తాగినోడికి తాగినంత! | Licences to the alcohol sales | Sakshi
Sakshi News home page

తాగినోడికి తాగినంత!

Jun 26 2015 2:52 AM | Updated on Aug 17 2018 7:44 PM

తాగినోడికి తాగినంత! - Sakshi

తాగినోడికి తాగినంత!

ఎప్పుడు పడితే అప్పుడు కావాల్సిన చోట మద్యం అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది...

- ఇక ఎక్కడపడితే అక్కడ మద్యం లభ్యం
- జిల్లాలో రూ.3 వేల కోట్ల ఆదాయమే లక్ష్యం
- లైసైన్సుల నుంచి సమకూరనున్న రూ.200 కోట్లు
- బాగా వ్యాపారం జరిగే దుకాణాల స్థానంలో ఔట్‌లెట్లు    
చిత్తూరు (అర్బన్) :
ఎప్పుడు పడితే అప్పుడు కావాల్సిన చోట మద్యం అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో మద్యం అమ్మకాల ద్వారా రెండేళ్లకు ఏకంగా రూ.3 వేల కోట్ల ఆదాయం సేకరించడమే లక్ష్యంగా 2015-17 మద్యం పాలసీ గెజిట్‌ను విడుదల చేసింది.     
 
గత ఏడాది జిల్లాలో మద్యం దుకాణాల లెసైన్సు ఫీజులు, పర్మిట్ రూమ్‌లు, దరఖాస్తు రుసుముల ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.150 కోట్లు సమకూరింది. మద్యం అమ్మకాల ద్వారా రూ.వెయ్యి కోట్ల వరకు ఆదాయం లభించింది.  అయితే గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ ఆదాయం ఆర్జించడానికి కొత్త ఎత్తుగడ వేసింది. గత ఏడాది జిల్లాలో ఎక్కడయితే ఎక్కువ మొత్తంలో మద్యం అమ్మకాలు జరిగాయో ఆ ప్రాంతాల్లో ఈసారి ప్రభుత్వ మద్యం దుకాణాల ఔట్ లెట్లు వెలుస్తాయి.

జిల్లాలోని ఎక్సైజ్ పోలీసు స్టేషన్లను ఆధారంగా చేసుకుని ప్రతి సర్కిల్‌లో గత ఏడాది ఎక్కడయితే అత్యధికంగా మద్యం అమ్మకాలు జరిగాయో ఆ ప్రాంతంలో పది శాతం ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడానికి గెజిట్‌లో ఆదేశాలు జారీ చేసింది. ఈ లెక్కన చిత్తూరు రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో 28 మద్యం దుకాణాలుంటే గత ఏడాది ఎక్కువ మొత్తంలో వ్యాపారం జరిగిన ఐరాల పాటూరు సంతగేటు, రంగంపేట క్రాస్, యాదమరి కన్నికాపురం ప్రాంతాల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తారు.

దీంతో పాటు  జిల్లాలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలకు చెందిన షాపింగ్ మాల్స్, మండలానికి యాభై వరకు ఉన్న అనధికార బెల్టు షాపులు, ప్రైవేటు మద్యం దుకాణాల్లో నిత్యం మద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక గత ఏడాది ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలను తెరవడానికి సమయం కేటాయించారు. అయినప్పటికీ ఉదయం 8 నుంచే దుకాణాల్లో మద్యం దొరికేలా వెసులుబాటు ఉండేది. ఈసారి అధికారిక మద్యం విక్రయాల సమయాన్ని కూడా మార్చేశారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయించుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలిచ్చేసింది.
 
సమకూరే ఆదాయమిదీ

అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ఈ సారి రూ.30 లక్షలు లెసైన్సు ఫీజు నిర్ణయించిన 151 దుకాణాల నుంచి రూ.45.3 కోట్లు, రూ.34 లక్షలు జరిగే 11 దుకాణాల నుంచి రూ.3.74 కోట్లు, రూ.37లక్షలు జరిగే 46 దుకాణాల నుంచి రూ.17.02 కోట్లు, రూ.45 లక్షలు జరిగే 112 దుకాణాల నుంచి రూ.50.4 లక్షలు, రూ.50 లక్షలు జరిగే 68 దుకాణాల నుంచి రూ.34 కోట్లు, రూ.40 లక్షలు జరిగే 21 దుకాణాల నుంచి రూ.8.4 కోట్లు లెసైన్సుల రుసుముల రూపంలో ఆదాయం సమకూరనుంది.

ఇది కాకుండా ఒక్కో దుకాణానానికి 4 దరఖాస్తులు వచ్చి పడ్డా దరఖాస్తుకు సగటున రూ.40 వేలు రుసుము లెక్కన రూ.6.56 కోట్లు, 410 మద్యం దుకాణాలకు పర్మిట్ గదుల రుసుము రూపంలో (ఒక్కో పర్మిట్ రూమ్‌కు రూ.2లక్షలు) రూ.8.2 కోట్లు వసూలు కానుంది. వీటితో పాటు మద్యం విక్రయాలు కలిపి రెండేళ్లకు జిల్లాలో సుమారు రూ.3 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి లభించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement