో లేదు : డాక్టర్ లక్ష్మీశ, పీఓ, ఐటీడీఎ, పార్వతీపురం కొఠియా గ్రామాల అంశం ప్రభుత్వం దృష్టిలో పెద్దగా లేదు. అయితే, గ్రామాలను సర్వే చేయాలని భావిస్తున్నాం. దానికి అనుమతినిస్తూ ఆర్థిక వనరులు సమకూర్చాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాం. ఇంకా సమాధానం రాలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒడిశా ప్రభుత్వానికి కొఠియా గ్రామాలను అప్పగించం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందే ప్రతి సంక్షేమ పథకాన్ని అక్కడి గిరిజనులకు అందేలా చర్యలు తీసుకుంటాం. -
ఇరిగేషన్లో ‘స్థానిక’ చిచ్చు
257 మంది ఆంధ్ర ప్రాంత ఉద్యోగులను జోన్ల పేరిట తెలంగాణకు బదిలీ చేసిన ఏపీ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న టీ ఉద్యోగ సంఘాలు ఏపీ మంత్రి ఉమాకు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఫోన్ విధాన నిర్ణయం చేసే వరకు ఓపిక పట్టాలంటున్న తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఇరు రాష్ట్రాల మధ్య ఇంటర్మీడియట్ బోర్డుతో పాటు అనేక అంశాల్లో ఇప్పటికే ఎడతెగని సమస్యలు ఉండగా.. తాజాగా సాగునీటి శాఖలో ‘స్థానికత’ చిచ్చు రేపుతోంది. తెలంగాణకు సంబంధించి 5, 6 జోన్ల కింద ఉద్యోగాలకు ఎంపికై ఆంధ్రప్రదేశ్‌లోని 1, 2, 3, 4 జోన్లలో పనిచేస్తున్న 257 మంది ఇంజనీర్లను సొంత జోన్లకు వెళ్లిపోవాలంటూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వివాదానికి కారణం అవుతున్నాయి. ఏపీ స్థానికత కలిగిన ఇంజనీర్లు పెద్ద సంఖ్యలో 5, 6 జోన్లలో ఎంపికైనా తర్వాత వారిలో చాలామంది బదిలీపై వారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఎంపికైంది 5, 6 జోన్లలో అయినా తాము ఆంధ్ర ప్రాంతంలోనే పనిచేస్తామని వారు అక్కడి ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం వారంతా... 257 మంది అధికారులు ఇక్కడ చేరితే 5, 6 జోన్లలో పని చేస్తున్న తమ పదోన్నతుల అవకాశాలు దారుణంగా దెబ్బతిం టాయని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అంటున్నారు. ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సంఘం నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల విభజనపై కమల్‌నాథన్ కమిటీ తుది నిర్ణయం తీసుకునే వరకూ ఓపిక పట్టాలని తాము కోరుతున్నా ఏపీ ప్రభుత్వం తన పంథా మార్చుకోలేదంటూ తెలంగాణ ప్రభుత్వం మండిపడుతోంది. దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడానికి వెనుకాడబోమని ఓ సీనియర్ మంత్రి చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారంలోనూ ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు.. దానిపై అభ్యంతరం తెలుపుతూ మంత్రి హరీశ్ స్వయంగా ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావుకు లేఖ రాశారు. అయితే తుపాను సహా యక కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉన్నందున కార్యదర్శుల సమావేశాన్ని నిర్వహిద్దామని దేవినేని ప్రతిపాదించారు. అలాంటి సమావేశమేమీ ఇప్పటిరవకు జరుగలేదు. అసెంబ్లీ సమావేశాల అనంతరం సమావేశం నిర్వహణకు తెలంగాణ సిద్ధమవుతున్న తరుణంలో.. తాజా గా ఏపీ జారీ చేసిన ఉత్తర్వు మరో వివాదానికి కారణమైందని తెలంగాణ ప్రభుత్వం అంటోం ది. 1,2,3,4 జోన్లలో ఎంపికై తెలంగాణలో పనిచేస్తున్న ఇక్కడి స్థానిక ఉద్యోగులను ఆంధ్రాకు పంపించడంలో తామెలాంటి ఒత్తిడి చేయబోమని చెబుతోంది. వారు ఇక్కడే పనిచేసేలా అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తోంది. ఏపీకి నిరసన తెలిపిన తెలంగాణ తమతో సంప్రదించకుండానే ఆంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్న ఇంజనీర్లను బదలాయింపు చేయడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం సాయంత్రం ఏపీ మంత్రి దేవినేని ఉమతో ఫోన్లో మాట్లాడారు. అధికారుల బదలాయింపులను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విజ్ఞప్తిని ఆయన తోసిపుచ్చారు. బదలాయింపు చేసిన ఉద్యోగులందరికీ రిలీవ్ లెటర్లు అందజేసి, తక్షణమే సంబంధిత జోన్లను వెళ్లాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ వెంకటేశ్వర్రావుతో కూడా తెలంగాణ అధికారులు సంప్రదించారు. బదిలీలను ఆపాలని కోరుతూ.. ఏకపక్ష నిర్ణయంపై నిరసనను తెలియజేశారు. ఉద్యోగుల బదిలీ అంశాన్ని చట్ట పరిధిలో కాకుండా.. మానవతా దృక్పథంతో చూడాల్సి ఉంటుందని, దీనిపై తదుపరి చర్చలు జరిపే వరకూ ఎలాంటి బదిలీలు చేయరాదని ఏపీ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రెండు ప్రభుత్వాలు ఉమ్మడిగా విధాన నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి బదిలీలు చేయరాదని ఆ అధికారి చెప్పారు. వీలును బట్టి కార్యదర్శుల సమావేశం రెండు, మూడ్రోజుల్లోనే ఏర్పాటు చేసుకుందామని, ఆ తర్వాత ఉద్యోగుల విభజనపై ఓ అవగాహనకు వద్దామని తాము ప్రతిపాదించినా ఏపీ నుంచి సానుకూలత వ్యక్తం కాలేదని సదరు అధికారి తెలియజేశారు.