మెసేజ్ కొడితే మందు | Liquor home delivery through SMS | Sakshi
Sakshi News home page

మెసేజ్ కొడితే మందు

Nov 2 2013 4:51 AM | Updated on Oct 22 2018 2:17 PM

మెసేజ్ కొడితే మందు - Sakshi

మెసేజ్ కొడితే మందు

దుకాణానికి వెళ్లి మద్యం కొనుక్కోవడం మీకు ఇబ్బందా? మీరున్న చోటికే మద్యం రావాలా? త్వరలోనే ఆ కోరిక నెరవేరబోతోంది.

సాక్షి, హైదరాబాద్: దుకాణానికి వెళ్లి మద్యం కొనుక్కోవడం మీకు ఇబ్బందా? మీరున్న చోటికే మద్యం రావాలా? త్వరలోనే ఆ కోరిక నెరవేరబోతోంది. ఒక్క ఎస్‌ఎంఎస్ కొడితే చాలు మద్యం మీదగ్గరకే వచ్చేస్తుంది. ఆన్‌లైన్‌లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. మద్యం మిమ్ముల్ని మత్తులో ముంచెత్తుతుంది!! కోరిన వారికి మద్యం డోర్ డెలివరీ చేయడటానికి  ఎక్సైజ్ శాఖ సన్నాహాలు చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ బ్రూవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో మొత్తం 1,200 మద్యం దుకాణాలు తెరవాలని, వీటన్నింటినీ ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం చేయాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఒక కామన్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేయడంతోపాటు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేవారికి మద్యాన్ని డోర్ డెలివరీ చేసే అవకాశం కల్పించనున్నారు. ఇందుకు సంబందించిన ఫైలు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనల పట్ల సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సూచనప్రాయంగా అంగీకరించారు.
 
 1,200 దుకాణాల ద్వారా డోర్ డెలివరీ..!
 అధిక లెసైన్స్ ఫీజు కారణంగా రాష్ట్రంలో ఈ ఏడాది దాదాపు 1,200 మద్యం దుకాణాలు రెన్యువల్ కాలేదు. ఈ దుకాణాలను ఏపీబీసీఎల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే నడపాలని నిర్ణయించారు. వీటికి అవసరమైన సిబ్బంది కోసం ఎక్సైజ్ శాఖ ఇప్పటికే నియామకాలు చేపట్టింది. ఈ దుకాణాల ద్వారా మద్యం డోర్ డెలివరీ చేయించాలని ఎక్సైజ్  అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగంలో ఒక కామన్ మెయిల్ ఐడీ, ఒక సెల్ నంబర్ ద్వారా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అదే పద్ధతిని మద్యం విక్రయాల కోసం వినియోగించుకునేందుకు ప్రణాళిక రూపొందించారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే డెబిట్  లేదా క్రెడిట్ కార్డు ద్వారా ముందుగానే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మెసేజ్ ద్వారా అయితే.. మద్యానికి ఎంత ఖర్చవుతుందన్నది వెంటనే రిప్లై మెసేజ్ వస్తుంది.. డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలతో మళ్లీ మెసేజ్ పంపి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత చిరునామా ఆధారంగా ఏ ఔట్‌లెట్‌కు దగ్గరగా ఉందో గుర్తించి దుకాణానికి సమాచారం చేరవేసి డోర్ డెలివరీ చేస్తారు. దీనికి అదనంగా కొంత చార్జి వసూలు చేస్తామని, ఎంత సేపట్లో మద్యం అందించగలమో ఇప్పుడే చెప్పలేమని,  ఎక్సైజ్ విభాగం సీనియర్ అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement