శ్రీకాంత్‌ను ఖాళీ చేయించండి

Kabaddi Players Complaint Against Yalamanchili Srikanth - Sakshi

జిల్లా వర్థమాన కబడ్డీ క్రీడాకారులు

విజయవాడ స్పోర్ట్స్‌:  కబడ్డీలో రాణించాలనే మా కున్న ఆశలపై, ప్రతిభపై కొన్నేళ్లుగా యలమంచిలి శ్రీకాంత్‌ నీళ్లు చల్లడమే కాకుండా వేధింపులకు గురిచేస్తున్నాడని జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారులు ఆరోపించారు. ఈ విషయమై మూడేళ్లుగా ఎంత మంది అధికారులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మునిసిపల్‌ కమిషనర్, శాప్‌ ఉన్నతాధికారులు, నగర పోలీసు అధికారులు, అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ అండదండలు ఉండడంతో శ్రీకాంత్‌ ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని అన్నారు.  కె.చైతన్య, ఇ.రామకృష్ణ, వి.పూర్ణతోపాటు సుమారు 30 మంది వర్థమాన క్రీడాకారులు మంగళవారం ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ కార్యదర్శిగా పనిచేసిన శ్రీకాంత్‌ అవినీతికి, అసోసియేషన్‌ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో అసోసియేషన్‌ నుంచి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్‌ తొలిగించిన విషయాన్ని గుర్తుచేశారు.

అప్పటి శాప్‌ ఎండీ బంగారురాజుకు శ్రీకాంత్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధంతో సుమారు రూ.6లక్షల విలువచేసే అధునాతన జిమ్‌ కేటాయిస్తే, ఆ జిమ్‌లో శ్రీకాంత్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పపడిన విషయాన్ని గుర్తు చేశారు. అతను ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలోని కబడ్డీ అసోసియేషన్‌ రూమ్‌లు, జిమ్‌ ఆక్రమించి ఖాళీ చేయడం లేదన్నారు. దీనిపై తాము, కృష్ణాజిల్లా  కబడ్డీ అసోసియేషన్‌ అడహక్‌ కమిటీ పెద్దలు శాప్‌ అధికారులకు, మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులకు, పోలీసు ఉన్నతాధికారులకు, 1100 ప్రజావేదికకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమన్నారు. అసోసియేషన్‌ రూమ్‌లు, శాప్‌ ఇచ్చిన జిమ్‌ ఉపయోగించుకునే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీకాంత్‌ చేతుల్లో నుంచి రూమ్‌లు, జిమ్‌ను విడిపించాల్సిన మునిసిపల్‌ కమిషనర్‌ జె.నివాస్‌ కూడా మిన్నకుండిపోయారన్నారు. ఇందుకు సీఎం కార్యాలయంలోని కీలమైన ఓ ఎమ్మెల్సీ ఒత్తిడి కారణమని ఆరోపించారు.

ఆ ఎమ్మెల్సీ పేరును త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. 2017 మే నెలలో జరిగిన సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపు నిధులను రూ.4,85,000 నిబంధనలకు విరుద్దంగా శ్రీకాంత్‌కు చెందిన సొంత అకౌంట్‌లోకి   బదాలాయించారన్నారు. దీనిపై ప్రస్తుత శాప్‌ ఎండీ విచారణ చేయించి చర్యలు తీసుకోవాలని కోరారు.  దొంగ వయసు ధ్రువీకరణ పత్రాలతో అడ్డగోలు సెలెక్షన్స్‌ ఇస్తే వాటిపై తాము సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశామని అయినా పట్టించుకోలేదన్నారు. దొంగ సర్టిఫికెట్లతో ఆడినవారికి అప్పటి శాప్‌ ఎండీ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. విచారించిన సీఐడీ అధికారులు అప్పటి శాప్‌ ఎండీ నివేదికను పంపిస్తే ఆ ఫైల్‌ను అతీగతీలేకుండా లేకుండా చేశారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి  కబడ్డీ అసోసియేషన్‌ రూమ్‌లు ఖాళీ చేయించి, ప్రాక్టీస్‌ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top