అమ్మ సొమ్ము అప్పనంగా! | Sakshi
Sakshi News home page

అమ్మ సొమ్ము అప్పనంగా!

Published Sun, Feb 24 2019 12:15 PM

Kanaka Durgamma Temple Officials Are Spending Money Unneccessarily  - Sakshi

సాక్షి, విజయవాడ : దుర్గగుడి అభివృద్ధి కోసం భూసేకరణ చేసి భూ యజమానులకు నష్టపరిహారం ఇచ్చే విషయంలో అమ్మ సొమ్మును అప్పనంగా కరిగించేశారు. అధికార పార్టీ నేతలు, రెవెన్యూ, దుర్గగుడి అధికారులు కలిసి అనర్హులుకు కూడా రూ.కోట్లు ఇచ్చారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో జరిగిన అవినీతి వల్ల నష్టపోయిన వారు ఇప్పుడు న్యాయ పోరాటానికి దిగుతున్నారు. 

ఆస్తి ఒకరిది.. పరిహారం  మరొకరికి..  
మల్లికార్జునపేటలో ఓ వృద్ధురాలికి పిల్లలు లేరు. దీంతో ఓ బాబును పెంచుకుంది. ఆమెకు ఉన్న 151 గజాల స్థలం పెంపుడు కొడుకుకు ఇచ్చింది. ఆ తర్వాత కొడుకు పెళ్లి విషయంలో తల్లికొడుకుల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో తల్లి ఇచ్చిన స్థలాన్ని ఆమెకు వెనక్కు ఇచ్చేస్తూ  కొడుకు రిజిస్ట్రేషన్‌ చేయించాడు. ఆ తరువాత తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.  ఇది జరిగిన కొద్ది రోజులకు ఆ వృద్ధురాలు చనిపోయింది. అయితే అదే స్థలాన్ని నకిలీ పత్రాలు  సృష్టించి పెంపుడు కొడుకు మరొకరికి విక్రయించాడు. అయితే ఈ విషయాలను పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు స్థలం కొనుక్కున వ్యక్తే అసలైన యజమాని అని నిర్ణయించి గజానికి రూ.63 వేల చొప్పున రూ.95.13 లక్షలు నష్ట పరిహారంగా చెల్లించారు.

ఎవరైనా ఆస్తి కొనుక్కునేటప్పుడు ఈసీని పరిశీలిస్తారు. ఇక్కడ అధికారులు కనీసం ఈసీలను  పరిశీలించడం కానీ, న్యాయవాదుల సలహాలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై తర్వాత వివాదమైంది. చివరకు సీబీఐ వరకు వెళ్లడంతో వారు వచ్చి విచారణ చేశారు. ఈ విధంగా అసలైన అర్హుల్ని గుర్తించకుండా చెల్లింపులు చేయడం వెనుక టీడీపీ నాయకుల హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేతలకు రూ.లక్షలు ముట్టడంతో వారు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి నష్ట పరిహారం ఇప్పించేశారు. ప్రస్తుతం ఈ విషయంపై ఆ వృద్ధురాలి  బంధువులు న్యాయపోరాటం చేస్తున్నారు.

ప్రభుత్వ స్థలానికి రూ.30 లక్షలు  
భూసేకరణలో భాగంగా జాతీయ రహదారి పక్కనే ఉన్న మరుగుదొడ్లను కూల్చివేశారు. ఆ తరువాత ఆ భూమి తమదేనంటూ ఒకరు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తీసుకువచ్చారు. దీంతో ఆ వ్యక్తి కోర్టుకు వెళ్లతాడని భావించిన అధికారులు పుష్కరాలకు పనులు ఆలస్యం అవుతాయంటూ ఆ పత్రాల ఆధారంగా అమ్మవారి సొమ్ము రూ.30 లక్షలు చెల్లించినట్లు అప్పట్లో ఇళ్లు కోల్పోయిన వారు చెబుతున్నారు. నాయకులు సిఫార్సుల మేరకు రెవెన్యూ అధికారులు ధ్రువీకరించడం, దుర్గగుడి అధికారులు కళ్లుమూసుకొని నష్టపరిహారం చెల్లించేశారు. 

రూ.60 కోట్లు ఖర్చు చేసినా.. 
అమ్మవారి మూలధనం పుష్కలంగా ఉండటంతో అప్పట్లో రూ.60 కోట్లు కరిగించి స్థల సేకరణ చేశారు. ఆ తరువాత కేవలం అర్జున వీధిని కొద్దిగా విస్తరించడం మినహా ఏమీ చేయలేకపోయారు. అప్పట్లో దుర్గగుడి అధికారులు తగు జాగ్రత్తలు తీసుకొని ఉంటే కోట్లాది రూపాయల అమ్మవారి సొమ్ము కాపాడేందుకు అవకాశం ఉండేదని దుర్గమ్మ భక్తులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అప్పట్లో ఇచ్చిన విజిలెన్స్‌ నివేదికను పరిశీలించి  బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా అనర్హుల నుంచి అమ్మ సొమ్ము రికవరీలు చేయాలని భక్తులు కోరుతున్నారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement