రెడ్‌బుక్‌ రాక్షసం.. జంగిల్ రాజ్ బీభత్సం | Assassination attempt on Ambati Rambabu with a detailed sketch | Sakshi
Sakshi News home page

రెడ్‌బుక్‌ రాక్షసం.. జంగిల్ రాజ్ బీభత్సం

Feb 1 2026 4:50 AM | Updated on Feb 1 2026 4:52 AM

Assassination attempt on Ambati Rambabu with a detailed sketch

దాడులు, దౌర్జన్యాలతో టీడీపీ రౌడీ మూకల స్వైర విహారం 

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దు్రష్పచారం బెడిసికొట్టడంతో డైవర్షన్‌ కుట్ర

టీడీపీ పెద్దల ప్రోద్బలంతో వైఎస్సార్‌సీపీ నేతలపై హత్యాయత్నాలకు కుతంత్రం 

పక్కా స్కెచ్‌తో అంబటి రాంబాబుపై హత్యాయత్నం

సాక్షి, అమరావతి: చంద్రబాబు రెడ్‌బుక్‌ రాజ్యాంగం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తాము చేసిన దుష్ప్రచార కుట్ర బెడిసి కొట్టడంతో చంద్రబాబు ముఠా అసహనంతో రగిలిపోతోంది. దాంతో తిరుమల పవిత్రతను దెబ్బ తీసేందుకు తాము పన్నిన పన్నాగం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఏకంగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు బరి తెగించారు. 

అదే ముసుగులో తాము లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్‌సీపీ నేతలపై హత్యాయత్నాలకు తెగబడటంతోపాటు.. వారిపైనే అక్రమ కేసులు నమోదు చేసి వేధించేందుకు కుతంత్రం పన్నారు. ఈ పచ్చ మూకల దారుణ బీభత్స కాండను పోలీసు యంత్రాంగం చేష్టలుడిగి చోద్యం చూస్తోంది. వరుస దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలతో రాష్ట్రంలో చంద్రబాబు ముఠా రావణకాష్టం రగిలిస్తోంది.  

లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచార కుట్ర బెడిసి కొట్టడంతో..  
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కళంకం తీసుకువచ్చేందుకు చంద్రబాబు చేసిన దుష్ప్రచార కుట్ర బెడిసి కొట్టింది. తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పశువుల కొవ్వు, పందికొవ్వు కలిసిందంటూ చేసిన భారీ కుట్ర, దేశంలోని ప్రతిష్ఠాత్మక ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ ల్యాబ్‌లు ఇచి్చన నివేదికలతో పూర్తిగా భగ్నమైంది. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ దర్యాప్తులో స్పష్టం కావడంతో శ్రీవారి భక్తులు ఊరట చెందారు. 

కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న చంద్రబాబు రాజకీయ కుట్ర కోసం ఇంతగా దిగజారడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో ఆ అంశంపై నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు టీడీపీ కూటమి అత్యవసరంగా మరో కుతంత్రానికి తెరతీసింది. లడ్డూ ప్రసాదంపై టీడీపీ దుష్ప్రచారంతో లడ్డూ ప్రసాదానికి కలిగిన కళంకానికి పరిహారంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాయశి్చత్త పూజలు, యజ్ఞాలు నిర్వహించాలని నిర్ణయించింది. 

ఇదే అదనుగా డైవర్షన్‌ రాజకీయాల కోసం చంద్రబాబు ప్రభుత్వం కొత్త కుతంత్రం పన్నింది. ప్రాయశ్చిత్త దీక్షలు, పూజలను అడ్డుకోవడం పేరుతో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు తెగబడాలని తమ పార్టీ కార్యకర్తలు, గూండాలను రంగంలోకి దించింది. కర్రలు, రాడ్లు, రాళ్లు, ఇతర మారణాయుధాలు పట్టుకుని మరీ కనిపించిన వారిపై విచక్షణా రహితంగా దాడులతో విరుచుకు పడాలని ఆదేశించింది. 

పోలీసు యంత్రాంగం ఉదాసీనంగా ఉండి పరోక్షంగా సహకరిస్తారని.. టీడీపీ గూండాలు ఎవరూ వెనక్కు తగ్గవద్దని స్పష్టం చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు స్వయంగా అధికార పార్టీనే పన్నాగం పన్నడం విభ్రాంతి కలిగిస్తోంది. తద్వారా లడ్డూ ప్రసాదంపై తాము చేసిన దుష్ప్రచారం నుంచి ప్రజల దృష్టిని శాంతిభద్రతల సమస్యపైకి మళ్లించాలన్నది టీడీపీ లక్ష్యం.

 అదే అవకాశంగా చేసుకుని తాము లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్‌సీపీ కీలక నేతలపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడాలన్నది లోగుట్టు. అనంతరం వారిపైనే అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేయాలన్నది పన్నాగం. వెరసి తిరుమలపై చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు మరచిపోయేట్టు చేయడమే టీడీపీ కుట్ర అంతిమ లక్ష్యం.  

