అవినీతి రహిత పాలన

 Kolagatla Veerabhadra Swamy Election Campaign In Vizianagaram - Sakshi

వైఎస్సార్‌ సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్‌ కోలగట్ల హామీ 

విజయనగరం రూరల్‌/మున్సిపాలిటీ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అవినీతి రహిత పాలన అందిస్తామని ఉత్తరాంధ్ర కన్వీనర్, పార్టీ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గొల్లలపేట పంచాయతీ పరిధిలోని చాకలిపేట, కోరాడపేట, కొత్తకాపుపేట గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ నాలుగేళ్ల 10 నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలతో కాలక్షేపం చేసి ప్రజల సంక్షేమాన్ని విస్మరించారన్నారు. 2014 ఎన్నికల్లో 600 హామీలిచ్చి వాటిని విస్మరించి ప్రజలను మోసగించారన్నారు.

నలభయ్యేళ్ల అనుభవం ఉందని.. గద్దెనెక్కితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని.. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తానన్న హామీతో ప్రజలు గద్దెనెక్కిస్తే ప్రజలను, రాష్ట్రాన్ని చంద్రబాబు రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారన్నారు. ఓటుకు నోటు కేసులో భయపడి 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చి తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమానికి తెర తీస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా చాకలిపేట, కోరాడపేటకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సారిక ఈశ్వరరావు, సారిక శ్రీను, సారిక మహేష్, బుతల సంతోష్, సురేష్, సారిక కుమార్, సారిక బొబ్బి, కొండపల్లి సురేష్‌కుమార్, బోనిల హరిప్రసాద్, శ్రీకాంత్, వీర్రాజు, సాయి, మురళి తదితరులు కోలగట్ల సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. పార్టీ మండల అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జగన్‌ నాయకత్వం కోసం నిరీక్షణ
అయిదేళ్ల టీడీపీ హయాంలో గ్రామ, వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవినీతి, అక్రమాలు పెచ్చుమీరిపోయాయని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ విజయనగరం నియోజకవర్గ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం అయ్యన్నపేట ప్రాంతంలో పర్యటించారు. దివంగత వైఎస్సార్‌సీపీ నేత యడ్ల రమణమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై విసుగు చెందిన ప్రజలు తమ జీవితాలకు ఒక భరోసాను, ఒక భద్రతను కల్పించే జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు యడ్ల రాజేష్, లంక సత్యం, మహంతి ప్రసాద్, నడుపూరు రమణ, జామి సూరిబాబు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top