ఖాళీ జాగాలో వేసెయ్‌ పాగా..

Land Grabs in Bobbili Vizianagaram - Sakshi

బొబ్బిలిలో ఆక్రమణలో జోరు..

రెచ్చిపోతున్న అధికార పార్టీ నాయకులు

చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు

విజయనగరం, బొబ్బిలి: పట్టణంలోని ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అధికార పార్టీ నాయకులు అక్కడ వాలిపోతారు.  ముందుగా కొయ్యిలు లేదా కంచెలు వేస్తారు.. అక్కడకు కొద్ది రోజుల తర్వాత పాకలు వేస్తారు.. మరికొద్ది రోజులకు  ఆ ప్రాంతాన్ని చిన్న చిన్న ప్లాట్లుగా విభజించేందుకు రియల్టర్లను తీసుకువచ్చి ఆ స్థలాన్ని విక్రయించేస్తారు. ఇదంతా అధికార పార్టీ నాయకుల కనుసన్నలలో జరుగుతున్నా అధికార పార్టీ నాయకులు నోరు మెదపకపోవడం విశేషం. బొబ్బిలిలోని పలు చెరువు గట్లు, గర్భాలు, ఖాళీ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. అన్ని విభాగాల్లోనూ టీడీపీ నాయకులే అధికారం చెలాయిస్తుండడంతో విలువైన స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. కాసింత ఇంటి జాగాకు పేద ప్రజలు దరఖాస్తు చేసుకుంటే బుట్టదాఖలా అవుతున్న ఈ రోజుల్లో లక్షల విలువ చేసే స్థలాలు కబ్జాకు గురికావడంపై ప్రజలు మండిపడుతున్నారు. పట్టణంలో ఉన్న దాదాపు మూడు చెరువులు ఇప్పటికే కప్పేసి విక్రయించేశారు.

ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, వసతి గృహాలు, చెరువులు కాదేదీ ఆక్రమణకనర్హమన్న రీతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారు. మున్సిపాలిటీలోని కిచిడీ బందలో ఇటీవల ఆక్రమణలను గుర్తించిన అధికారులు బోర్డులు పాతడంతో వాటిని తొలగించి మరీ చదును చేశారంటే అధికార పార్టీ నాయకుల బరితెగింపు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పట్టణంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఐటీఐ కాలనీ ఒకటి. ఇక్కడ ఇంటిగ్రేటెడ్‌ వసతి గృహ సముదాయాలు, బీసీ వసతి గృహాలు, ఉద్యాన వన క్షేత్రాలున్నాయి. వీటి అంచునే కాలనీ ఉంది. ఇంటిగ్రేటెడ్‌ వసతి గృహం ఎదురుగా ప్రభుత్వ స్థలముంది. ఇక్కడ పలువురు పశువుల పాకలు వేసుకుని వినియోగిస్తున్నారు. అయితే స్థానిక టీడీపీ నాయకులు వారిలో కొందరిని వెళ్లగొట్టి అక్కడ ఇంటి స్థలాలకు మార్కింగ్‌లు చేశారు.  కొయ్యలు పాతి, గోతులు తవ్వేసి ఇళ్ల నిర్మాణాలకు సిద్ధమైపోయారు. మరో పక్క ఇప్పటికే అక్కడ చాలా మంది ఆక్రమణలతో బినామీ పేర్లతో ఇళ్లను నిర్మించుకుని ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

వసతిగృహం ఎదురుగా....
బొబ్బిలి ఇంటిగ్రేటెడ్‌ బాలికల వసతిగృహం ఎదురుగా ప్రభుత్వ స్థలం ఉంది. పట్టణంలోని 21వ వార్డులో ఉన్న ఈ ఖాళీ ప్రభుత్వ స్థలంలో స్థానిక టీడీపీ నాయకులు  ఇళ్ల నిర్మాణం కోసం గోతులు తీశారు. సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన ఈ స్థలానికి ప్రహరీ లేకపోవంతో గోతులు తీసి, నిర్మాణ సామగ్రి కూడా వేశారు. అంతే కాదు ఇక్కడ చాలా బిట్ల అమ్మకాలకు కొంత నగదు కూడా చేతులు మారినట్టు సమాచారం!  అయితే రెవెన్యూ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.  

రెండకరాల కబ్జా..
 పట్టణ నడిబొడ్డున మేదరి బంద చెరువుంది. ఇక్కడ  దాదాపు రెండకరాల స్థలం కబ్జా అయిపోయింది. విచిత్రమేమంటే ఇక్కడ మున్సిపల్‌ తీర్మానం చేసి మరీ కొంత స్థలం చేపల మార్కెట్‌కు కేటాయించారు. ఇక్కడ ప్రభుత్వమే కబ్జాకు పాల్పడితే ఇక స్థానికులు ఆగుతారా? బరితెగించిపోయారు. ఇప్పుడు మరికొన్ని రోజుల్లో మేదరి బంద చెరువును మున్సిపల్‌ రికార్డుల్లో తొలగించాల్సింది. కేవలం ఈ రెండే కాదు. గొల్లపల్లిలో అధికారులు చొరవ తీసుకుని పరిశీలిస్తే రహదారులను కూడా ఆక్రమించేసిన సంఘటనలున్నాయి. అధికారులతో స్థానిక ప్రజాప్రతినిధులు ఆడుతున్న కబ్జాపర్వం తెగ సాగుతోంది. ఇప్పటికైనా జిల్లాస్థాయి అధికారులు స్పందించి ఆక్రమణదారుల చెర నుంచి స్థలాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top