పక్కా పన్నాగంతోనే అంబటిపై హత్యాయత్నం 
ప్రభుత్వ ముఖ్యనేత ఆదేశాలతో టీడీపీ గూండాలు బరితెగించారు. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పక్కా పన్నాగంతో హత్యాయత్నానికి తెగబడ్డారు. లడ్డూ ప్రసాదానికి చంద్రబాబు కలిగించిన కళంకానికి ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆయన గుంటూరులోని గోరంట్లకు శనివారం ఉదయం బయలుదేరారు. అప్పటికే కర్రలు, రాడ్లు, రాళ్లు పట్టుకుని మాటువేసిన టీడీపీ గూండాలు అంబటి రాంబాబు వాహనంపై ఒక్కసారిగా ముప్పేట దాడి చేశారు. ఆయన వాహనంపైకి రాళ్లు విసిరి బీభత్సం సృష్టించారు. 

వాహనాన్ని కదలనివ్వకుండా అడ్డుకుని ఆయన్ని కిందకు దించి హత్య చేయాలన్నది వారి లక్ష్యం. ఆయన వాహనంపైకి టీడీపీ గూండాలు దండెత్తినా సరే పోలీసులు వారిని వారించేందుకు యత్నించనే లేదు. ఆ హత్యాయత్నం నుంచి అంబటి రాంబాబు అతి కష్టం మీద తప్పించుకుని బయటపడ్డారు. కానీ టీడీపీ గూండాలు మాత్రం శాంతించ లేదు.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలోనే టీడీపీ రౌడీలు అంబటి రాంబాబు నివాసంపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. విచక్షణారహితంగా రాళ్లు విసిరారు. ఆయన నివాసంలోకి చొరబడి ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేసి భయోత్పాతం సృష్టించారు. ఇంటి ముందు పార్కింగ్‌ చేసిన వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇంట్లో వారిపై దాడికి పాల్పడ్డారు. రాత్రికి ఆయన కారుకు, కార్యాలయానికి నిప్పు పెట్టారు.

బాధితుడైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు 
టీడీపీ గూండాల దాడిలో బాధితుడైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు నమోదు చేసి పోలీసులు తమ ప్రభు భక్తిని చాటుకున్నారు. తనపై హత్యాయత్నానికి పాల్పడుతున్న వారిని వారించేందుకు అంబటి రాంబాబు యత్నించారు. తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్న వారితో ఆయన వాగ్వాదానికి దిగారు. ఆ వాగ్వాదాన్ని వక్రీకరిస్తూ టీడీపీ కార్యకర్తలు ఆయనపైనే ఫిర్యాదు చేయడం గమనార్హం. ఆ వెంటనే నకిరేకల్‌ పోలీసులు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు గుంటూరులోని ఆయన నివాసానికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. 

ఆయనపై వేర్వేరు పోలీసు స్టేషన్లలో అక్రమ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. అంటే ఆయనపై అక్రమ కేసు ఒక్క నకిరేకల్‌ పోలీసు స్టేషన్‌కే పరిమితం కాదని స్పష్టమవుతోంది. తద్వారా ఆయన్ను వేధించాలన్నదే ప్రభుత్వ పెద్దల లక్ష్యం. కాగా, తమకు భద్రత కల్పించాలని అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి రాష్ట్ర హైకోర్టులో శనివారం రాత్రి అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు.  

దాడులు, దౌర్జన్యాలతో భయోత్పాతం  
లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచార కుట్రకు ప్రాయశ్చిత్త పూజలు చేసే వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులతో విరుచుకుపడాలని టీడీపీ కేంద్ర కార్యాలయం ఆదేశించింది. ఈ క్రమంలో తిరుపతిలో పరిహార హోమం నిర్వహిస్తున్న టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డిపై దాడికి యత్నించారు.  పల్నాడు జిల్లా యడ్లపాడులోని వెంకటేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించి తిరిగి వస్తున్న మాజీ మంత్రి విడుదల రజినీపై టీడీపీ రౌడీ మూకలు దూషిస్తూ దాడికి యత్నించారు.  

వినుకొండలో పరిహార పూజలు నిర్వహించి ర్యాలీగా వస్తున్న  మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడును అడ్డుకున్నారు. ఆయుధాలు పట్టుకుని రోడ్లపై తిరుగుతున్న టీడీపీ గూండాలను విడిచిపెట్టి, తమను అడ్డుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీంతో లాఠీలతో పోలీసులు విరుచకుపడ్డారు. ఈ ఘటనలో బ్రహ్మనా­యుడు గాయపడ్డారు. 

కానీ లడ్డూ ప్రసాదంపై దుష్ప్ర­చారం చేస్తూ టీడీపీ నేతలు పెట్టిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించకపోవడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఇదే రీతిలో టీడీపీ దాడులు, దౌర్జన్యాలకు కొమ్ము కాస్తున్నారు. ప్రభుత్వ పెద్దల కుట్ర, పోలీసుల అండతో టీడీపీ రౌడీ మూకలు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, దౌర్జన్యాలతో అరాచకానికి తెగబడుతున్నాయి.  

పోలీసు విధులేంటి? వారు చేసిందేంటి?  
అంబటి లక్ష్యంగా టీడీపీ గూండాల దాడి.. టీడీపీ గూండాగిరికి ప్రభుత్వ యంత్రాంగం దాసోహం
రాష్ట్రంలో చంద్రబాబు రౌడీ మూకలు సృష్టిస్తున్న జంగిల్‌ రాజ్‌ అరాచకానికి పోలీసు యంత్రాంగం కొమ్ము కాస్తోంది. అంబటి రాంబాబును అంతం చేయడమే లక్ష్యంగా టీడీపీ గూండాలు శనివారం ఉదయం నుంచి అర్ధరాత్రి వర­కు ఆయన వాహనం, పార్టీ కార్యాలయం, నివాసాలపై వరుస దాడులకు తెగబడ్డారు.  అయినా పోలీసు యంత్రా­ంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విస్మయ పరిచింది. 

అంబటి ప్రాణాలకు ముప్పు ఉందని గుర్తించిన వైఎ­స్సార్‌సీపీ అధిష్టానం.. ముఖ్య నేతలు ఆయనకు తక్ష­ణం భద్రత కల్పించాలని కోరేందుకు చేసిన ప్రయత్నా­లను ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రతినిధులు ఈ అంశంపై డీజీపీ హరీష్ కుమార్‌ గుప్తాతో మాట్లాడేందుకు యత్నించినా ఆయన స్పందించలేదు. 

ఓ మాజీ మంత్రి ప్రాణాల­కు ముప్పు ఉందనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ఐదారు గంటలపాటు ప్రయత్నించినా కనీసం అందుబాటులోకి రాలేదు. శాంతి భద్రతల అదనపు డీజీ మధుసూదన్‌రెడ్డిని సంప్రదించేందుకు బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బా­రెడ్డి ప్ర­యత్నించారు. 

ఆయన కూడా వారికి అందుబాటులోకి రా­లేదు. దాంతో అంబటి రాంబాబుకు భద్రత కల్పించే అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్‌ దృష్టికి తీసుకువెళ్లేందుకు బొత్స సత్యనారాయణ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. కనీసం గుంటూరు జిల్లా ఎస్పీతో మాట్లాడి అంబటికి పటిష్ట భద్రత కల్పించాలని కోరా­లని బొత్స, వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నించారు. వారిద్దరి ఫోన్‌ కాల్స్‌కు గుంటూరు ఎస్పీ స్పందించ లేదు.  

ఉద్దేశపూర్వకంగా పోలీసు పెద్దల ప్రేక్షక పాత్ర  
వందలాది మంది టీడీపీ గూండాలు దాడితో అంబటి రాంబాబు దంపతులు ఓ గదిలో తలుపు వేసుకుని ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచి్చంది. పరిస్థితి చేయి దాటిపోతుండడంతో మాజీ హోం మంత్రి మేకతోటి సుచరితతోపాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతల బృందం గుంటూరు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ను కలిసేందుకు శనివారం రాత్రి ఆయన కార్యాలయానికి వెళ్లింది. దాదాపు గంటపాటు ఎస్పీ కార్యాలయంలో వేచి ఉన్నా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ వారిని కలవనేలేదు. 

గంట తర్వాత అదనపు ఎస్పీ రమణమూర్తిని కలవమని సమాచారం ఇచ్చారు. దాంతో వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం అదనపు ఎస్పీ రమణమూర్తిని కలిసి పరిస్థితిని వివరించారు.  రాత్రి 10.30 గంటల సమయంలో అంబటి రాంబాబును పోలీసులు ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. మరోవైపు టీడీపీ గూండాలు శనివారం అర్థరాత్రి దాటినా అంబటి రాంబాబు కార్యాలయం, నివాసాలపై దాడులకు పాల్పడుతూ విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నారు.  

అర్థరాత్రి 12 గంటల సమయంలో ఆయ  ఇంటి ముందున్న కారుకు నిప్పంటించారు. తెల్లవారేసరికి ఆయన నివాసాన్ని నేలమట్టం చేస్తామని టీడీపీ గూండాలు బహిరంగంగా ప్రకటిస్తున్నా పోలీసులు మాత్రం వారిని అడ్డుకునేందుకు కనీసం ప్రయత్నించక పోవడం విస్మయ పరుస్తోంది. ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలతోనే పోలీసు పెద్దలు ఉద్దేశ పూర్వకంగా ప్రేక్షక పాత్ర పోషించినట్లు స్పష్టమవుతోంది. కాగా, ఇటీవల వైఎస్సార్‌సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి ఇంటిపై టీడీపీ రౌడీ మూకలు ఇదే తీరులో విధ్వంసం సృష్టించినా పోలీసులు స్పందించలేదు. పైగా ఆయనపైనే కేసు పెట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement