నూతనంగా ఏర్పాటు చేసిన తుళ్లూరు పోలీస్ సబ్‌డివిజన్‌ను గుంటూరు అర్బన్ జిల్లాలో కలపాలని ప్రభుత్వం, డీజీపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
సాక్షి, గుంటూరు: నూతనంగా ఏర్పాటు చేసిన తుళ్లూరు పోలీస్ సబ్‌డివిజన్‌ను గుంటూరు అర్బన్ జిల్లాలో కలపాలని ప్రభుత్వం, డీజీపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం జరగనున్న తుళ్లూరు పోలీస్‌స్టేషన్ గుంటూరు రూరల్ జిల్లా పరిధి, మంగళగిరి, తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లు గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో ఉన్నాయి.
దీంతో వీవీఐపీలు రాజధాని ప్రాంతానికి వస్తున్నప్పుడు అర్బన్, రూరల్ జిల్లాల పోలీస్ అధికారులు, సిబ్బంది వారం ముందు నుంచే బందోబస్తు ఏర్పాట్లు చూడాల్సి వస్తోంది. రాజధాని ప్రాంతంలో ఏదైనా నేరం జరిగినప్పుడు ఇద్దరూ అప్రమత్తం కావాల్సి వస్తోంది. ఉదాహరణకు రెండు నెలల క్రితం రాజధాని ప్రాంతంలో పంటపొలాల్లో వెదురు బొంగులు దహనం చేసినప్పుడు ఇద్దరు ఎస్పీలూ పదిహేను రోజులపాటు ఆ పనిమీదే దృష్టి సారించాల్సి వచ్చింది.
దీంతో రోజువారీ కార్యకలపాలకు ఇబ్బంది ఏర్పడింది.ఇప్పటి వరకు సత్తెనపల్లి పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో ఉన్న తుళ్లూరు, అమరావతి, పెదకూరపాడు పోలీస్‌స్టేషన్‌లను అప్‌గ్రేడ్ చేస్తూ ఇద్దరు సీఐలను నియమించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా తుళ్లూరులో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు, వీటన్నిటినీ కలిపి తుళ్లూరు పోలీస్ సబ్‌డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఇప్పటి వరకు రూరల్ జిల్లా పరిధిలో ఉన్న తుళ్లూరు సబ్‌డివిజన్‌ను గుంటూరు అర్బన్ జిల్లాలో కలపాలని రూరల్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ఇటు డీజీపీ, అటు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. సమన్వయలోపం రాకుండా ఉండాలంటే రాజధాని ప్రాంతం మొత్తం అర్బన్‌లో ఉండేలా చూడాలని ఆయన సూచించారు.
ఏపీఎస్పీ బెటాలియన్‌కు స్పెషల్ బ్యారక్ ల ఏర్పాటు ....
తుళ్లూరు ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ హడావుడి, వీవీఐపీల తాకిడి అధికమైంది. దీంతో వీవీఐపీల పర్యటనలు ఉన్నప్పుడల్లా గుంటూరు చుట్టుపక్కల నుంచి బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. అంతేకాకుండా ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ముగిసి రైతులకు చెక్కుల పంపిణీ జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా తుళ్లూరుకు శాశ్వతంగా 82 మందితో కూడిన ఒక కంపెనీ ఏపీఎస్పీ సిబ్బందిని కేటాయించారు. తుళ్లూరు-అమరావతి మార్గంలో నూతనంగా ఏపీఎస్పీ సిబ్బందికి స్పెషల్ బ్యారక్‌లను నిర్మించారు. ఇక్కడే నివాసం ఉంటూ వీవీఐపీల భద్రత, శాంతి భద్రతలను పరిరక్షించనున్నారు.