ఇదేనా కలిసుండే సంస్కృతి? | Lawmakers Discrimination on Human Rights: Haragopal | Sakshi
Sakshi News home page

ఇదేనా కలిసుండే సంస్కృతి?

Sep 9 2013 3:19 AM | Updated on Sep 1 2017 10:33 PM

ఇదేనా కలిసుండే సంస్కృతి?

ఇదేనా కలిసుండే సంస్కృతి?

ప్రజాతంత్ర హక్కుల పరిరక్షణలో పాలకులు వివక్ష చూపుతున్నారని పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ ధ్వజమెత్తారు.

జనగామ, న్యూస్‌లైన్: ప్రజాతంత్ర హక్కుల పరిరక్షణలో పాలకులు వివక్ష చూపుతున్నారని పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ ధ్వజమెత్తారు. ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా జనగాంలోని జూబ్లీగార్డెన్స్‌లో ఆదివారం జరిగిన తెలంగాణలో ప్రజాతంత్ర హక్కులు అంశంపై ఆయన మాట్లాడారు. సభ పెట్టుకునే హక్కు ఉన్నట్లుగానే.. అభిప్రాయం తెలియజేసే స్వేచ్ఛ కూడా ఇతరులకుందన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌లో నిర్వహించిన సభలో తెలంగాణకు చెందిన వ్యక్తి తన అభిప్రాయాన్ని వెలువరించినందుకు కొట్టించారని, కడప జిల్లాలో యూనివర్సిటీలో ఉపన్యాస కార్యక్రమానికి రాకుండా తనను అడ్డుకున్నారని తెలిపారు. 
 
 ఇదేనా కలిసుందామనే సంస్కృతి అని ప్రశ్నించారు. ఇరువైపులా నుంచి కలుసుండాలనే భావన ఉంటేనే ఐక్యత సాధ్యమవుతుందని, ఒకరు విడిపోదామని చెబుతుంటే.. బలవంతంగా కలుసుందామనే భావన సరి కాదన్నారు. తెలంగాణ పౌరులు తమ ప్రాంతంలో సభ పెట్టుకుంటామని అడిగితే అనుమతివ్వని ప్రభుత్వం, సీమాంధ్రుల సభ విజయవంతానికి అన్నివిధాలా సహకరించిందన్నారు. వీక్షణం ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ..పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని సీడబ్ల్యూసీలో చేసిన తీర్మానంలోనే కుట్ర దాగి ఉందని అన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం కోసమే సీమాంధ్ర పెట్టుబడి దారులు కుట్రతో ఉమ్మడి రాజధాని ప్రకటన చేయించారన్నారు.  1956లో తెలంగాణ రాష్ట్రం విలీనమైన సమయంలో పెట్టిన షరతులు అమలు కాకపోవడంతో విలీనం మాత్రమే రద్దవుతుందని ఆయన వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement