మానవత్వం చాటిన న్యాయమూర్తి

Judge humanity - Sakshi

హైకోర్టు జస్టిస్‌ శివశంకరరావు చొరవతో మతి స్థిమితం లేని వ్యక్తికి వైద్యసేవలు

కాకినాడ లీగల్‌ : రోడ్డుపై పడి ఉన్న వృద్ధుడిని చూసిన హైకోర్టు జస్టిస్‌ శివశంకరరావు కారు దిగి పరిశీలించి వెంటనే కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేసి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే హైకోర్టుకు జస్టిస్‌ శివశంకరరావు జిల్లాలోని పలు పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి బుధవారం వచ్చారు. అన్నవరంలో సత్యనారాయణస్వామిని దర్శించుకుని అక్కడ నుంచి రాజమహేంద్రవరం కారులో వెళ్తుండగా పెద్దాపురం ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో పడి ఉన్న వృద్ధుడిని చూశారు.

వెంటనే కారుదిగి వృద్ధుడిని పరిశీలించగా స్పహకోల్పోయి ఉన్నట్టు గుర్తించారు. రాజమహేంద్రవరం ప్రధాన జిల్లా జడ్జి ఎన్‌.తుకారామ్‌జీకి ఫోన్‌లో సమాచారం తెలియజేసి ప్రభుత్వాస్పత్రిలో వైద్యసేవలు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

దీంతో ప్రధాన జిల్లాజడ్జి పెద్దాపురం మండల లీగల్‌ సర్వీస్‌ అథారిటీ సభ్యులకు ఫోన్‌ చేసి సమాచారం తెలియజేశారు. వెంటనే వారు అక్కడకు చేరుకుని వృద్ధుడికి ప్రాథమిక వైద్య సేవలు అందజేసి, అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి పంపించి కాకినాడ మండల లీగల్‌ సర్వీస్‌ అథారిటీ సభ్యులకు వివరాలు తెలియజేశారు.

దీంతో కాకినాడ మండల లీగల్‌ సర్వీస్‌ అథారిటీ సభ్యులు ప్రభుత్వాస్పత్రిలోకి తీసుకువెళ్లగా ఆస్పత్రిలో ముందుగా పేరు, ఊరు, ఎటువంటి సమాచారం లేని వ్యక్తులకు ఓపీ ఇవ్వలేమంటూ సిబ్బంది నిరాకరించారు. దీంతో న్యాయమూర్తికి విషయం తెలియజేశారు.

న్యాయమూర్తి జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌కు ఫోన్‌ చేసి అనాథకు వైద్యసేవలు అందజేయాలని సూచించారు. దీంతో అనాథను ఆస్పత్రిలో చేర్చుకోవడానికి అంగీకరించి వైద్యులకు, సిబ్బందికి వైద్యసేవలు అందజేయాలని సూపరింటెండెంట్‌ సూచించారు. పేరు, ఊరు చెప్పలేకుండా ఉన్న అతని మానసిక పరిస్థితి బాగుండకపోవడంతో వైద్యులు అతనిని ప్రత్యేక వార్డులో ఉంచి సేవలు అందిస్తున్నారు. మతిస్థిమితంలేని ఆ అనాథకు క్షౌవరం చేయించి, శుభ్రంగా స్నానం చేయించి  వైద్య సేవలు అందిస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top