జ్యుడీషియల్‌ ప్రివ్యూ లోగో ఆవిష్కరణ

Judicial preview logo invention - Sakshi

ఏపీ జ్యుడీషియల్‌ ప్రివ్యూ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: జడ్జి జ్యుడీషియల్‌ ప్రివ్యూ అధికారిక లోగోను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. దీనితో పాటు ఏపీ జ్యుడీషియల్‌ ప్రివ్యూ వెబ్‌సైట్‌  judicialpreview. ap. gov. in ను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిష్టాత్మకమైన ఈ చట్టం ఆగస్టు 14 నుంచి అమలులోకి వచ్చిన విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్‌ మౌలిక సదుపాయాల (న్యాయపరమైన ముందస్తు సమీక్ష తద్వారా పారదర్శకత)–2019, చట్టాన్ని అనుసరించి న్యాయపరమైన ముందస్తు సమీక్ష ద్వారా పారదర్శకతను తెచ్చి, ప్రభుత్వ వనరులను అనుకూలమైన రీతిలో వినియోగించుకునేటట్లు చూడటానికి ఇది వీలును కలిగిస్తుంది.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఏజెన్సీ గానీ, స్థానిక అధికారి గానీ రూ. 100 కోట్లు, అంతకుమించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల టెండరు పత్రాలన్నింటినీ న్యాయపరమైన ముందస్తు సమీక్ష కోసం న్యాయమూర్తికి సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం జడ్జి జ్యుడీషియల్‌ ప్రివ్యూగా బి.శివశంకరరావును నియమించింది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా జరిగిన ఈ కార్యక్రమంలో జడ్జి జ్యుడిషియల్‌ ప్రివ్యూ డాక్టర్‌ బి.శివశంకరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, ముఖ్య కార్యదర్శి రజత్‌ భార్గవ, స్టాంపులు–రిజిస్ట్రేషన్‌ శాఖ కమిషనర్‌ అండ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ సిద్ధార్థ జైన్, రాష్ట్ర ప్రభుత్వ అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్, పరిశ్రమల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఏవీ పటేల్, ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌–గుంటూరు వై.శరత్‌బాబు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top