హైకోర్టు తొలి సీజేగా జస్టిస్‌ జేకే మహేశ్వరి

Justice Jitendra Kumar Maheshwari Appointed As CJ Of AP High Court - Sakshi

రాష్ట్రపతి ఉత్తర్వులు.. కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌

9 నెలలు ఏసీజేగా పనిచేసిన జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జస్టిస్‌ మహేశ్వరి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మధ్యప్రదేశ్‌ హైకోర్టులో నంబర్‌ టూ స్థానంలో ఉన్న జస్టిస్‌ మహేశ్వరిని పదోన్నతిపై ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించేందుకు సిఫారసు చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానం చేయడం తెలిసిందే. దీనికి ప్రధాని మోదీ ఆమోద ముద్ర వేయడంతో జస్టిస్‌ మహేశ్వరి నియామక ఫైలు రాష్ట్రపతికి చేరింది. తాజాగా రాష్ట్రపతి సైతం ఆ నియామకానికి ఆమోదముద్ర వేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీజేగా జస్టిస్‌ మహేశ్వరి నియామకం అమల్లోకి వస్తుందని కేంద్రం తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

జస్టిస్‌ మహేశ్వరి ప్రమాణ స్వీకారం తేదీ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. దసరా సెలవుల తర్వాతే ప్రమాణ స్వీకారం ఉండే అవకాశముందని హైకోర్టు వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పాటైన నాటి (జనవరి 1, 2019) నుంచి సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే)గా వ్యవహరిస్తున్నారు. గత 9 నెలలుగా ఏసీజేగా ఆయన విధులను నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయి సీజే నియామకంతో జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ సీనియర్‌ న్యాయమూర్తిగా రెండో స్థానంలో కొనసాగుతారు.

జస్టిస్‌ మహేశ్వరి నేపథ్యమిదీ..
జస్టిస్‌ మహేశ్వరి 1961 జూన్‌ 29న జన్మించారు. 1985 నవంబర్‌ 22న న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. మధ్యప్రదేశ్‌ హైకోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించి సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పట్టు సాధించారు. 2005 నవంబర్‌ 25న మధ్యప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2008లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. హైకోర్టు సీజేగా 2023 జూన్‌ 28న పదవీ విరమణ చేస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top