
జూబ్లీ ఆసుపత్రిలో మందుల కొరత
నెల్లూరులోని జూబ్లీ ఆసుపత్రిని మందుల కొరత పట్టి పీడిస్తోంది. చంటిబిడ్డలకు కచ్చితంగా వేయాల్సిన జపనీస్ ఎన్కాఫిలిటిస్ (మెదడు వాపు వ్యాధికి సంబంధించిన) టీకా రెండు....
నెల్లూరు (వైద్యం) : నెల్లూరులోని జూబ్లీ ఆసుపత్రిని మందుల కొరత పట్టి పీడిస్తోంది. చంటిబిడ్డలకు కచ్చితంగా వేయాల్సిన జపనీస్ ఎన్కాఫిలిటిస్ (మెదడు వాపు వ్యాధికి సంబంధించిన) టీకా రెండు నెలలుగా అందుబాటులో లేదు. ఈ టీకా కోసం ఆయా ఆసుపత్రుల చుట్టూ బాలింతలు ప్రదక్షిణలు చేస్తున్నారు.
వ్యయ ప్రయాసలకోర్చి వచ్చిన బాలింతలు టీకామందు నిల్వ లేదు అనే ఆసుపత్రి సిబ్బంది సమాధానంతో నిరాశగా వెనుతిరుగుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంటి బిడ్డలకు సంబంధించిన మందులు ఎప్పటికప్పుడు ఉన్నాయా లేవా అన్న వాటిపై జూబ్లీ ఆసుపత్రిలో పర్యవేక్షణ లోపించింది.
ఆసుపత్రిలోని ఇమ్యునైజేషన విభాగంలో ప్రతి బుధ, శనివారాల్లో ఆయా టీకాలను వేస్తారు. డెలివరీ అయిన వెంటనే పుట్టిన శిశువులకు ప్రతి రోజూ వేస్తారు. జిల్లాలోని అతిపెద్ద ఆసుపత్రి అయిన జూబ్లీలో ఇలాంటి పరిస్థితులు ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పుట్టిన బిడ్డకు టీకాలు ఇలా..
పుట్టిన ప్రతి శిశువుకు 10 గంటలలోపు హెపటైటిస్ బి, క్షయ, పోలియే టీకాలను వేయాల్సివుంది. దీనినే జీరో డోస్ అంటారు.
ఒకటిన్నర నెల తర్వాత మళ్లీ వారికి అవే టీకాలతో పాటుగా డిఫ్తీరియా టీకాను కచ్చితంగా అందించాల్సివుంది. తిరిగి 10 నెలల తర్వాత మీజిల్స్, విటమిన్-ఎ టీకాను వేయాలి. అదేవిధంగా 16 నుంచి 24 నెలల లోపు వీటన్నిటితో పాటు డీపీటీ టీకాలను ప్రతి ఆరు నెలలకోసారి అందించాల్సివుంది. ఈ టీకాలన్నింటినీ క్రమం తప్పకుండా ఐదేళ్ల వరకు ఇవ్వాల్సివుంటుంది. 10 నుంచి 16 ఏళ్లలోపు టీటీ వ్యాక్సిన్‌తో ఈ టీకాల కార్యక్రమం పూర్తవుతుంది.