ఇప్పటి వరకూ రూ.10.80 లక్షల అర్పణం

Kakinada Mayor Pavani Shocking Car Allowance Bills East Godavari - Sakshi

ఇప్పటి వరకూ రూ.10.80 లక్షల అర్పణం 

నిబంధనల ప్రకారం రూ.30 వేల గౌరవ వేతనం

అందులోనే ప్రయాణ భత్యం 

అయినప్పటికీ రూ.45 వేల కారు అలవెన్స్‌ 

జీవోను తుంగలో తొక్కి మరీ మంజూరు

అందుకోసం కౌన్సిల్‌లో తీర్మానం

ప్రభుత్వ అనుమతి కూడా తీసుకోని వైనం 

కాకినాడ కార్పొరేషన్‌ నిర్వాకం

జిల్లా కేంద్రమైన కాకినాడ నగరానికి ఆమె ప్రథమ పౌరురాలు. ప్రజలందరికీ ఆదర్శంగా ఉండాల్సిన పదవిలో ఉన్న ఆమె.. అదే ప్రజల సొమ్ము దుబారాగా ఖర్చు చేస్తూ.. దర్జాగా షి‘కారు’ చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను సహితం తుంగలో తొక్కి.. అధికారమే అండగా.. కౌన్సిల్‌లో ప్రత్యేకంగా తీర్మానం ఆమోదింపజేసుకుని మరీ.. తన కారు కోసం ప్రతి నెలా నగరపాలక సంస్థ ఖజానా నుంచి రూ.45 వేలు తీసుకుంటున్నారు. కాకినాడ మేయర్‌ సుంకర పావని సాగిస్తున్న ఈ వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాకినాడ: నగరపాలక సంస్థల్లో మేయర్లకు, కార్పొరేటర్లకు; పురపాలక సంఘాల్లో చైర్మన్లకు, కౌన్సిలర్లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనాలపై ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలను రూపొందించింది. ఆయా స్థానిక సంస్థల స్థాయి, ప్రాధాన్యాన్ని బట్టి నెలనెలా చెల్లించాల్సిన వేతనాన్ని నిర్ధారిస్తూ 2016 డిసెంబర్‌ 15న పుర పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జీవోఎంఎస్‌ నంబర్‌ 335 జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఆయా కార్పొరేషన్లు, మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో రికార్డు చేసి, అమలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మేయర్‌కు ప్రయాణ భత్యంతో కలిపి గౌరవ వేతనాన్ని రూ.30 వేలు. వాస్తవానికి 2016లో జీవో సవరణకు ముందు ఈ మొత్తం రూ.14 వేలు మాత్రమే ఉండగా, దీనిని రెట్టింపు పైగా పెంచారు. అలాగే డిప్యూటీ మేయర్ల గౌరవ వేతనం రూ.20 వేలు, కార్పొరేటర్లకు రూ.6 వేలుగా నిర్ధారించారు. దీని ప్రకారం ఆయా స్థానిక ప్రజాప్రతినిధులకు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.

కాకినాడ మేయర్‌ సుంకర పావనికి కూడా ఈ ఉత్తర్వుల మేరకు ప్రతి నెలా రూ.30 వేల గౌరవ వేతనాన్ని నగరపాలక సంస్థ ఖజానా నుంచి చెల్లిస్తున్నారు. 2017 ఆగçస్టులో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్‌గా ఎన్నికైన నాటి నుంచి ఈ మొత్తాన్ని ఆమెకు ఇస్తూనే ఉన్నారు. ఆమె తన కోసం ప్రత్యేకంగా ఓ కారు ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆ అధికారాన్ని, హోదాను, మెజారిటీని అడ్డం పెట్టుకుని కారు కోసం కౌన్సిల్‌లో తీర్మానం కూడా చేయించేశారు. అనంతరం టెండర్‌ పిలిచి మరీ మేయర్‌కు కారు కేటాయించారు. నిర్వహణ, డ్రైవర్‌ జీతంతో కలిపి మేయర్‌ వినియోగిస్తున్న ఆ కారు కోసం నగరపాలక సంస్థ ప్రతి నెలా రూ.45 వేల చొప్పున చెల్లిస్తోంది. ఒకవైపు మేయర్‌ హోదాలో రూ.30 వేల గౌరవ వేతనం ఇస్తూనే.. దీంతోపాటు కారుకు రూ.45 వేల చొప్పున ఇచ్చేస్తున్నారు. రెండేళ్లుగా ఈ అదనపు సొమ్మును అలవెన్స్‌ రూపంలో నగరపాలక సంస్థే భరిస్తోంది. రెండేళ్లకు కలిపి సుమారు రూ.10.80 లక్షల వరకూ మేయర్‌ కారు కోసం చెల్లించినట్టు స్పష్టమవుతోంది.

ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి మరీ..
ఏదైనా అంశంలో ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా కౌన్సిల్‌ తీర్మానం చేస్తే.. ఆ తీర్మానాన్ని విధిగా ప్రభుత్వానికి పంపి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆమోదిస్తేనే ఆ తీర్మానం అధికారులు అమలు చేయాల్సి ఉంటుంది. అయితే మేయర్‌కు కారు ఏర్పాటు చేసే విషయంలో ఈ నిబంధనలను నాటి నగరపాలక సంస్థ అధికారులు ఏమాత్రం ఖాతరు చేయలేదు. కౌన్సిల్‌ పరంగా ఓ తీర్మానాన్ని ఆమోదింపజేసి, మేయర్‌కు కారు ఏర్పాటు చేసి, ప్రతి నెలా రూ.45 వేల చొప్పున కాంట్రాక్టర్‌కు చెల్లించేస్తున్నారు. కౌన్సిల్‌కు ఎన్ని అధికారాలున్నా ఇలా ప్రభుత్వ ఉత్తర్వులను అడ్డగోలుగా ఉల్లంఘించి, తీర్మానం చేయడం, అధికారులు సైతం దీనికి సై అనడం విమర్శలకు తావిస్తోంది. ఇలా మేయర్‌కు ప్రత్యేకంగా కారు అలవెన్స్‌ చెల్లించడం తప్పని తెలిసినా.. అప్పటి అధికారులు టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి నిర్ణయాలు తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పుడీ ఈ వ్యవహారం కార్పొరేషన్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కౌన్సిల్‌ తీర్మానం మేరకే..
మేయర్‌కు కారు ఏర్పాటు చేయాల్సిందిగా అప్పట్లో కౌన్సిల్‌ తీర్మానం చేసింది.ఆ తీర్మానానికి అనుగుణంగానే టెండర్‌ ద్వారా కారు తీసుకునిమేయర్‌కు ఇచ్చాం.– సత్యనారాయణరాజు,డీఈ, కాకినాడనగరపాలక సంస్థ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top